ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ముఖంలో మొదటిసారిగా భయం కనిపించింది. ఎన్నికలవేళ జగన్ నోటి నుంచి అనేక అనుమానాలు, సందేహాలు బయటపడ్డాయి. ఫస్ట్ టైమ్ తమ అధినేత అలా మాట్లాడటంతో కేడర్ లో టెన్షన్ పెరిగిపోతోంది. మచిలీపట్నం (Machilipatna) సభలో సీఎం జగన్ క్యాడర్ కు భయం కలిగించే మాటలు అనడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికలు సక్రమంగా జరుగుతాయని తనకు నమ్మకం లేదనీ… ఆ నమ్మకం రోజురోజుకీ సన్నగిల్లి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు జగన్. రాష్ట్రంలో లేటెస్ట్ గా జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ ఈ కామెంట్స్ చేయడం ఏపీలో చర్చకు దారితీశాయి.
ఏపీ ఎన్నికల (AP Elections) ప్రచారంలో భాగంగా సిద్ధం సభలు స్టార్ట్ చేసినప్పటి నుంచి… ఏపీ సీఎం జగన్ లో ఎక్కడలేని ఉత్సాహం కనిపించింది. సభలు సక్సెస్ కావడం… బస్సుయాత్రకు కూడా జనం భారీగా తరలి వస్తుండటంతో… మరోసారి అధికారం ఖాయమన్న ధీమా వైసీపీ కేడర్ లో కూడా కనిపిస్తోంది. కానీ మచిలీపట్నంలో జరిగిన మేమంతా సిద్ధం సభలో గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ మాట్లాడటంపై కేడర్ ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం రోజు రోజుకీ తగ్గిపోతోందని అన్నారు. తనకు వ్యతిరేకంగా కూటమి నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు జగన్. ప్రజలకు మంచి జరగకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే డీజీపీ సహా చాలా మంది అధికారులను ఇష్టమొచ్చినట్టు మార్చేసారంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నడుస్తున్న పథకాల లబ్దిదారులకు డబ్బులు అందకుండా ఆపేస్తున్నారని… పరోక్షంగా టీడీపీ కంప్లయింట్స్ చేసిందని ఆరోపించారు సీఎం జగన్ (CM Jagan)
జగన్ ను లేకుండా చేయాలన్నదే కూటమి లక్ష్యమని సీఎం ఆరోపించడంతో కేడర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జగన్ లో ఇంత అసహనం, భయం ఎందుకు వచ్చిందని వైసీపీ కేడర్ లో చర్చ జరుగుతోంది. సీఎం నోటి వెంట ఇలాంటి మాటలు రావడం వల్ల క్యాడర్ మనోస్థైర్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. జగన్ కామెంట్స్ తో ఆయనలో ఓటమి భయం కనిపిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎన్నికలకు ముందే జగన్ చేతులు ఎత్తేశాడని నేతలు ఎద్దేవా చేస్తున్నారు. X లో జనసేన ఇప్పటికే దీనిపై ఓ పోస్ట్ చేసింది. ఇక కూటమి గెలుపు లాంఛనమే… సీన్ అర్థమైపోయి ఆఖరి రాగం పాడేసిన జగన్ … ధర్మందే విజయం… పొత్తుదే గెలుపు… కూటమిదే పీఠం అంటూ కామెంట్స్ పెట్టారు. ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది.