BABU JOINS NDA : బాబు ఎన్డీఏలో ఎందుకు చేరారంటే !

ఏపీలో 2014 ఎన్నికల (AP 2014 Elections) కాంబినేషన్ మళ్లీ తెర మీదకు రావడంతో చాలా కాలం తర్వాత బీజేపీ (BJP) పెద్దలతో రాజకీయ భేటీకి హాజరయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తానన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)... దాదాపు ఏడాదిన్నర నుంచి టీడీపీని NDAలో చేర్చడానికి లాబీయింగ్ చేస్తూనే ఉన్నారు.

ఏపీలో 2014 ఎన్నికల (AP 2014 Elections) కాంబినేషన్ మళ్లీ తెర మీదకు రావడంతో చాలా కాలం తర్వాత బీజేపీ (BJP) పెద్దలతో రాజకీయ భేటీకి హాజరయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తానన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)… దాదాపు ఏడాదిన్నర నుంచి టీడీపీని NDAలో చేర్చడానికి లాబీయింగ్ చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నాలకు ఇప్పుడు ఓ రూపం వస్తున్నట్టు కన్పిస్తోంది. టీడీపీ మళ్లీ ఎన్డీఏ గూటికి చేరుతున్నట్టే ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. అంతవరకు ఓకేగానీ… ఇప్పుడు సైకిల్‌ పార్టీ పరిగెత్తుకు వెళ్ళి ఎన్డీఏ గూట్లో చేరాల్సిన అవసరం ఏముంది..? టీడీపీ కేడర్ కు అస్సలు ఇష్టం లేకున్నా… నాయకత్వం ముందుకే వెళ్ళి బీజేపీ పంచన చేరాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఒకవేళ ఎన్డీఏ చేరడం నిజమైతే… టీడీపీ ప్రజలకు ఏం చెబుతుంది..? లాంటి అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

గతంలో నరేంద్ర మోడీని.. (Narendra Modi) కేంద్రం తీరును తీవ్ర స్థాయిలో విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు ఏం జరిగిందని.. ఈ ఐదేళ్ళలో ఏపీకి ఏం మేలు చేశారని ఎన్డీఏలో చేరుతున్నారన్న విమర్శలు సహజంగానే వస్తున్నాయి. ఈ ఆందోళన ఆ పార్టీ నేతల్లో సైతం కనిపిస్తోంది. తడవకో మాట.. పూటకో పార్టీ అన్న రీతిలో టీడీపీ వ్యవహారం ఉందని ప్రత్యర్థులు విమర్శించడానికి తామే అస్త్రాలు అందించినట్టు అవుతుందని ఇప్పుడు అంతర్గతంగా చర్చ జరుగుతోందట. పైగా గత పదేళ్ల కాలంలో కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదనే అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో సైతం బలంగా ఉంది. కేంద్ర నిధులతో రాష్ట్రంలో సంక్షేమం అమలు చేస్తున్నారనే విషయాన్ని బీజేపీ పదే పదే చెబుతున్నా.. అది అంతగా జనంలోకి వెళ్లలేదు. పైగా బీజేపీ మీద గతంలో టీడీపీ చేసిన విమర్శలు కావచ్చు.. ఇప్పుడు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కావచ్చు.. ఇవన్నీ కలగలిస్తే ఎన్డీఏలో చేరడం ఏమంత శ్రేయస్కరం కాదని అంటున్నారు పార్టీలోని మెజార్టీ నేతలు. కానీ పరిస్థితులు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వెళ్తున్న పరిస్థితి..

టీడీపీ(TDP), బీజేపీ (BJP) చేతులు కలపడం దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది. ఈ క్రమంలో ఎన్డీఏలో చేరబోయే ముందు అందుకు సాకుగా టీడీపీ నేతలు ఏం చెబుతారన్న ఆసక్తి పెరుగుతోంది. అసలెలా సమర్ధించుకోవాలన్న టెన్షన్ టీడీపీ నేతల్లోనే కన్పిస్తోందట. అమిత్ షాతో ఇవే అంశాలపై చర్చించడానికి చంద్రబాబు వెళ్లినట్టు సమాచారం. పొత్తులు, సీట్ల సర్దుబాట్లు, ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయాలనే అంశంపై ఇప్పటికే మూడు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయన్న చర్చ ఏపీలో విస్తృతంగా జరుగుతోంది. టీడీపీ (TDP) తిరిగి ఎన్డీఏ కూటమిలోకి చేరే క్రమంలో దానికో బేస్.. ఓ లైన్ ను సిద్దం చేసుకునే దిశగానే అమిత్ షా-చంద్రబాబు (Amit Shah-Chandrababu) భేటీ జరిగిందన్న భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం నుంచి స్పష్టమైన హామీ తీసుకునేలా.. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ జాబితా నుంచి తప్పించేలా కేంద్రం తన అభిప్రాయాన్ని చెప్పొచ్చనే భావన టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అలాగే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం వంటివాటి విషయంలో… ఏదో బీజేపీ చెప్పినట్టుగా కాకుండా.. ఎన్డీఏ కూటమి దిశగా క్లియర్ కట్ హామీలు ఇవ్వాలన్న చర్చ జరుగుతోంది. అలాగే గతంలో ప్రత్యేక హోదా కాకుండా.. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారనేది టీడీపీ మీద వైసీపీ (YCP) సహా ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ఆరోపణ. దీన్ని చెరిపేసుకునేలా బీజేపీ పెద్దల నుంచి హామీ తీసుకునే దిశగా చర్చలు జరిగాయని అంటున్నారు. రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కించాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పనిసరి అనే లైన్ తీసుకోక తప్పదనే చర్చ జరుగుతోంది.

గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో పూర్తి స్థాయిలో విధ్వంసం జరిగిందని, అలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో బలంగా ఉన్న బీజేపీతో కలవడం మినహా మరో గత్యంతరం లేదన్న వాదనను టీడీపీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనుకుంటున్నట్టు తెలిసింది. ఆ దిశగానే ప్రచార ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మొత్తంగా ఎన్డీఏలో చేరడం అనేది ఇప్పుడు టీడీపీకి కత్తి మీద సాములాగే కన్పిస్తోంది. ఎన్డీఏ వైపు ఓ అడుగు ముందుకేస్తే.. రాజకీయంగా ఏ టర్న్ తీసుకుంటుందో.. ఎలాంటి చర్చ జరుగుతోందోననే ఉత్కంఠ రేగుతోంది. దీన్ని అత్యంత జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పార్టీకి ఊపు వచ్చింది… అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో బీజేపీతో పొత్తు అనేది టీడీపీ నేతలను కలవరపెడుతున్నా… ఏపీలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కలవక తప్పడం లేదంటూ పార్టీ సీనియర్స్‌ సైతం నిట్టూరుస్తున్న పరిస్థితి. మరి జనంలోకి వచ్చి టీడీపీ పెద్దలు తమ నిర్ణయాన్ని ఎలా సమర్ధించుకుంటారో చూడాలి.