ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల కోసం వైసీపీ రక రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఇంఛార్జుల మార్పుతో సిట్టింగ్స్ స్థానంలో మార్పులు, చేర్పులు చేస్తోంది. మరోవైపు – టీడీపీ, జనసేనలో ఉద్దండులు నిలబడే చోట.. వారికి పోటీగా కుల సమీకరణాలను లెక్కలోకి తీసుకొని టిక్కెట్లు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. అందుకే టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురంపై నజర్ పెట్టారు. అక్కడ ఇప్పటికే రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న బాలక్రిష్ణకు పోటీగా గట్టి అభ్యర్థిని రంగంలోకి దింపుతోంది వైసీపీ.
ఆంధ్రప్రదేశ్ అంతటా.. టీడీపీ కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో.. బలమైన అభ్యర్థులను రంగంలోకి దించుతున్నారు వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి. ఆ నియోజకవర్గంలో పలుకుబడి కలిగిన, క్యాస్ట్ ఈక్వేషన్స్ దృష్టిలో పెట్టుకొని టిక్కెట్లు ఇస్తున్నారు. హిందూపురం నియోజకవర్గం టీడీపీకి బలమైనది. పార్టీ పెట్టినప్పటి నుంచీ అక్కడ మరొకటి గెలవలేదు. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు తెలుగు దేశం నిలబెట్టిన అభ్యర్థులనే గెలిపిస్తున్నారు అక్కడి ఓటర్లు. 1983 నుంచి హిందూపురం నుంచి ఎన్టీఆర్ 3 సార్లు గెలిచారు. తర్వాత వెంకట్రాముడు ఒకసారి, అబ్దుల్ ఘనీ ఒకసారి గెలిచారు. 1996లో ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో నందమూరి బాలక్రిష్ణకు విజయం దక్కింది. 1983 నుంచి ఇప్పటి దాకా టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురంలో ఆ పార్టీని ఓడించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈసారి బెంగళూరు బిజినెస్ ఉమెన్ దీపికను బాలయ్య బాబుకి పోటీగా నిలబెడుతున్నారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టుబట్టడంతో జగన్ కూడా ఆమెనే నియోజకవర్గ ఇంఛార్జ్ గా నియమించారు.
దీపిక.. వైసీపీ లీడర్ వేణుగోపాల్ రెడ్డి భార్య. ఆమెది కురుబ సామాజిక వర్గం.. భర్తది రెడ్డి కులం. దాంతో ఈ రెండు కులాల ఓట్లు వైసీపీకి పడతాయన్నది ప్లాన్. హిందూపురంలో ముస్లింలు, బీసీల ఓట్లే ఎక్కువ. పట్టణంలో ముస్లింలు.. రూరల్ ప్రాంతాల్లో బీసీల ఓట్లు కీలకం. నియోజకవర్గంలో 60వేల ముస్లిం ఓట్లు ఉంటే.. బీసీల ఓట్లు 90 వేలు ఉన్నాయి. ఇప్పటిదాకా హిందూపురం నియోజకవర్గాలో మహిళ పోటీకి దిగలేదు. అందుకే ఇప్పుడు బాలక్రిష్ణను ఓడించడానికి.. బీసీ మహిళ అస్త్రం ఉపయోగిస్తున్నారు వైఎస్ జగన్. దీపికను గెలిపిస్తే.. ఈసారి మంత్రి పదవి గ్యారంటీ అని కూడా ప్రచారం మొదలుపెట్టారు వైసీపీ నేతలు. కానీ హిందూపురంలో బీసీ ఓటర్లంతా టీడీపీనే గెలిపిస్తున్నారు. దాంతో బాలక్రిష్ణ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని టీడీపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. ఇక్కడి వైసీపీ లీడర్లు నాలుగు గ్రూపులుగా విడిపోవడంతో దీపిక గెలవడం కష్టమే అంటున్నారు. జగన్ మాత్రం బాలక్రిష్ణను ఓడించి.. టీడీపీకి చెక్ పెట్టడం ద్వారా హిందూపురం రికార్డులను తిరగరాయాలని గట్టి పట్టుదలగా ఉన్నారు