ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు (Andhra Pradesh Assembly Elections) దగ్గర పడుతున్న టైమ్ లో వైసీపీ అధిష్టానానికి ఉత్తరాంధ్రలో గ్రూప్ పాలిటిక్స్ (Politics) పెద్ద తలనొప్పిగా మారాయి. ఆ ప్రాంతంలో క్లీన్ స్వీప్ చేయాలని జగన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విశాఖను రాజధాని (Visakhapatnam capital) చేస్తామనీ.. శ్రీకాకుళం, విజయనగరం సమస్యలు పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. దశాబ్దాలుగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని చెబుతున్నారు. కానీ అక్కడ YCP నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో.. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో ఆ పార్టీకి ఎదురు గాలి వీస్తోంది. పార్టీని సమన్వయం చేసే బాధ్యతను గతంలో విజయసాయి రెడ్డి, ప్రస్తుతం వై.వి సుబ్బారెడ్డికి (YV Subbareddy) అప్పగించినా ఉపయోగం లేకుండా పోయింది. ఉత్తరాంధ్రలో వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకీ పడిపోతుందే తప్ప లేవడం లేదు. అందుకే.. స్థానిక నేత అయిన మంత్రి బొత్సా సత్యనారాయణకి రీజినల్ కోఆర్డినేటర్ పదవి ఇవ్వాలని సీఎం జగన్ (CM Jagan) నిర్ణయించారు.
ఉత్తరాంధ్రలోని అన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవాలని వైసీపీ చీఫ్, సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆశ. మొదటి నుంచి ఎక్కువగా ఆ ప్రాంతానికే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా అక్కడే ముందుగా ప్రకటించారు. కానీ ఈ ప్రాంతంలో వైసీపీ నేతల మధ్య అస్సలు సమన్వయం లేదు. ఎవరి దోవ వారిదే.. ఎవరి రాజకీయాలు వారివే.. ఉత్తరాంధ్రలో వైసీపీ పట్టుకోల్పోతుంది అన్న సంగతిని ఆలస్యంగా గుర్తించారు సీఎం జగన్. గతంలో రీజినల్ కోఆర్డినేటర్ గా పనిచేసిన విజయ సాయిరెడ్డి, ఇప్పుడున్న వై వి సుబ్బారెడ్డితో పార్టీ ఏ మాత్రం బాగుపడింది లేదు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడమే సాయి రెడ్డి, సుబ్బారెడ్డికి చేత కాలేదు. ఇక విజయసాయిరెడ్డి హయాంలో అయితే.. వైసీపీ మరీ దిగజారిపోయింది. పార్టీని నిలబెట్టమని సాయిరెడ్డిని పంపితే.. ఆయనతో పాటు మిగిలిన నేతలందరిపైనా భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. ఇక లాభం లేదనుకొని.. సాయిరెడ్డిని తొలగించి.. వైవి సుబ్బారెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించారు జగన్. కానీ ఉత్తరాంధ్రలో పార్టీని చక్కదిద్దలేక సుబ్బారెడ్డి కూడా చేతులెత్తేశారు. పైగా నేరుగా జగన్ దగ్గరకే ఉత్తరాంధ్ర లీడర్లు పంచాయతీకి వెళ్తున్నారు.
ఈమధ్య వైజాగ్ కు వచ్చిన జగన్ కు ఎయిర్ పోర్టులోనే రెండు వ్యతిరేక వర్గాలు పోటాపోటీగా స్వాగతాలు పలికాయి. నేతల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడంపై అప్పుడే ఆయన సీరియస్ అయ్యారు. వైవీ సుబ్బారెడ్డి తన సీటు, తన వారి కోసమే పనిచేస్తున్నారే తప్ప సమస్యలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వచ్చాయి. ఇప్పటికే పార్టీ బాగా దెబ్బతినడంతో ఇక లాభం లేదనుకున్న జగన్.. రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతలను స్థానిక నేత అయిన మంత్రి బొత్సా సత్యనారాయణకే అప్పగించాలని నిర్ణయించారు. ఆయన అయితేనే.. పార్టీలో గ్రూపులను కంట్రోల్ చేస్తారని జగన్ భావిస్తున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బొత్సకు పదవి అప్పగించినంత మాత్రాన.. వైసీపీ గ్రూపులన్నీ ఒక్కటవుతాయా. చేజారిపోతున్న ఉత్తరాంధ్రను తిరిగి తీసుకురాగలుగుతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలో మాగ్జిమమ్ సీట్లు గెలిస్తే.. మళ్ళీ విజయం తనకే దక్కుతుంది.. మేజిక్ ఫిగర్ దాటడం ఈజీ అని జగన్ ఆశపడుతున్నారు. కానీ ఆలస్యంగా మేల్కోవడంతో.. జగన్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.