AP Elections : టీడీపీ ఆఫీసులో వైసీపీ కోవర్టులు.. ఎవడు మనోడు ? ఎవడు బయటోడు ?

కాలానుగుణంగా ఎన్నికల స్టైల్‌ మారిపోతోంది. నేరుగా చేసే యుద్దంతో పాటు.. తెర వెనుక ఉండి పని చేసే కన్పించని శత్రువులతో కూడా పోరాడుతున్నాయి రాజకీయ పార్టీలు. ప్రతిచోటా అదే జరుగుతున్నా.. ఏపీలో ఇంకొంచెం ఎక్కువ అన్నట్టుగా ఉంది వ్యవహారం. ముఖ్యంగా వైసీపీ-టీడీపీ మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్దంలో బ్యాక్‌ ఆఫీస్‌ కార్యకలాపాలపై నిఘాలు పెరుగుతున్నాయట.

కాలానుగుణంగా ఎన్నికల స్టైల్‌ మారిపోతోంది. నేరుగా చేసే యుద్దంతో పాటు.. తెర వెనుక ఉండి పని చేసే కన్పించని శత్రువులతో కూడా పోరాడుతున్నాయి రాజకీయ పార్టీలు. ప్రతిచోటా అదే జరుగుతున్నా.. ఏపీలో ఇంకొంచెం ఎక్కువ అన్నట్టుగా ఉంది వ్యవహారం. ముఖ్యంగా వైసీపీ-టీడీపీ మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్దంలో బ్యాక్‌ ఆఫీస్‌ కార్యకలాపాలపై నిఘాలు పెరుగుతున్నాయట. తెర వెనుక ఉండి వ్యూహాలకు ఊతం ఇస్తున్న వారిని పట్టుకుంటే తాము లక్ష్యాన్ని చేరుకోవడం చాలా తేలికన్న ఉద్దేశ్యంతో.. ఆపరేషన్‌ బ్యాక్‌ ఆఫీస్‌ ను మొదలుపెట్టాయి పార్టీలు.

ఏపీలో ఇప్పుడు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై ఓ రేంజ్‌లో యుద్ధమే జరుగుతోంది. దీనికి సంబంధించి ఎప్పుటికప్పుడు క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తెప్పించుకోవడంతో పాటు.. జాబితాలో మార్పులను విశ్లేషించడం కీలకంగా మారింది. అధికార-ప్రతిపక్షాల పరస్పర ఫిర్యాదుల ప్రకారం.. మొత్తం 175 నియోజకవర్గాలకు గానూ.. 60 నుంచి 70కు పైగా నియోజకవర్గాల్లో భారీ అవకతవకలకు ఆస్కారం ఉందనే చర్చ జరుగుతోంది. ఒక్కో నియోజకవర్గంలో కనీసం పది వేల ఓట్ల తేడాలు వస్తున్నాయన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. పరిష్కరించే ప్రయత్నం జరుగుతున్నా.. రోజుకో రకం ఫిర్యాదుతో ఈసీకి క్యూ కడుతున్నాయి రాజకీయ పార్టీలు. దీనికి సంబంధించి తెర వెనకుండి ఈ వర్క్‌ చేసేదంతా బ్యాక్‌ ఆఫీస్‌ టీమే. ఈ పరిస్థితుల్లో తమ బ్యాక్‌ ఆఫీస్‌ టీమ్‌పై వైసీపీ నిఘా పెట్టిందని ఆందోళన పడుతున్నాయట టీడీపీ వర్గాలు. అందుకు కారణాలున్నాయంటున్నారు పార్టీ నేతలు.

ఇటీవల వివిధ సందర్భాల్లో ఎంపీ విజయసాయిరెడ్డి ఈసీని కలిసినప్పుడు, ప్రెస్‌ మీట్లలో తమ బ్యాక్‌ ఆఫీస్‌లో పనిచేసేవారి పేర్లను చెప్పడం విని షాకయ్యారట తెలుగుదేశం నేతలు. ఎక్కడా ఎక్స్‌పోజ్‌ అవకుండా.. ఆఫీస్‌లో ఉండి గుట్టు చప్పుడు కాకుండా పని చేసే వాళ్ళ పేర్లు బయటికి రావడంతో కంగుతిన్నారట. పేర్లు బయటికి తెలవడమే కాకుండా.. వాళ్ళ మీద ఫిర్యాదులు కూడా చేయడంతో ఎన్టీఆర్‌ భవన్‌ వర్గాలకు మైండ్‌ బ్లాంక్‌ అయిందంటున్నారు. ఆఫీస్‌ లోపల కామ్‌గా పనిచేసుకునే వారి మీద కూడా ఇంతలా నిఘా పెట్టారంటే.. అసలు పార్టీ ఆఫీస్‌ నుంచి ఎలాంటి రహస్యాలు బయటికి వెళ్తున్నాయోనని టెన్షన్‌ పడుతున్నారట టీడీపీ ముఖ్య నేతలు. ఇలా బ్యాక్‌ ఆఫీసులో పనిచేసే వారిని నేరుగా టార్గెట్‌ చేస్తే.. పార్టీ వేసుకునే వ్యూహాలు.. బయటకు వచ్చేస్తే.. ఎన్నికల టైంలో చాలా కష్టమంటున్నాయి టీడీపీ వర్గాలు. అందుకే ఇప్పుడు దీన్ని కౌంటర్ చేసుకోవడం ఎలాగన్న చర్చ మొదలైందట. మరి సైకిల్ పార్టీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో.. రహస్యాలు బయటికి వెళ్లకుండా ఏం చేస్తుందో చూడాలి.