రాజమండ్రి ఎంపీ (MP) టికెట్ మీద.. వైసీపీ (YCP)లో ఇప్పుడు హాట్ హాట్ చర్చ జరుగుతోందట. అభ్యర్థిగా సెన్సేషనల్ డైరెక్టర్ వీవీ వినాయక్ (VV Vinayak) పేరు పరిశీలనలో ఉందన్న వార్తలే అందుకు కారణం. సీటు.. జస్ట్ ఒక్క మీటింగ్ దూరంలోనే ఉందన్న న్యూస్ ఇంకా కాక పుట్టిస్తోందట. వినాయక్ పేరును ముందు కాకినాడ ఎంపీ సీటుకు అనుకున్నా.. అక్కడ పోటీ చేయడానికి ఆయన నిరాకరించినట్టు తెలిసింది. కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండే కాకినాడ లోక్‌సభ సీటులో.. పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశ్యంతోనే అక్కడ వద్దనుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాజమండ్రి తన సొంత నియోజకవర్గం కావడంతో.. ఇక్కడ బరిలో దిగితే విజయావకాశాలు ఉంటాయన్నది అంచనాగా చెబుతున్నారు.
రాజమండ్రి (Rajahmundry) ఎంపీ సీటు పరిధిలోని పలువురు వైసీపీ నేతలు కూడా.. వినాయక్ అయితే గట్టి పోటీ ఇవ్వగలుగుతారని అధిష్టానానికి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారట. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం. దీంతో రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు దాదాపు ఖరారైందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. డైరెక్టర్ త్వరలోనే సీఎం జగన్‌ని కలుస్తారని.. ఆ భేటీ తర్వాత క్లారిటీ వస్తుందన్నది లోకల్ టాక్. ఈసారి కూడా రాజమండ్రి ఎంపీ టిక్కెట్టు బీసీలకు ఇవ్వాలన్నది వైసీపీ అధిష్టానం ఆలోచనట. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న మార్పులు చేర్పుల్లో భాగంగా.. రాజమండ్రి సిటీ, రూరల్ ఇంచార్జిలుగా బీసీలను నియమించడంతో.. ఎంపీ టిక్కెట్‌ని కాపులకు ఇవ్వాలన్న డిమాండ్ స్థానికంగా పెరుగుతోంది.
వీవీ వినాయక్ స్వస్థలం రాజమండ్రి లోక్‌సభ (Lok Sabha) పరిధిలోని చాగల్లు. సొంత జిల్లాకు చెందిన సెన్సేషనల్ డైరెక్టర్‌గా.. తూర్పుగోదావరి జిల్లాలో మంచి క్రేజే ఉంది ఆయనకు. టీడీపీ, జనసేన (Janasena) పొత్తు కారణంగా జిల్లాలో పవన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నది అంచనా. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా జనసేనలో చేరితే.. ఇక్కడ వైసీపీకి గట్టి పోటీ ఉండవచ్చన్నది చాలామంది మాట. ఈ పరిస్థితుల్లో.. క్రేజ్ ఉన్న, కాపు సామాజికవర్గానికి చెందిన ప్రముఖుల కోసం వెదుకుతోందట వైసీపీ. అందులో భాగంగానే వినాయక్ ప్రతిపాదన తెర మీదికి వచ్చిందంటున్నారు. ఆయన తండ్రి గండ్రోతు కృష్ణారావు.. చాగల్లు సర్పంచ్‌గా పలుమార్లు పోటీ చేసి ఓడిపోయారు.
ఆ క్రమంలోనే ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు. చివరికి 2006లో వినాయక్ ఎంటరై.. దాదాపు కోటి రూపాయలదాకా ఖర్చు చేసి తండ్రిని సర్పంచ్‌గా.. సోదరుడు సురేందర్‌ను వార్డ్ మెంబర్‌గా గెలిపించారన్నది గ్రామంలో చెప్పుకునే మాట. అప్పట్లో అది సంచలనం అయింది. తర్వాత మూడేళ్లకు పదవిలో ఉండగానే చనిపోయారు వినాయక్ తండ్రి కృష్ణారావు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగానే ఉంది ఆ కుటుంబం. మళ్లీ గత ఎన్నికల టైంలో వినాయక్ ప్రస్తావన వచ్చింది. అయితే అప్పుడా ప్రతిపాదనను వినాయక్ తిరస్కరించారు. తిరిగి ఇప్పుడు రాజమండ్రి ఎంపీ సీటుకు ఆయన పేరు గట్టిగానే వినిపిస్తోంది. స్థానిక నాయకులు ఎవరికీ అభ్యంతరాలు లేకపోవడం.. ఆయన వైసీపీ పెద్దలకు టచ్‌లో ఉన్నారన్న వార్తలతో అభ్యర్థిత్వం దాదాపు ఖరారు అవుతుందన్న అంచనాలు స్థానికంగా పెరుగుతున్నాయ్.
ఐతే అదే సమయంలో మరో వాదనా వినిపిస్తోంది. వినాయక్‌కు చిరంజీవితో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరి కాంబినేషన్‌లో హిట్ సినిమాలు కూడా వచ్చాయి. అలాంటిది ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తే మెగా ఫ్యామిలీకి దూరం కావాల్సి వస్తుందన్న ఆలోచన కూడా డైరెక్టర్‌కు ఉందట. అన్నింటికి మించి ఇప్పుడు రాజకీయాల్లో దిగి తలనొప్పులు తెచ్చుకోవడం అవసరమా అని.. కుటుంబ సభ్యులు కూడా అంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొదట్నుంచి వివాదాల జోలిపోని దర్శకుడిగా ఉన్న పేరును చెడగొట్టుకోవడం ఎందుకన్న సలహాలు కూడా వస్తున్నాయట ఆయనకు. ఇలాంటి వాతావరణంలో వైసిపి ఇస్తున్న ఆఫర్‌ను వీవీ వినాయక్ తీసుకుంటారా.. లేక గత ఎన్నికల్లో లాగే తిరస్కరిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. సంక్రాంతి తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరి సెన్సేషనల్ డైరెక్టర్ ఇప్పుడు పొలిటికల్ సెన్సేషన్‌గా మారతారా.. లేక కామ్ అయిపోతారా అన్నది చూడాలి.