Volunteer System : వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా.. పీకేస్తారా.. కోతల వెనక సర్కార్‌ సందేశమిదేనా ?

వాలంటీర్‌ వ్యవస్థ ఏపీలో రాజకీయ అలజడి క్రియేట్ చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని.. ఎన్నికల ముందు కూటమి పార్టీలు హామీ ఇచ్చాయ్. దీంతో పాటు వాలంటీర్ల జీతం 10 వేలకు పెంచుతామ‌ని అన్నారు.

వాలంటీర్‌ వ్యవస్థ ఏపీలో రాజకీయ అలజడి క్రియేట్ చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని.. ఎన్నికల ముందు కూటమి పార్టీలు హామీ ఇచ్చాయ్. దీంతో పాటు వాలంటీర్ల జీతం 10 వేలకు పెంచుతామ‌ని అన్నారు. ఐతే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఐతే ఎన్నికల ముందు కొందరు వాలంటీర్లు రాజీనామా చేయగా.. వారి పరిస్థితి ఏంటన్న దానిపై చర్చ జరుగుతుండగానే.. సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. పెన్షన్‌ పంపిణీ నుంచి వాలంటీర్లను దూరం పెట్టారు. వైసీపీ సర్కార్‌ హయాంలో ప్రతీ నెల లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వాలంటీర్లు పెన్షన్ అందించేవారు.

ఇప్పుడు ఈ బాధ్యతను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గ్రామ, అవార్డు, సచివాలయం ఉద్యోగులకు అప్పగించారు. జూలై 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రాబోతోంది. కేబినెట్‌ భేటీలో ఈ నిర్ణయం కూడా తీసుకున్నారు. దీంతో పాటు ప్రతీ నెలా వాలంటీర్లకు చెల్లించే 2వందల రూపాయల న్యూస్ పేపర్ అలవెన్స్‌ను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్ అవుతోంది. పెన్షన్ పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టడం, వారి అలవెన్స్‌కు కోత పెట్టడంతో.. అసలు వాలంటీర్‌ వ్యవస్థ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తే.. దానికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు రావాల్సి ఉందని.. ఐతే ఇప్పటివరకు అలాంటివి రాకపోవడంతో.. వాలంటీర్ వ్యవస్థకు రాంరాం చెప్పేసినట్లేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్.

ఇక అటు సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీపై కూడా రకరకాల సందేహాలు వినిపిస్తున్నాయ్. పెన్షన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులు ఏమాత్రం సరిపోరని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులలో అత్యధిక శాతం మంది నాన్ లోకల్స్ అని.. దీంతో వాళ్లు లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం అనేది సాధ్యం అయ్యే పని కాదని అంటున్నారు. ఐతే వాలంటీర్ వ్యవస్థపై రకరకాల అనుమానాలు వినిపిస్తున్న వేళ.. మరో ప్రచారం మొదలైంది. వాలంటీర్ వ్యవస్ధను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలుస్తోంది. వాలంటీర్లకు విద్యార్హత పెట్టే చాన్స్ కనిపిస్తోంది.

గత ప్రభుత్వంలో చేసినట్లు 50 ఇళ్లకు కాకుండా 100 ఇళ్లకు ఒక్కో వాలంటీర్ ఉండేలా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇలా వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం పెద్ద కసరత్తు చేసే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలలో వాలంటీర్ వ్యవస్థ అమలులోకి వచ్చే అవకాశం ఉందని ఓ టాక్ వినిపిస్తోంది. ఐతే వాలంటీర్‌ వ్యవస్థపై వైసీపీ మాత్రం చిన్నపాటి పోరాటమే చేస్తోంది. వాలంటీర్లకి చంద్రబాబు మార్క్ వెన్నుపోటు పొడ‌వ‌నున్నారు అంటూ వైసీపీ ఘాటు విమర్శలు చేస్తోంది.