ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి (YCP) కాపులు పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. రాష్ట్రంలో ఓటు బ్యాంకులో(Vote Bank) కీలకమైన కాపు లీడర్లు ఒక్కొక్కరు ఆ పార్టీకి దూరమవుతున్నారు. ఉన్నవాళ్ళను కాపాడుకోలేకపోవడమే కాదు.. కొత్తగా కాపు లీడర్లను ఆకర్షించడంలో వైసీపీ ఘోరంగా విఫలమవుతోంది. నేతలను చేర్చుకోడానికి సీఎం జగన్ (CM Jagan) చేస్తున్న ప్రయత్నాలన్నీ వృధా అవుతున్నాయి. కాపులను ఆకర్షించడం ద్వారా జనసేనను దెబ్బకొట్టాలన్న ఆయన వ్యూహం వర్కవుట్ అవడం లేదు.
టీడీపీ-జనసేన(TDP-Jana Sena) కూటమిలో కాపులు చేరరు. చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను కాపులు నమ్మట్లేదు. అంటూ వైసీపీ మంత్రులు గత కొంతకాలంగా కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. అంతేకాదు కొందరు కాపులను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా.. ఉన్నవాళ్ళని కూడా కాపాడుకోలేని పరిస్థితి వైసీపీలో ఉంది. పైగా ఇప్పుడు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా జనసేనలోకి వెళ్తుండటంతో.. ఏపీలో దాదాపు కాపు సామాజిక వర్గం అంతా ఒక్కటవుతోంది. దాంతో వైసీపీకి టెన్షన్ పట్టుకుంది.
జనసేనకు, పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ.. ఆ మధ్య క్రికెటర్ అంబటిరాయుడిని పార్టీలోకి తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంతో జగన్ కు వ్యాపార సంబంధాలున్నాయి. వాటిని అడ్డం పెట్టుకొని… అప్పట్లో IPL ఆడుతున్న అంబటి రాయుడిని బుట్టలో వేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ మ్యాచులు ఆడుతున్నప్పుడు ఒకట్రెండు సార్లు తాడేపల్లికి వచ్చి జగన్ తో భేటీ అయ్యాడు రాయుడు. తర్వాత IPL ముగియగానే కెరీర్ కు గుడ్ బై చెప్పి.. వైఎస్సార్ లో చేరేందుకు గ్రౌండ్ ప్రిపరేషన్ మొదలుపెట్టారు. గుంటూరు పార్లమెంట్ టిక్కెట్ ఆశించి వైసీపీలో చేరారు. కానీ అందులో చేరిన 10 రోజులకే మళ్ళీ రిజైన్ చేసి.. పవన్ కల్యాణ్ తో జతకట్టాడు అంబటి రాయుడు. దాంతో రాయుడు విషయంలో వైసీపీ ప్రయోగం సెల్ఫ్ వికెట్ అయింది.
ముద్రగడ పద్మనాభంను పార్టీలోకి తీసుకొస్తే.. ఇక కాపు ఓట్లకు తిరుగు ఉండదు. పవన్ కల్యాణ్ తో పాటు చంద్రబాబును కూడా దెబ్బకొట్ట వచ్చని వ్యూహం పన్నారు జగన్. అప్పట్లో పవన్ వర్సెస్ ముద్రగడ మాటల యుద్ధం కూడా నడవడంతో వైసీపీ మంత్రులు, నేతలు సంబరపడ్డారు. పవన్ ను కాపులు నమ్మడం లేదు… ఆయనతో రారు అంటూ తెగ స్టేట్ మెంట్స్ ఇచ్చారు మంత్రులు. కానీ జగన్ వరుసగా ప్రకటిస్తున్న నియోజకవర్గాల ఇంఛార్జులతో పాటు ముద్రగడకు ఇస్తానన్న రాజ్యసభ ఎంపీ విషయంలో మోసం చేశారన్న ఆరోపణలున్నాయి. దాంతో వైసీపీలో సరైన గౌరవం దక్కలేదంటూ.. ముద్రగడ ఆ పార్టీలో చేరడం లేదని ప్రకటించారు. మరికొన్ని రోజుల్లోనే ముద్రగడతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కాబోతున్నారు. దాంతో పద్మనాభం కూడా వైసీపీకి దూరం అయినట్టే. ముద్రగడ తరువాత కాపుల్లో పేరున్న లీడర్ వంగవీటి రాధాను వైసీపీలోకి చేర్చుకునేందు విశ్వప్రయత్నాలు జరిగాయి.
మాజీ మంత్రి కొడాలి నాని ద్వారా ట్రై చేశారు. రాధ ఏ సీట్లు అడిగినా ఇవ్వడానికి వైసీపీ సిద్ధమైంది. కానీ వంగవీటి రాధ మాత్రం తాను టీడీపీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. ఇందులో గతంలో జగన్ చేసిన ఓ మిస్టేక్ కూడా ఉంది. 2019లోనే రాధాను వద్దనుకున్నారు జగన్. నేను వదిలి పెడితే గాలికి కొట్టుకుపోతావ్ అంటూ జగన్ హెచ్చరించారనీ.. తన ఆత్మగౌరవాన్ని కించపరిచిన వ్యక్తి దగ్గర పనిచేయడం ఇష్టం లేదన్నారు వంగవీటి రాధ. సో.. రాధ విషయంలోనూ వైసీపీ ఫెయిల్ అయింది.
ఇక నియోజకవర్గాల ఇంఛార్జుల మార్పు ద్వారా కొందరు కాపునేతలకు జగన్ టిక్కెట్లు నిరాకరించారు. ఈ ఎఫెక్ట్ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. జ్యోతుల చంటిబాబు, పెండెం దొరబాబు లాంటి వారు వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. గుడివాడ అమర్నాథ్ కి ఇంకా టిక్కెట్టే ప్రకటించలేదు. గాల్లో నిల్చోబెట్టారు.
కాపులను ఆకర్షించడంలో వైసీపీ చేసుకున్న స్వయం కృతాపరాధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికితోడు ఈమధ్య జనసేనాని పవన్ కల్యాణ్ కాపులను ఉద్దేశించి రాసిన లెటర్ కూడా వైసీపై ఎఫెక్ట్ పడింది. తనను తిట్టిన వారిని కూడా ఎప్పుడు వచ్చినా జనసేనలో చేర్చుకుంటానని పవన్ ప్రకటించారు. దాంతో వైసీపీలో ఆదరణ దక్కని కాపు సామాజిక నేతలంతా ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు. దాంతో కాపు నేతల్ని చేర్చుకొని.. ఆ వర్గం ఓటు బ్యాంక్ టర్న్ చేసుకోవాలనుకున్న జగన్ కల కలగానే మిగిలిపోతోంది.