ఆంధ్రప్రదేశ్ లో వై నాట్ 175 (Why not 175) అంటున్నారు వైసీపీ (YCP) అధినేత, సీఎం జగన్ (CM Jagan). తన సంక్షేమ పథకాలు, తన ఇమేజ్ తో మరోసారి అధికారంలోకి రావాలని కలలుగంటున్నారు. కానీ నియోజకవర్గాల మార్పులు, చేర్పులతో కొత్తగా వచ్చిన వారికి, పాత వారు కూడా గెలుస్తామన్న గ్యారంటీ అయితే లేదు. ఒక నియోజకవర్గంలో పనికిరాని అభ్యర్థిని వేరే దగ్గర ఆదరిస్తారా… పైగా కొందరు మంత్రులు, వైసీపీ లీడర్ల మీద అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ విషయం ఇండియా టుడే కాంక్లేవ్ లో జగనే స్వయంగా ఒప్పుకున్నారు. అలాంటప్పుడు జగన్ ను చూసి జనం ఓట్లేస్తారా ?
స్థానిక నాయకుల వ్యక్తిగతాన్ని పట్టించుకోరా ?
నన్ను చూసి ఓట్లేయ్యండి… అంటూ తెలంగాణలో కేసీఆర్ జనాన్ని ఎంత బతిమలాడినా… బీఆర్ఎస్ ను ఓడించారు. కేసీఆర్ కుటుంబం అహంకారానికి తోడు… స్థానిక ఎమ్మెల్యేలు, నేతల మీద అవినీతి ఆరోపణలు కూడా గులాబీ పార్టీ ఓటమికి కారణం అయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చూసి మీ బిడ్డను గెలిపించండి అంటూ సీఎం జగన్ జనాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవల్లో పరిస్థితి మరోలా ఉంది.
చాలా నియోజకవర్గాల్లో చెల్లని కాసులను తీసుకొచ్చి… మరో నియోజవర్గంలో జనం మీదకు రుద్దే ప్రయత్నం చేశారు జగన్. ఈ మార్పులు, చేర్పుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, వైసీపీ లీడర్లు చాలామంది ఉన్నారు. అలాగే పార్లమెంట్ కు పోటీ చేస్తే ఓడిపోతారు అనుకున్నవాళ్ళని తీసుకొచ్చి అసెంబ్లీకి నిల్చొబెట్టారు. మరి జనం వీళ్ళకి ఎలా ఓట్లు వేస్తారు. ఎంత జగన్ ను చూసి ఓట్లు వేయాలని అనుకున్నా… స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి ఇమేజ్ బాగోలేకపోతే చూస్తూ… చూస్తూ.. ఎలా గెలిపిస్తారు. వెల్లంపల్లి శ్రీనివాసరావుని విజయవాడ వెస్ట్ నుంచి సెంట్రల్ కు మార్చారు. కానీ ఆయనపై అవినీతి ఆరోపణలు బాగా ఉన్నాయి. వైసీపీ నేతలే బహిరంగంగా ఆరోపణలు చేశారు.
వెల్లంపల్లి మంత్రిగా పనిచేసినప్పుడు… దేవాలయాల్లో పోస్టులను అమ్మినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నియోజకవర్గంలో ఏ పనికి అయినా కమీషన్లు దండుకున్నట్టు చెబుతారు. ఇప్పుడు సెంట్రల్ కి మార్చినంత మాత్రాన… అవినీతి ఆరోపణలు మాఫీ అవుతాయా ? అలాగే పెడన నుంచి పెనమలూరుకు మారిన మంత్రి జోగి రమేషన్ పైనా బోల్డన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తమ, పర బేధం లేకుండా అందర్నీ బాదేశారని ప్రతిపక్షాల నేతలు అంటుంటారు. కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ అవినీతిపై అయితే ఏకంగా ఫ్లెక్సీలే పెట్టేశారు. భూకబ్జా ఆరోపణలతో పాటు ప్రతి పనికీ ఇంత రేటు పెట్టి వసూళ్ళకు పాల్పడినట్టు వైసీపీ నేతలు బహిరంగంగానే ఆరోపించారు. మరో మంత్రి తానేటి వనిత మీదా ఆరోపణలు ఉన్నాయి.
ఇలా ఆరోపణలు వచ్చిన వారిని వేరే నియోజకవర్గాలకు మారిస్తే… రేపు అక్కడ కూడా దోచుకోరని గ్యారంటీ ఏంటని ప్రతిపక్ష నేతలు అడుగుతున్నారు.ఆరోపణలు వచ్చిన వాళ్ళనే నియోజకవర్గాల నుంచి షిప్ట్ చేసినట్టు స్వయంగా జగనే.. ఇండియా టుడే కాంక్లేవ్ లో ఒప్పుకున్నాడు. అంటే ఓ నియోజకవర్గానికి కొత్త వైసీపీ అభ్యర్థి వచ్చాడంటే… అతనిపై అవినీతి ఆరోపణలు ఉన్నట్టే అని జనానికి మాత్రం తెలియదా? ఏ వ్యక్తికైనా పర్సనల్ ఇమేజ్ లేకుండా… కేవలం జగన్ ను చూసి… గుడ్డిగా ఓట్లేసే పరిస్థితి ఇప్పుడు ఉందా ? రేపు ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనకు ఇవే ఆయా నియోజకవర్గాల్లో అస్త్రాలు కాబోతున్నాయి. ఆరోపణలు ఉన్న వైసీపీ మంత్రులు, లీడర్ల అవినీతి చిట్టాను లెక్కలతో సహా ఆ పార్టీలు బయట పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వై నాట్ 175 వైసీపీకి ఎలా సాధ్యమవుతుంది అన్నది ప్రశ్నగా మారింది.