పిఠాపురం నియోజకవర్గానికి కొత్త ప్రభుత్వంలో అదృష్టం పట్టబోతోంది. వైసీపీ లేదంటే టీడీపీ కూటమిల్లో ఏ ప్రభుత్వం ఏర్పాటైనా… పిఠాపురానికి పెద్ద పదవి మాత్రం రావడం ఖాయంగా కనిపిస్తోంది. వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఇటు టీడీపీ కూటమి కూడా పవన్ కి డిప్యూటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈసారి పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. అలాగే వైసీపీ అభ్యర్థి వంగా గీత తరపున కూడా ఆ పార్టీ సీనియర్లు, కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. రాష్ట్రంలో ఎలాంటి ఫలితాలు వచ్చినా… పిఠాపురం నియోజకవర్గానికి కీలక పదవి మాత్రం వస్తుందని తెలుస్తోంది. వంగా గీత గెలిచి… వైసీపీ అధికారంలోకి వస్తే ఆమెకు డిప్యూటీ సీఎం గ్యారంటీ. దాంతో పాటు కీలక పోర్ట్ ఫోలియో కూడా వచ్చే ఛాన్సుంది. గతంలో ఎన్నో పదవుల్లో పనిచేసిన వంగా గీతకు రాజకీయ అనుభవం కూడా కలిసొస్తుంది.
ఇక పవన్ కల్యాణ్ గెలిచి… టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఆయనకు కూడా డిప్యూటీ సీఎం వచ్చే ఛాన్సుంది. అలాగే కీలకమైన పదవిని తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పిఠాపురంలో పవన్ పక్కాగా గెలుస్తాడని జనసైనికులు గట్టిగా నమ్ముతున్నారు. ఇక్క సీన్ రివర్స్ అయితే పరిస్థితి ఏంటి ? గీత ఓడిపోయి… వైసీపీ అధికారంలోకి వస్తే… అనే అనుమానం తలెత్తుతోంది. కానీ మళ్ళీ పిఠాపురంపై పట్టు సాధించడానికి జగన్.. ఆమెకు కీలక మంత్రి పదవి ఇస్తారన్న టాక్ నడుస్తోంది.
ఇటు పవన్ ఓడిపోయి… కూటమి అధికారంలోకి వచ్చినా ఇదే పరిస్థితి రిపీట్ అవుతుంది. అయితే … పవన్ కి 40 నుంచి 50 వేలకు పైగా మెజారిటీ వస్తుందనీ… టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీల శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయి. పవన్ డిప్యూటీ సీఎం అయితే పిఠాపురం అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. ఇప్పటికే పవన్ వల్ల తమ నియోజకవర్గం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోందని చెబుతున్నారు అక్కడి జనం. మొత్తానికి ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా… పిఠాపురంకి కేబినెట్ లో మంచి బెర్త్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.