NEGGEDEVARU TADIPATRI : జేసీ జెండా పాతుతారా? పెద్దారెడ్డి నిలుపుకుంటారా ? ఆ రెండు కుటుంబాల్లో ఎవరిది గెలుపు ?

దశాబ్దాలుగా నిర్మించుకున్న కంచుకోటలను 2019 ఎన్నికల్లో బద్దలు కొడితే.. ఈసారి తిరిగి ఆ కంచుకోటలను పునర్మించుకుంటామని అంటున్నారు అక్కడి నేతలు. రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆ నియోజకవర్గంలో ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారు ? నియోజకవర్గంలో పరిస్థితులు ఏంటి..?

 

 

 

దశాబ్దాలుగా నిర్మించుకున్న కంచుకోటలను 2019 ఎన్నికల్లో బద్దలు కొడితే.. ఈసారి తిరిగి ఆ కంచుకోటలను పునర్మించుకుంటామని అంటున్నారు అక్కడి నేతలు. రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆ నియోజకవర్గంలో ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారు ? నియోజకవర్గంలో పరిస్థితులు ఏంటి..? భారీ ఓటింగ్ సరళి దేనికి సంకేతం…? మహిళా ఓటర్లు ఎటువైపు ఉన్నారు..? ఎమ్మెల్యేల పనితీరు ప్రభావం చూపించబోతోందా..? ప్రభుత్వ పథకాలు ఓట్ల రూపంలో ఫలితాలను ఇస్తుందా..? తాడిపత్రి (Tadipatri) లో నెగ్గేదెవరు ?

ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) జరిగాయి. సహజంగా ఎన్నికలకు ముందే ఏదో ఒక పార్టీకి సానుకూల పరిస్థితి ఉంటుందని అంచనా వేసేవారు. కానీ ఈసారి ఏమాత్రం అలాంటి అంచనాలు వేయలేని సందిగ్ధత ఏర్పడింది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇచ్చారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అలాంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ముందు వరుసలో ఉంది. దశాబ్దాలుగా ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకుంది తాడిపత్రి నియోజకవర్గం. రెండు కుటుంబాల పెత్తనమే మూడు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఓటమి ఎరుగని కుటుంబాలకు 2019 ఎన్నికలు ఛేదు అనుభవాన్ని మిగిల్చాయి. మొదటిసారి తాడిపత్రిలో జేసీ కుటుంబం (JC family) ఓడిపోయింది. 2024 ఎన్నికలు వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తాయన్న దానిపై ఆసక్తికరంగా మారింది.

తాడిపత్రి నియోజకవర్గంలో జెసి కుటుంబానికి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుటుంబానికి…30 ఏళ్లుగా ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. రెండు వర్గాల మధ్య వార్‌లో…ప్రతిసారి జీసీ ఫ్యామిలీనే విజయాలు వరిస్తూ వచ్చాయి. దివాకర్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచారు. 1985, 1989, 1994, 1999, 2004, 2009 వరుస విజయాలు సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో దివాకర్‌రెడ్డి సోదరుడు ప్రభాకర్‌రెడ్డి పోటీ చేసి గెలిచారు. 2014లో దివాకర్‌రెడ్డి…అనంతపురం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. కంచుకోట లాంటి తాడిపత్రిలో… 2019 ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి… మొదటిసారి జేసీ కుటుంబంపై ఆధిపత్యం ప్రదర్శించారు. ఎవరూ ఊహించని విధంగా చేసి కుమారుడు అస్మిత్‌ రెడ్డిపై విజయం సాధించారు. అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఎన్ని గొడవలు జరిగినా ఎన్నికలే వారి అసలే టార్గెట్.
ఒకసారి కోల్పోయిన ప్రభావాన్ని కాపాడుకునేందుకు ఈసారి జెసి ప్రభాకర్ రెడ్డి పూర్తిస్థాయిలో తన ఎఫర్ట్ అంతా పెట్టారు.

2024 ఎన్నికల్లో పైచేయి సాధించడానికి ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా అదే స్థాయిలో పని చేశారు. ఈ ఇద్దరు నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో…ఎన్నికలు ఆషామాషీగా జరగలేదు. తన కుమారుడ్ని ఎమ్మెల్యేగా చేయాలన్న ఆకాంక్షతో జేసీ ప్రభాకర్‌రెడ్డి కాళ్లకు బలపం కట్టుకొని తిరిగారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాత్రం రెండోసారి జెసి కుటుంబంపై గెలిచి తన సత్తా చూపించాలని భావిస్తున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి గ్రామాల్లో ప్రజలతో మమేకమయ్యారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఐదేళ్లుగా గ్రామాలు చుట్టేస్తూనే ఉన్నారు. జేసీ, పెద్దారెడ్డి…ఎన్నికల్లో తమ శక్తి సామర్థ్యాలు అన్నీ ప్రయోగించారు.

2024 ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏంటి అన్నది ఉత్కంఠగా మారింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా తాడిపత్రి నియోజకవర్గంలో 83% పోలింగ్ అయింది. అంటే 2 లక్షల 48 వేల ఓట్లు పోల్ అయ్యాయి. జేసీ అస్మిత్‌ రెడ్డి యాంగిల్‌లో పరిశీలిస్తే…తాడిపత్రి పట్టణ ప్రజలు తనకు అనుకూలంగా ఓటు వేశారని అంటున్నారు. పెద్దవడుగూరు మండలంలో కూడా తమకు అనుకూలంగా ఓట్లు పడ్డాయని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాత్రం పూర్తిస్థాయిలో తనకే ఓట్లు పడ్డాయని ధీమాతో ఉన్నారు. కానీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా తమ వైపే ఉన్నారని పెద్దారెడ్డి అంటున్నారు. వాస్తవంగా ఈ ఐదేళ్ల పదవీకాలంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి…జెసి ప్రభాకర్ రెడ్డి మధ్య భారీ స్థాయిలో గొడవలు జరిగాయి. ఎన్నికల తర్వాత కూడా అవి కొనసాగుతున్నాయి.

తాడిపత్రి మున్సిపాలిటీలో మాత్రం…గతంలో ఉన్న అభివృద్ధి కొనసాగించలేకపోయారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మున్సిపాలిటీ నిధుల కోసం ఛైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి రోడ్డెక్కాల్సి వచ్చింది. ప్రస్తుత ఎన్నికలలో తాడిపత్రి పట్టణంలో టిడిపికి మెజారిటీ వస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. గతంలో తాడిపత్రి మున్సిపాలిటీని దేశంలోనే నెంబర్ వన్ గా మార్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి… ఈసారి అక్కడ పరిస్థితులను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. ఇవి జెసి కుమారుడు అస్మిత్ రెడ్డికి ప్లస్‌గా మారే ఛాన్సుంది. ఇటు ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాత్రం వైసీపీ చేపట్టిన సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. జేసీ తన వ్యక్తిగత ఇమేజ్ మీద ఆధారపడితే.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాత్రం తన ఇమేజెస్ తో పాటు జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్లస్ గా మార్చుకున్నారు. ఏదేమైనా ఈ నియోజకవర్గం మీద రాష్ట్రంలో అందరి ఫోకస్ ఉంది. పోయిన చోటే వెతుక్కోవాలన్న ఉద్దేశంతో ఈసారి జేసీ కుటుంబం… గతానికి భిన్నంగా శ్రమించింది. మరి ప్రజా తీర్పు ఎలా ఉంటుందన్నది చూడాలి.