ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ ఢిల్లీలో ధర్నా చేశారు వైసీపీ అధినేత జగన్. 35 మంది వైసీపీ లీడర్లు, కార్యకర్తలను చంపేశారంటూ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి మరీ చూపించారు జగన్. చంపాలనుకుంటే నన్ను చంపేయండి. మీకు ఓటు వేయలేదని… అమాయకులైన ప్రజలను చంపడం కరెక్ట్ కాదు అంటూ నేషనల్ మీడియా ముందు ఎమోషన్ అయ్యారు. జాతీయ మీడియా ఏపీ వచ్చి చూడాలని రిక్వెస్ట్ చేశారు జగన్.
ధర్నా తర్వాత మరో మరో రెండు రోజులు ఢిల్లీలోనే మకాం పెట్టాలనుకున్న జగన్… గురువారమే తిరిగొచ్చారు. ఏపీలో హింసపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీకి కంప్లయింట్ చేయాలనుకున్న జగన్ ప్లాన్ వర్కవుట్ అవ్వలేదు. వాళ్ళిద్దరూ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దాంతో చేసేది లేక వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి తిరుగు టపా కట్టి విజయవాడకు చేరుకున్నారు.
పార్లమెంటు సమావేశాల టైమ్ లోనే ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా అన్ని పార్టీల దృష్టిని ఆకర్షించాలన్న జగన్ ప్లాన్ అయితే కొద్దో గోప్పో సక్సెస్ అయింది. సమాజ్ వాది పార్టీతో పాటు మరికొన్ని చిన్న చితకా పార్టీల ఎంపీలు జంతర్ మంతర్ కు వచ్చి మద్దతు ఇచ్చారు. కానీ ధర్నాతో ఆయన ఏం సాధించారని టీడీపీ, జనసేన లీడర్లు ప్రశ్నిస్తున్నారు.
జగన్ ను తన బాబాయి వైఎస్ వివేకానంద హత్య సంఘటనే వెంటాడుతోంది. బుధవారం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా హు కిల్డ్ బాబాయ్ అంటూ వివేకా హత్య గురించి ప్రస్తావించారు. అంతేకాదు… జగన్ పాలించిన 5యేళ్ళల్లో దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా 2 వేల 686 హత్యలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. జగన్ ధర్నాపై మంత్రి లోకేశ్ తో పాటు టీడీపీ నేతలు సోషల్ మీడియా సాక్షిగా ట్రోలింగ్ చేశారు. ఈ ఆందోళన ఏపీ జనం మీద ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించలేదన్న టాక్ నడిచింది.