ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది వైసీపీ (YCP) హైకమాండ్. గతంలో ఇంఛార్జులుగా ప్రకటించిన వారినే దాదాపు కంటిన్యూ చేసింది. పిఠాపురంలో జనసేనాని (Janasena) పవన్ కల్యాణికి (Pawan Kalyan) పోటీగా వైసీపీ నుంచి వంగా గీతను నిలబెట్టింది. మంగళగిరిలో నారా లోకేష్ ను లావణ్య ఢీకొంటున్నారు. హిందూపురంలో బాలకృష్ణపై టీఎన్ దీపికను పోటీకి దింపింది వైసీపీ. ఏపీలో తమ ముగ్గురు ప్రత్యర్థులపైనా మహిళలనే నిలబెట్టింది వైసీపీ హైకమాండ్.
పిఠాపురంలో (Pithapuram) పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన రోజే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. పవన్ ను ఓడించడానికి ముద్రగడ లేదా అతని కొడుకు గిరిని దింపుతారని అనుకున్నారు. గతంలో పిఠాపురం ఇంఛార్జిగా ప్రకటించిన వంగా గీతను మారుస్తారనీ… ఆమె స్థానంలో టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వర్మకు టిక్కెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ నడిచింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ… జగన్ మాత్రం… వంగా గీతనే ఫైనల్ చేశారు. గతంలో చిరంజీవి (Chiranjeevi) ప్రజారాజ్యం పార్టీ (Praja Rajyam Party) తరపున అదే స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన వంగా గీత…. ఇప్పుడు పవన్ కల్యాణ్ ను ఢీకొట్టబోతున్నారు.
ఇక మంగళగిరిలో (Mangalagiri) లోకేశ్ (Nara Lokesh) కు పోటీగా మురుగుడు లావణ్యను వైసీపీ నిలబెట్టింది. ఈమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తే. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ హనుమంతరావు కోడలు. లావణ్యకు పుట్టిల్లు, అత్తింటి వారు రెండు కుటుంబాలకు రాజకీయ నేపథ్యం ఉంది. ఆ రెండు ఫ్యామిలీస్ గతంలో కాంగ్రెస్ నుంచే పోటీ చేశారు. వీళ్ళకి మంగళగిరిలో మంచి పేరుంది. అందుకే గతంలో గెలిచిన ఆళ్ళ రామక్రిష్ణా రెడ్డిని కూడా కాదని… మరోసారి లోకేశ్ ను ఓడించడానికి లావణ్యను బరిలోకి దింపింది వైసీపీ అధిష్టానం.
ఏపీలో మరో కీలక నియోజకవర్గం… హిందూపురం… టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ సీటులో నటుడు బాలకృష్ణ మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా ఈ స్థానం దక్కించుకోవాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేకంగా హిందూపురంలోనే మకాం పెట్టారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఎప్పుడూ మహిళా అభ్యర్థిని నిలబెట్టలేదు. అందుకే ఈసారి మహిళ అస్త్రంతో బాలయ్యను ఓడించాలని ప్లాన్ చేసింది వైసీపీ. మొత్తానికి తమ రాజకీయ ప్రత్యర్థులు… పవన్ కల్యాణ్, లోకేశ్, బాలయ్యపై వైసీపీ అధినేత జగన్… మహిళలను రంగంలో దింపడం హాట్ టాపిక్ గా మారింది. మహిళల ఓట్లే టార్గెట్ గా ఈ ముగ్గుర్నీ ఓడించాలని ప్లాన్ చేశారని అంటున్నారు.