AVINASH VICTORY : ఓట్లు చీలితే ఎంత నష్టమో.. అవినాష్ ను గెలిపించిన షర్మిల

ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిస్థితి... అనుకున్నదొక్కటి... అయినది ఒక్కటి అన్నట్టుగా తయారైంది. ఎందుకంటే ఆమె ఎవర్నయితే కడప పార్లమెంట్ స్థానంలో ఓడించాలని పట్టుదలతో పోటీకి దిగారో ఆ అవినాష్ రెడ్డిని విజయానికి బాటలు వేశారు.

 

 

ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిస్థితి… అనుకున్నదొక్కటి… అయినది ఒక్కటి అన్నట్టుగా తయారైంది. ఎందుకంటే ఆమె ఎవర్నయితే కడప పార్లమెంట్ స్థానంలో ఓడించాలని పట్టుదలతో పోటీకి దిగారో ఆ అవినాష్ రెడ్డిని విజయానికి బాటలు వేశారు. ఓట్లు చీలడం వల్ల జరిగే నష్టం ఏంటో షర్మిలకు బాగా తెలిసొచ్చింది.

ఏపీలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు… చీలితే అది మళ్ళీ జగన్ కే లాభం… అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. తనకు తక్కువ సీట్లు ఇచ్చినా సరే… టీడీపీ, బీజేపీతో కలసి పోటీ చేశారు. కానీ షర్మిల అలా కాదు… రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో చచ్చిపోయిన కాంగ్రెస్ ను బతికించాలని అనుకున్నారు. తన అన్నతో ఉన్న ఆస్తి తగాదాలను పొలిటికల్ గా రివెంజ్ తీర్చుకుందామని ప్రయత్నించారు. బాబాయ్ మర్డర్ కేసు కూడా తనకు కలిసొస్తుందని అంచనా వేసుకున్నారు. అందుకే హత్య కేసులో నిందితుడైన తన సోదరుడు అవినాష్ రెడ్డిని ఓడించాలని కడప ఎంపీ స్థానంలో నిలబడ్డారు.

వివేకానందరెడ్డి భార్య, కూతురు సపోర్ట్ కూడా దొరికింది. అప్పటికే తెలుగుదేశం అభ్యర్థి భూపేష్ రెడ్డి కడపలో గట్టి పోటీ ఇస్తున్నా… షర్మిల కూడా అక్కడే పోటీ చేశారు. కానీ కథ అడ్డం తిరిగింది. కడప పార్లమెంటు స్థానంలో మూడు పార్టీల మధ్య ఓట్లు చీలడం వల్ల అవినాష్ రెడ్డి మరోసారి గెలిచారు. అక్కడ మొత్తం పోలైన ఓట్లు 13 లక్షల 21 వేలు ఉంటే… అందులో విజేతగా నిలిచిన అవినాష్ రెడ్డికి 6 లక్షల 5 వేల ఓట్లు వచ్చాయి. అటు సెకండ్ ప్లేసులో నిలిచిన టీడీపీ అభ్యర్థి సీహెచ్ భూపేష్ రెడ్డికి 5 లక్షల 42 వేల ఓట్లు రాగా… మూడో స్థానంలో నిలిచిన షర్మిలకు లక్షా 41 వేల ఓట్లు వచ్చాయి. అంటే అవినాష్ రెడ్డి 62 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. షర్మిల కడపలో పోటీ చేయకుండా ఉంటే… కాంగ్రెస్ పార్టీకి పడిన లక్షా 41 వేల ఓట్లు… టీడీపీకి టర్న్ అయ్యేవి. షర్మిలకు వచ్చిన ఓట్లల్లో కనీసం సగం పడినా టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి ఈజీగా గెలిచేవారు.
అవినాష్ ను ఓడించాలని ఆశపడ్డ షర్మిల… ఆయన్ని గెలిపించి నెత్తిన పాలుపోశారు. ఏపీలో కాంగ్రెస్ ను బతికించాలని కలలు గన్న షర్మిల ఆశలు కూడా అడియాసలు అయ్యాయి. అధికార పార్టీ ఓట్లు చీలిస్తే కాంగ్రెస్ లాభపడుతుందని ఆమె వేసిన ఎత్తులు చిత్తయ్యాయి. హస్తం పార్టీ మళ్ళీ చతికిల పడింది. ఎటూ కాకుండా పోయింది. 2029 నాటికి బతికి బట్టకడుతుందో లేదో కూడా చెప్పడం కష్టం. ఓట్లు చీలితే వచ్చే నష్టం ఏంటో షర్మిలకు ఇప్పటికైనా అర్థమైందో లేదో.