CHIRU POLITICS : చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా ? బీజేపీ, కాంగ్రెస్ ఒత్తిడి దేనికి ?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly Elections), లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) దగ్గర పడుతుండటంతో మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) మళ్ళీ డిమాండ్ పెరిగింది. ఆయన్ని ఎలాగైనా మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకురావాలనీ.. ఆయన ఇమేజ్ తో నాలుగు సీట్లు గెలుచుకోవాలని పొలిటికల్ పార్టీలు తెగ ట్రై చేస్తున్నాయి.

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly Elections), లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) దగ్గర పడుతుండటంతో మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) మళ్ళీ డిమాండ్ పెరిగింది. ఆయన్ని ఎలాగైనా మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకురావాలనీ.. ఆయన ఇమేజ్ తో నాలుగు సీట్లు గెలుచుకోవాలని పొలిటికల్ పార్టీలు తెగ ట్రై చేస్తున్నాయి. మోడీ సభలకు పిలుస్తూ బీజేపీ ఆకట్టుకుంటుంటే.. అసలు చిరంజీవి మావాడే.. మా పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేసుకోలేదు.. మెగాస్టారే ఏపీకి కాబోయే సీఎం అంటూ ప్రకటనలు ఇస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. తమ్ముడు పవన్ కల్యాణ్ ను కాదని ఈ పార్టీలకు ఆయన సపోర్ట్ చేస్తారా ? అసలు చిరంజీవి మనసులో ఏముంది.

నాలుగు దశాబ్దాలుగా సినిమాల్లో తిరుగులేని హీరో మెగాస్టార్ చిరంజీవి. కోట్ల మంది అభిమానులను సొంతంగా చేసుకున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ (Chiranjeevi Blood Bank) ద్వారా.. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో ఆయన ప్రజారాజ్యం పార్టీ (Praja Rajyam Party) పెట్టారు. కానీ పాలిటిక్స్ సెట్ కాకపోవడంతో.. ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు. రాజ్యసభ సభ్యత్వంతో ఎంపీ అయి.. కొన్నాళ్ళు కేంద్ర మంత్రిగా పనిచేసినా.. కేంద్రంలో కాంగ్రెస్ ఓటమి తర్వాత మళ్ళీ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టలేదు చిరంజీవి. చాలా సందర్భాల్లో నాకు పాలిటిక్స్ సెట్ కావు అని చెప్పేశారు. ప్రజారాజ్యం తర్వాత.. పవన్ కల్యాణ్ ఏపీలో జనసేన పార్టీ పెట్టారు. ఆ పార్టీకి, తన తమ్ముడికి నైతికంగా మద్దతు ఇస్తున్నారు చిరంజీవి. నాగబాబు అయితే డైరెక్ట్ గా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి అయితే డైరెక్ట్ గా ఇప్పటివరకూ జనసేన (Janasena) ప్రోగ్రామ్స్ లో పాల్గొనలేదు. పవన్ కూడా ఎప్పుడూ పిలిచి ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు. కానీ మెగాస్టార్ ని ప్రసన్నం చేసుకోడానికి మరో రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. అవి బీజేపీ, కాంగ్రెస్. చిరంజీవిని ఆకట్టుకోడానికి బీజేపీ తెగ ప్రయత్నిస్తోంది. తమిళనాడులో రజనీకాంత్ ని, ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవిని తమ వైపునకు తిప్పుకోవాలని కమలనాధులు ఆరాటపడుతున్నారు. ఏపీలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఓపెనింగ్ టైమ్ లో చిరంజీవిని ప్రత్యేకంగా ఆ ప్రోగ్రామ్ కి ఆహ్వానించారు.. ఈ సందర్భంగా ప్రధాని మోడీ చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. చిరంజీవితో పాటు రాంచరణ్ తేజ్ తో భేటీ అయ్యారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. మెగాస్టార్ ని కూడా తమ పార్టీలోకి తెచ్చుకొని… స్టార్ క్యాంపెయినర్ ని చేస్తే ఏపీలో బీజేపీ బలపడుతుందని అధిష్టానం ఆశ. ఏపీలో ఇప్పట్లో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కనీసం పవన్, చిరంజీవి మద్దతుతో అయినా.. పార్టీ కొంచెం పుంజుకుంటుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే లేటెస్ట్ గా చిరంజీవికి పద్మవిభూషణ్ ఇవ్వాలని కూడా ప్రపోజల్ నడుస్తోంది.

ఇక కాంగ్రెస్ చిరంజీవిని ఏ మాత్రం వదులుకోవట్లేదు. తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ అయితే.. చిరంజీవి మా పార్టీ నేత.. ఆయనకు కాంగ్రెస్ సభ్యత్వం కూడా ఉంది. ఏపీలో కాంగ్రెస్ గెలిస్తే.. చిరంజీవియే మా ముఖ్యమంత్రి అని తరుచుగా ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో బలపడేందుకు షర్మిలను రంగంలోకి దింపింది AICC. ఇప్పుడు చిరంజీవిని కూడా యాక్టివ్ చేస్తే.. 10యేళ్ళుగా పడిపోయిన పార్టీని నిలబెట్టవచ్చనేది వాళ్ళ ఆశ. కానీ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఛాన్సే లేదు. గతంలోనే ఈ విషయంపై ఆయన తెగేసి చెప్పారు. తాను రాజకీయ రంగంలో రాణించేందుకు తగినవాడిని కానని కూడా చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ సభ్యత్వానికి ఆయన ఇప్పటిదాకా ఎందుకు రాజీనామా చేయలేదు అనేది అర్థం కాని ప్రశ్న. సరే.. బీజేపీ, కాంగ్రెస్.. ఏ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. మెగాస్టార్ మోరల్ సపోర్ట్ మాత్రం తమ్ముడు పవన్ కల్యాణ్ కే ఉంటుంది. ఆయనైతే నేరుగా ఏ రాజకీయ పార్టీని సపోర్ట్ చేసే అవకాశమే లేదు. గతంలో జరిగిన తప్పును రిపీట్ చేసే ఛాన్స్ లేదు. ఆయన కొందరి వాడు కాదు.. అందరి వాడిగానే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.