ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (Andhra Pradesh Chief Minister) జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) … ఉన్నట్టుంది ఢిల్లీ ఎందుకు వెళ్ళినట్టు ? బీజేపీతో పొత్తు (BJP alliances) కోసం చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హస్తినకు వెళ్ళిన టైమ్ లోనే… ఏదో గుర్తుకు వచ్చినవాడిలా జగన్ కూడా ఎందుకెళ్ళారు ? టీడీపీ (TDP), జనసేనతో పొత్తు వద్దని చెప్పడానికా ? లేదంటే నిజంగా ఏపీకి స్పెషల్ స్టేటస్… నిధుల ఇవ్వమని అడగడానికా ? జగన్ ఢిల్లీ టూర్ పై ఏపీలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డ వెంటనే సీఎం జగన్ ఢిల్లీ అపాయింట్ మెంట్ ఫిక్స్ అయినట్టు సమాచారం బయటకు వచ్చింది. అంతకుముందు రోజే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… బీజేపీతో పొత్తుల కోసం ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత పవన్ కి కూడా పిలుపు వచ్చింది. అదే టైమ్ లో జగన్ కూడా హస్తినకు వెళ్ళడంపై ఏపీలో చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్రమోడీ (Prime Minister Narendra Modi) ని కలుసుకొని గంటకు పైగా చర్చలు జరిపినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ లాబీల్లో గంట వెయిటింగ్ తర్వాత… 10 నిమిషాలు మాత్రమే జగన్ తో మోడీ మాట్లాడారన్న టాక్ నడుస్తోంది. ఏపీకి స్పెషల్ స్టేటస్, పోలవరంకు నిధులు, విభజన హామీలను నెరవేర్చాలని ప్రధాని మోడీని జగన్ కోరినట్టు ప్రభుత్వ ప్రకటన వెలువడింది. కానీ కేంద్రంలో ఇప్పుడు లోక్ సభ ఎన్నికల బిజీ నడుస్తోంది. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులూ అదే మూడ్ లో ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని అంటున్నారు. అందుకే కేంద్రం కూడా హడావిడిగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇంత బిజీ షెడ్యూల్ లో జగన్ తెచ్చిన అర్జీని పరిశీలించి… ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చే అవకాశం ఉంటుందా…
పీసీసీ అధ్యక్షురాలిగా (AP Congress) షర్మిల (Sharmila) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ స్పెషల్ స్టేటస్ పైనే మాట్లాడుతున్నారు. జగనన్న ఏపీ ప్రజలను మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. హోదా, విభజన హామీలు నెరవేరుస్తామంటూ కాంగ్రెస్ కు ఓట్లు వేయాలని జనాన్ని అడుగుతున్నారు. ఎన్నికల్లో మిగతా పార్టీల ఎజెండా కూడా ఇవే అయితే జగన్ కు ఇబ్బందిరక పరిస్థితులు తప్పకపోవచ్చు. అందుకే నేను ట్రై చేశా… కేంద్రం ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ జనానికి చెప్పుకోడానికే… అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్ హడావిడిగా ఢిల్లీకి వెళ్ళి అర్జీలు ఇచ్చివచ్చారన్న టాక్ నడుస్తోంది. అయితే టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకోవద్దని బీజేపీ పెద్దలకు చెప్పేందుకే వెళ్ళారని కూడా కొందరు అంటున్నారు. అమిత్ షాను కూడా కలిసినట్టు ప్రభుత్వ సలహాదారు సజ్జల చెబుతున్నారు. కానీ అమిత్ షాతో జగన్ ఎలాంటి సమావేశం కాలేదని తెలుస్తోంది. పొత్తులు, ఎత్తులపై అమిత్ షాయే నిర్ణయం తీసుకుంటారు. మోడీ వాటిని పట్టించుకోరు. అమిత్ షా అపాయింట్ మెంట్ దొరక్కపోవడం జగన్ కు నిరాశ కలిగించింది.
టీడీపీ, జనసేనతో పొత్తు వద్దని చెబుతూనే… ఒకవేళ పెట్టుకుంటే …జనసేన, బీజేపీయే ఎక్కువ స్థానాలు తీసుకోవాలని సలహా ఇవ్వడానికి వెళ్ళారని చెబుతున్నారు. 3 పార్టీల మధ్య ఓట్ల బదిలీ అవడం అంత ఈజీ కాదు. టీడీపీ లీడర్లు చాలా చోట్ల రెబల్స్ గా పోటీలోకి దిగే ఛాన్సుంది. దాంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి… తిరిగి తానే ముఖ్యమంత్రి అవుతానని జగన్ భావిస్తున్నారు. జగన్ ఆలోచనలు ఎలా ఉన్నా… బీజేపీ మాత్రం ఏపీలో కూడా బలపడాలని చూస్తోంది. అందుకే టీడీపీకి పట్టు ఉన్న నియోజకవర్గాలనే అడుగుతున్నట్టు అర్థమవుతోంది. వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుంటే రేపు మూడోసారి అధికారంలోకి రావడానికి ప్లస్ అవుతాయని బీజేపీ లీడర్లు భావిస్తున్నారు. జగన్ ఢిల్లీకి వెళ్ళిన ప్లాన్స్ ఏవీ వర్కవుట్ కాలేదని అంటున్నారు.