బూతు నేతలకు ఓటర్లు దిమ్మదిరిగే షాకిచ్చారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడే నాయకులకు కర్రు కాల్చి వాత పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో బూతులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న నేతలంతా ఓడిపోయారు. ఆశ్చర్యమేమిటంటే… మెజారిటీ బూతు లీడర్స్ వైసీపీ (YCP) వారే కావడం… వారిని ప్రజలు తిరస్కరించడం ఈ ఎన్నికల్లో అందరూ గుర్తించాల్సిన విషయం.
రాజకీయ నాయకులకు భాష చాలా ముఖ్యం. నోరు బాగుంటేనే ఊరు బాగుంటుందని ఊరికే అనలేదు. కానీ కొందరు నాయకులు నోటిని అదుపులో పెట్టుకోవడంలో విఫలమవుతుంటారు. నోటికొచ్చినట్టు మాట్లాడి నలుగురిలో చులకన అవుతుంటారు. ఆ సమయంలో అందరూ నవ్వారనో… చప్పట్లు కొట్టారనో తరచూ బూతులు వల్లె వేస్తుంటే… చివరకు జనంలో బూతు నేతలుగానే స్థిరపడిపోతారు. అలాంటి బూతు నేతలకు జనం షాక్ ఇస్తూ ఉంటారు. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జరిగింది. నీతిమంతులైన నేతలుగా కాకుండా బూతు నేతలుగా పేరు బడ్డ వాళ్ళంతా ఓడిపోయారు.
ఓడిపోయిన బూతు నేతల్లో అగ్రగణ్యుడు, మాజీ మంత్రి కొడాలి నాని. ఆయన నోటికో దండం. ప్రతిపక్ష నేతలను, ముఖ్యంగా చంద్రబాబును (Chandrababu) విమర్శించడానికి కొడాలి నాని (Kodali Nani) వాడే భాష… అత్యంత అసహ్యకరంగా ఉంటుంది. ఇతరులను గౌరవించడం కొడాలి నాని డిక్షనరీలోనే లేదేమో. సాధారణ జనం మాట్లాడుకునే బూతులు కూడా కొడాలి నాని భాష ముందు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. జుగుప్సాకరంగా మాట్లాడటంలో, ప్రతిపక్ష నేతలను నోటికొచ్చినట్టు తిట్టడం నానికి వెన్నెతో పెట్టిన విద్య. అయితే ఈసారి నానికి బూతులు కలసి రాలేదు. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఈసారి చిత్తుగా ఓడిపోయాడు. బూతులు అంటే టక్కున గుర్తొచ్చే మరోపేరు రోజా. బూతులు మాట్లాడంతోనే ఆమె ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఎవరినైనా ఎంత మాట అయినా అనగలదామె. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంలో ఎక్స్‌పర్ట్. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా… మంత్రి అయినా ఆమె భాషలో ఎలాంటి మార్పు రాలేదు. రాదు కూడా. అందుకేనేమో ఆమెను నగరి ప్రజలు ఇంటికి పంపించారు. గత రెండు ఎన్నికల్లోనూ తక్కువ మెజారిటీతో గెలిచిన రోజా… ఈసారి భారీ తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.
బూతులతో అందరితోనూ చీ అనిపించుకున్న మరో లీడర్ వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)… 2019లో గన్నవరం నుంచి టీడీపీ (TDP) ఎమ్మెల్యేగా గెలిచినా… వైసీపీలో చేరిన తర్వాతే వంశీ అసలు స్వరూపం బయటపడింది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వంశీ చేసిన వ్యాఖ్యలు జనంలో ఆగ్రహానికి కారణమయ్యాయి. ప్రజాగ్రహంతోనే ఈసారి గన్నవరంలో ఓటమిబాట పట్టకతప్పలేదు. ఇక జోగి రమేష్ (Jogi Ramesh), అనిల్ కుమార్, అంబటి రాంబాబు, స్పీకర్ తమ్మినేని సీతారాం మాటతీరు గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరమేలేదు. వీళ్లు ఎమ్మెల్యేలుగా గెలిచి… మంత్రులై చేసిన మంచి పనులెన్నో ఎవరికీ తెలియదు. కానీ… బూతులతోనే అందరికీ సుపరిచితులు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి లాంటివారు కూడా చేసిన పనులతో కాకుండా బూతులతోనే జనాల్లో ఫేమస్ అయ్యారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ బూతు బాగోతం ఆంధ్రా అంతా లైవ్ షోనే చూసేసింది.
నోటికొచ్చినట్టు మాట్లాడటం, ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగడం, ప్రజలు ఏదైనా అడిగితే పరుషంగా మాట్లాడటం, కసురుకోవడం నేతలకు మంచిది కాదు. అలా చేసినవారంతా ఇప్పుడు అనుభవిస్తున్నారు. తాజా ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. ఈ బూతు నేతల కారణంగానే వైసీపీకి చెడ్డ పేరు వచ్చింది. సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేసినా… బూతు నేతల నిర్వాకాలే ఆ పార్టీ ఘోర పరాజయానికి కారణమయ్యాయి.