నానీలు ఎక్కడ ? ఆ నాటి బూతులు ఎక్కడ…?

నానీ స్క్వేర్... ఒకప్పుడు వైసీపీ అధినేతపై ఈగ వాలనివ్వని నాయకులు. జగన్ పై ఈగ వాలే అవకాశం ఉన్నా సరే మీడియా ముందుకు వచ్చేసి నోటికి పని చెప్పే వాళ్ళు. అసలు వాలింది అని తెలిస్తే తాండవం ఆడే వాళ్ళు. పాలేర్లు, బొచ్చులు, పీకడాలు, కొట్టడాలు, ఇళ్ళ మధ్య దూరాలు... అబ్బో ఇలా చాలా కథ ఉండేది.

  • Written By:
  • Updated On - September 24, 2024 / 07:39 PM IST

నానీ స్క్వేర్… ఒకప్పుడు వైసీపీ అధినేతపై ఈగ వాలనివ్వని నాయకులు. జగన్ పై ఈగ వాలే అవకాశం ఉన్నా సరే మీడియా ముందుకు వచ్చేసి నోటికి పని చెప్పే వాళ్ళు. అసలు వాలింది అని తెలిస్తే తాండవం ఆడే వాళ్ళు. పాలేర్లు, బొచ్చులు, పీకడాలు, కొట్టడాలు, ఇళ్ళ మధ్య దూరాలు… అబ్బో ఇలా చాలా కథ ఉండేది. వాళ్ళ నోటి దెబ్బకు టీడీపీలో చాలా మంది మాట్లాడటానికి కూడా సాహసం చేసే వాళ్ళు కాదు. చిన్న విమర్శ చేయాలన్నా సరే మమ్మల్ని ఎక్కడ తిడతారో అని భయపడేవాళ్ళు. అధినేత ఆదేశాలు రావడం ఆలస్యం మీడియాలో వాళ్ళ హాజరు ఉండేది.

ఇక కొన్ని మీడియా చానల్స్ కూడా వాళ్ళ ఇళ్ళ చుట్టూనే తిరిగేవి. వాళ్ళ వ్యూస్ గోల వాళ్ళది కాబట్టి… ఏదైనా వివాదం జరుగుతున్నా విమర్శలు వస్తున్నా, మైక్ లు పట్టుకుని నానీల ఇంటి దగ్గర ఎదురు చూసే వాళ్ళు. అలాంటి నానీలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఏమైపోయారో, అసలు దేశంలో ఉన్నారో లేదో తెలియదు. దమ్ముంటే రారా అని సవాల్ చేసిన నానీలు ఇప్పుడు దమ్ము లేదో లేక భయమో లేక అన్న కూడా కాపాడలేడు అనుకున్నారో ఏమో గాని అసలు నోరెత్తి మాట్లాడటం కాదు కదా ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తిరుమల లడ్డూ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ లడ్డు వ్యవహారం వైసీపీని అంతం చేసినా ఆశ్చర్యం లేదు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సహా అందరు నేతలు జగన్ లక్ష్యంగా విమర్శలు తీవ్ర స్థాయిలో చేస్తున్నారు. కానీ కానీ… ఒక్క నానీ కూడా బయటకు రాలేదు. పవన్ నాయుడు మా బంధువే అని మాట్లాడిన పేర్ని నానీ… ఆ పవన్ విమర్శలు చేస్తుంటే కౌంటర్ వేయడానికి కూడా రావడం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ ను తిట్టాలి అంటే కాపు కులం నుంచి పేర్ని నానీ ముందు వరుసలో ఉండేవారు.

ఆయనను నియోజకవర్గ ప్రజలు తమ ప్రాంతంలో కంటే మీడియాలోనే ఎక్కువగా చూసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి నానీ… ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నారో తెలియకుండా జాగ్రత్తలు పడుతున్నారు. గుడ్లవల్లేరు కాలేజి వ్యవహారం తర్వాత అసలు ఆయన జాడ కూడా ఎవరికి తెలియదు. వంద రోజుల పాలన మీద కౌంటర్ వేస్తారని అందరూ ఎదురు చూసారు. అదెక్కడా కనపడలేదు… లడ్డూ వ్యవహారం ఇంత సీరియస్ గా ఉన్నా కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. విజయవాడ వరదలపై కూడా పేర్ని నానీ మాట్లాడలేదు.

ఇక కొడాలి నానీ విషయానికి వస్తే… ఫర్నీచర్ విషయంలో బొచ్చులో ఫర్నీచర్ అది ఇదీ అని మాట్లాడారు గాని ఆ తర్వాత పెద్దగా మీడియాలో కనపడటం లేదు. లడ్డూ విషయంలో నానీ మార్క్ కామెంట్స్ ఏమైనా వస్తాయా అని వైసీపీ నేతలు, కార్యకర్తలు వేయి కళ్ళతో ఎదురు చూసారు. అది తనకు సంబంధం లేదనుకున్నారో, జోగి రమేష్ మాదిరి సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళాలి అనుకున్నారో గాని అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చంద్రబాబుపై విమర్శలు చేయాలంటే ఒంటి కాలు మీద లేచే కొడాలి నానీ… చంద్రబాబు అన్ని మాటలు జగన్ ను అంటున్నా మాట్లాడటం లేదు.

గుడ్లవల్లేరు కాలేజి వివాదం సొంత నియోజకవర్గమే. అయినా కొడాలి నానీ మాట్లాడలేదు. ఇతర వైసీపీ నేతలు మాట్లాడితే మీడియాలో అంత పాపులర్ అవ్వదు. అందుకే జగన్ కూడా గతంలో కొడాలి, పెర్ని నానీలతోనే మాట్లాడించే వారు. వైసీపీకి వాయిస్ లా ఉండేవారు ఇద్దరూ. జగన్ కంటే వీళ్ళే ఫేమస్ అయ్యే వాళ్ళు మీడియాలో. అలాంటి నాయకులు ఇప్పుడు కనీసం బయటకు రాకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. సూపర్ సిక్స్ పై గాని బెజవాడ వరదలపై గాని, గుడ్లవల్లేరు కాలేజి గొడవపై గాని, లడ్డూ వ్యవహారంపై గాని, హీరోయిన్ కేసు వ్యవహారంపై గాని అసలు మాట్లాడే సాహసం కూడా చేయడం లేదు. మరి ఈ నానీలు ఎప్పుడు బయటకు వస్తారో అన్నకు ఎప్పుడు అండగా నిలబడతారో చూడాలి.