అక్కడ పోటీలో ఉంది మాజీమంత్రి గంటా శ్రీనివాస్ (Ganta Srinivas)… పొలిటికల్ ఆక్టోపస్ (Political Octopus). అవకాశం దొరికితే అల్లుకుపోవడం ఆయన తత్వం. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎత్తులు తప్ప పల్లాలు ఎరుగని నేత. అలాంటి సీనియర్ ఈసారి ఎన్నికలు (AP Politics) కొత్త అనుభవాలను, గట్టి పోటీని ఎదుర్కున్నారు. ఆఖరి నిముషం వరకు టికెట్టే ఖరారు కాలేదు. దీంతో ఆయన పొలిటికల్ కెరీర్ క్లోజ్ అనేంతగా చర్చ జరిగింది. పట్టు బట్టి సాధించుకున్న సీట్లో శిష్యుడు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తో పోటీ పడ్డారు. ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు పక్కాగానే జరిగిందనే టాక్ వినిపిస్తోంది. కానీ బలాలను బలహీనతలు దెబ్బకొడితే ఏం జరుగుతుంది…? బిగ్ ఫైట్ జరిగిన చోట ఫలితం సంగతేంటి…? భీమిలి (Bhimili) లో నెగ్గేదెవరు?
గంటా శ్రీనివాసరావు…ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని నేత. కాపు కార్డు ఆయన బలం. అయితే రాజకీయ స్థిరత్వం లేకపోవడం బలహీనత. ఉమ్మడి విశాఖ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతల్లో ఒకరైన గంటా…వర్గ రాజకీయాలు నడపడంలో దిట్ట. ప్రతీ ఎన్నికకు నియోజకవర్గం…లేకపోతే పార్టీ మార్చేస్తారనేది ఆయన మీద ఉన్న ప్రధాన విమర్శ. అన్నిసార్లు కాకపోయినా… అది నిజం కూడా. 1999లో టీడీపీలో చేరిన గంటా… మొదటి ప్రయత్నంలోనే అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు. 2004లో చోడవరం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు ప్రజారాజ్యం పార్టీ టర్నింగ్ పాయింట్ అయింది. 2009లో అనకాపల్లి నుంచి పీఆర్పీ సీటుపై నెగ్గిన గంటా…పార్టీ విలీనం తర్వాత మంత్రి ఛాన్స్ కొట్టేశారు. 2014లో టీడీపీగూటికే చేరి…భీమిలి నుంచి పోటీకి దిగారు. సైకిల్ పార్టీకి కంచుకోట లాంటి భీమిలిలో గెలిచి మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా పని చేశారు. 2019లో మరోసారి సీట్ చేంజ్ చేసిన ఆయన విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజార్టీతో బయటపడ్డారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ…2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు గంటా శ్రీనివాసరావు. అంతకు ముందు…ఆ తర్వాత కూడా నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. పైగా గెలిచిన కొద్ది రోజులకే భవిష్యత్తులో…ఇక్కడ నుంచి మళ్ళీ పోటీ చేయనని ప్రకటించడం ద్వారా కేడర్‌ను తీవ్ర గందరగోళంలో పడేశారు. గంటా ఏక పక్ష ధోరణిపై ఫిర్యాదులు, రాజకీయంగా హైహ్యాండెడ్‌గా ఉంటారనే అభిప్రాయం…గంటాకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. 2024 ఎన్నికల్లో ఆయన టికెట్‌పై గ్యారెంటీ లేని పరిస్ధితి తలెత్తింది. కారణం…గంటా శ్రీనివాస్ స్వయం కృతాపాపరాధాలు వున్నాయనేది బహిరంగ రహస్యం. నాయకత్వంతో సఖ్యత లేకపోవడం, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కలిసి రాలేదనే భావన వెరసి….ఆఖరి నిమిషం వరకు అధిష్టానం పక్కన బెట్టేసింది. మారిన అంతర్గత పరిణామాలు, విస్త్రతమైన పరిచయాలతో…ఆఖరి వరకు చేసిన లాబీయింగ్ ఫలించింది.
భీమిలి వైసీపీ సిట్టింగ్ సీట్. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అవంతి శ్రీనివాస్… జగన్ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. అర్బన్, రూరల్ కాంబినేషన్‌తో కనిపించే ఈ సీటు… ఒకప్పుడు టీడీపీ కంచుకోట అనే మార్క్‌ను చెరిపేసింది వైసీపీ. మరోసారి వైసీపీ సర్కార్ అధికారంలోకి వస్తే… ఈ ప్రాంతం అత్యంత కీలకంగా మారుతుంది. ప్రతిపాదిత ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌కు కోర్ ఏరియా కూడా ఇదే అవుతుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉంది కనుకే భీమిలి ఎన్నికలపై అధికార పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇద్దరు కాపు నేతలు ప్రధాన పార్టీల ప్రత్యర్ధులు కావడం, ఇద్దరూ రాజకీయంగా ఓ వెలుగు వెలగడానికి ప్రజారాజ్యం కారణం కావడంతో… భీమిలిలో గెలుపు ఎవరిది అన్నదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకూ ప్రతీ అంశం ఆసక్తిని రేకెత్తించేదిగానే కనిపించింది. భీమిలీలో 3 లక్షల 63 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళల్లో లక్షా 84వేల మంది మహిళలు, లక్షా 78 వేల మంది మగవాళ్ళు ఉన్నారు. 2014లో 75.31 శాతం, 2019లో 73.90 శాతం, 2024లో 75.96 పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 2 లక్షల 75 వేలకు పైగా ఓట్లు పోల్ అయ్యాయి.
భీమిలి, ఆనందపురం, పద్మనాభం, చినగదిలి మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. వీటిలో చినగదిలి, భీమిలి మండలంలోని కొంత భాగం GVMCలో అంతర్బాగం. దీంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార వైసీపీ అభ్యర్ధి ముత్తం శెట్టి శ్రీనివాస్, కూటమి అభ్యర్ధి గంటా శ్రీనివాస్ విస్త్రతమైన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టుబట్టి సాధించుకున్న సీట్లో గెలవడం, ఓడటం కంటే ముందు… ఎంట్రీనే చర్చనీయాంశంగా మారాలనే భావనతో రాజకీయ వలసలు మొదలుపెట్టారు గంటా. తాను భీమిలి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సమయంలో ఉన్న పరిచయాల ద్వారా ఆకర్షణ మంత్రం ప్రయోగించి… సైకాలజికల్ వార్ ఓపెన్ చేశారు. విస్త్రతమైన పబ్లిసిటీతో మరోసారి గెలుపు గంటాదే అనేంత స్థాయిలో బిల్డప్ క్రియేట్ చేశారు. తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి సొంత మ్యానిఫెస్టోను ప్రకటించి రాజకీయ చర్చ ప్రారంభించారు. భీమిలి-భోగాపురం మధ్య శాటిలైట్ టౌన్ షిప్ అనేది ఆకర్షించేదిగా ఉన్నా…మిగిలినవన్నీ ఆయన గతంలో పని చేసినప్పుడు వదిలేసినవి.
పోలింగ్ తర్వాత భీమునిపట్టణం ఎన్నికల ఫలితం ఎవరి పక్షం…? అన్న చర్చ జరుగుతోంది. మాజీ మంత్రులు గంటా, అవంతి వర్గాలు…ఎవరికి వారే మెజారిటీ లెక్కేసుకుంటున్నారు. జనం అభిప్రాయం అంతిమం కనుక ఇక్కడ పోలింగ్ ప్యాట్రన్…అభ్యర్ధులకు ఉన్న బలాలు, బలహీనతలు, పార్టీల పట్టు…ఇవన్నీ చాలా కీలకం. ఈ ఎన్నికల్లో అర్బన్ ఓటర్లపై గంటా ఎక్కువ దృష్టి పెట్టారు. ఎండాడ, మధురవాడ, పీఎం పాలెం, భీమునిపట్టణం లాంటి చోట్ల టీడీపీ విస్త్రతంగా ప్రచారం చేసింది. సహజంగా అర్బన్ ఓటర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారన్ టాక్ ఉంది. అదే నిజమైతే భీమిలిలో టీడీపీని నగర ప్రజలు ఆదరణ లభించి ఉండాలి. పోలింగ్ తీరు చూస్తే ఇక్కడ ఎఫెక్ట్ ఎంత వరకు వుంటుంది అనేది అంతుబట్టడం లేదు. ఈ స్ధానంలో 87వేల 266 ఓట్లు పోల్ అవలేదు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ఉద్యోగులు, వలస కూలీలు…ఈ నియోజకవర్గంలో నివసిస్తున్నారు. ఎన్నికల నాటికి వాళ్ళంతా సొంత జిల్లాలకు వెళ్ళిపోవడంతో ఇక్కడ పోలింగ్ తగ్గింది. ఆ ఎఫెక్ట్ టీడీపీపై ఖచ్చితంగా పడుతుందనే లెక్కలున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు…మహిళా ఓటర్లను ప్రభావితం చేశాయనేది పోలింగ్ తీరును బట్టి అర్ధమవుతోంది. గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేయడం…ఇక్కడ వైసీపికి కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. మొదటి నుంచి రూరల్ ప్రాంతంపై ఫోకస్ పెంచిన వైసీపీ…ఎక్కడికక్కడ చాపకింద నీరులా పని చక్కబెట్టేసింది.
రాజకీయ చాణుక్యుడుగా పిలిచే బొత్సకు…భీమిలి నియోజకవర్గంలో విస్త్రతమైన వ్యక్తిగత, కుటుంబ పరిచయాలు ఉన్నాయి. బొత్స ఝాన్సీ ఎంపీ అభ్యర్ధి కావడంతో సహజంగానే తమకు పట్టున్న భీమిలిని మరింత ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. అది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎమ్మెల్యే అభ్యర్ధి అవంతి శ్రీనివాస్‌కు ప్లస్ పాయింట్ అయింది. అక్రమాల ఆరోపణలు లేకపోవడం సిట్టింగ్ ఎమ్మెల్యేగా అవంతికి ఎంత ప్లస్సో… దుందుడుకుతనం, తూలనాడే తత్వం అంతే మైనస్ అనే చర్చ జరుగుతోంది. గంటా శ్రీనివాస్ అవకాశవాద రాజకీయ నేత అనేది ప్రత్యర్ధులు చేసే బలమైన విమర్శ. అందుకు తగ్గట్టుగానే ఆయన చర్యలు ఉంటాయి. జనసేన ఓట్లు ఎంత వరకు ట్రాన్స్ ఫర్ అయిందనేది క్లారిటీ లేదు. ఇలా చూసుకున్నప్పుడు గంటా, అవంతిల్లో గెలుపు ఎవరిది అనేది విశ్లేషణలకు కూడా అందడం లేదు. సాంప్రదాయ టీడీపీ ఓట్ బ్యాంక్, జనసేన సంపూర్ణ మద్దతు లభిస్తే గంటా గట్టెక్కేస్తారు. రూరల్ ఓటింగ్, బొత్స అండదండలు కలిసి వస్తే…అవంతి అదృష్టవంతుడు అవుతాడన్న అంచనాలు ఉన్నాయి.