Vidadala Rajini: గుంటూరు వెస్ట్ ఎవరికైనా పీడకలే ! విడదల రజని ఏమవుతుందో..?

గుంటూరు వెస్ట్.. ఇక్కడ పాగా వేయాలని అన్ని పార్టీలు గట్టిగానే ప్లాన్‌ చేస్తాయి. కానీ.. పోటీ చేస్తున్న నాయకులు మాత్రం మరోసారి బరిలో నిలబడలేకపోతున్నారు. మరి విడుదల రజని విషయంలో గుంటూరు పశ్చిమం సెంటిమెంట్ మరోసారి రిపీట్‌ అవుతుందో లేక ఇక చరిత్రగానే మిగిపోతుందో చూడాలి.

  • Written By:
  • Publish Date - January 10, 2024 / 02:08 PM IST

Vidadala Rajini: గుంటూరు జిల్లాలోని కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో ఒకటి గుంటూరు పశ్చిమం. క్లాస్, మాస్ ఓటర్లతో కలగలసిన అర్బన్‌ ఏరియా ఇది. ఇక్కడ పాగా వేయాలని అన్ని పార్టీలు గట్టిగానే ప్లాన్‌ చేస్తాయి. కానీ.. పోటీ చేస్తున్న నాయకులు మాత్రం మరోసారి బరిలో నిలబడలేకపోతున్నారు. అప్పుడెప్పుడో పోటీ చేసిన చల్లా వెంకటకృష్ణారెడ్డి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దాలి గిరి వరకు ఒకటే సమస్య. ఎవరైనా ఒకసారే గెలుస్తారు. రెండోసారి పోటీ చేసినా ఫలితం ఉండటం లేదు. ఇంకా చెప్పాలంటే అసలు రాజకీయ భవిష్యత్తే ఉండట్లేదు. టీడీపీ నుంచి చల్లా వెంకటకృష్ణారెడ్డి, శనక్కాయల అరుణ, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి తాడిశెట్టి వెంకట్రావు, కన్నా లక్ష్మీనారాయణ సింగిల్‌ టైంకే పరిమితం అయ్యారు.

YSRCP: శ్రీకాకుళం వైసీపీ లీడర్ల కష్టాలు.. మామూలుగా లేవుగా !

గత ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచి వైసీపీ కండువా కప్పుకున్న మద్దాలి గిరికి కూడా వన్‌టైమ్‌ ముచ్చటగానే మిగిలిపోయింది. వీళ్ళలో ఎవరికీ ఈ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసే అవకాశం రాలేదు. ఒకరిద్దరు పోటీ చేసినా.. గెలిచిన చరిత్రే లేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు గుంటూరు వెస్ట్‌ పేరు చెబితేనే కంగారు పడుతున్నారట అన్ని పార్టీల నాయకులు. పశ్చిమం అంటే తూర్పు తిరిగి దండం పెట్టడమేనంటున్నారు. ఇంకొందరైతే పోటీ చేయాలా వద్దా అని జాతకాలు చూపించుకుంటున్నారట. సీరియస్‌గానే జన్మ నక్షత్రాల ప్రకారం రాజయోగం ఉందో లేదోనని క్రాస్‌ చెక్‌ చేయించుకుంటున్నారట ఆ నేతలు. ఇప్పుడు ఈ సీటు ఆశిస్తున్న నాయకులు కూడా అలాంటి చోట మరీ ఎగబడాల్సిన అవసరం ఏముంది. నినాదంగా, ఒకటికి రెండు సార్లు పరిశీలించుకుని, ఒకరికి ఇద్దరు జ్యోతిష్యుల దగ్గర జాతక చక్రాలు వేయించుకుని ఫైనల్‌గా నిర్ణయం తీసుకుందామని అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎప్పుడో జరిగిన సంగతులు దేనికి.. కళ్ళ ముందు మద్దాలి గిరి కనిపిస్తున్నాడుగా అని అంటున్నారట వెస్ట్‌ టిక్కెట్‌ ఆశావహులు. అంతకు ముందు ఎమ్మెల్యేగా పనిచేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా వైసీపీలో చేరాక ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకున్నట్టు కనిపిస్తోంది.

2014 వరకు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి పవర్‌ పాలిటిక్స్‌ నడిపిన కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి కూడా అంతే. దాదాపు తొమ్మిదేళ్లపాటు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేని పరిస్థితిలోకి వెళ్ళారు. ఇలా ఏ నాయకుడి చరిత్ర తిరగేసినా గుంటూరు పశ్చిమలో పోటీ చేయటం ఒక రకంగా రాజకీయ ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటమేనన్న భావనకు వచ్చారట. దీంతో ఎలాగోలా పోటీ చేసి, గెలిస్తే గెలిచాం.. లేదంటే కనీసం నియోజకవర్గం ఇన్చార్జిగా అయినా మిగులుతాం అనుకునేవాళ్ళు తెగించి మరీ బరిలో దిగాలనుకుంటున్నట్టు మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి విడుదల రజని విషయంలో గుంటూరు పశ్చిమం సెంటిమెంట్ మరోసారి రిపీట్‌ అవుతుందో లేక ఇక చరిత్రగానే మిగిపోతుందో చూడాలి.