YS JAGAN ON SHARMILA: జగన్‌కి ఇష్టం లేదా..? షర్మిల ఎంట్రీవేళ.. జగన్ అలా అన్నాడేంటి ?

జగన్ వ్యాఖ్యలను గమనిస్తే షర్మిల కాంగ్రెస్‌లో చేరడం, ఏపీ బాధ్యతలు తీసుకోవడం ఆయనకు అస్సలు ఇష్టం లేనట్టుగా అర్ధం అవుతోంది. జగన్ జైల్లో ఉన్నప్పుడు 2014కి ముందు వైసీపీ బాధ్యతలను నెత్తికెత్తుకున్న షర్మిల, విజయమ్మ.. జనంలో తిరుగుతూ టీడీపీని ఓడించాలని ప్రచారం చేశారు.

  • Written By:
  • Publish Date - January 3, 2024 / 03:08 PM IST

YS JAGAN ON SHARMILA: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లోకి షర్మిల చేరబోతున్న సమయంలో ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కుట్రలు, కుతంత్రాలు జరుగుతుంటాయని.. పొత్తుల కోసం కుటుంబాలను కూడా చీలుస్తారని జగన్ ఆరోపించారు. కాకినాడ సభలో జగన్ చేసిన ఆ కామెంట్స్.. షర్మిల కాంగ్రెస్‌లో చేరడాన్ని ఉద్దేశించినవే అనే చర్చ నడుస్తోంది. తెలంగాణలో వైఎస్పార్‌టీపీని విలీనం చేయడంతో పాటు.. ఏపీ కాంగ్రెస్‌లో చేరబోతున్నారు షర్మిల.

YS JAGAN: పొత్తుల పేరుతో కుటుంబాల్ని చీల్చి రాజకీయం చేస్తారు: జగన్

ఆమెకు ఏపీ బాధ్యతలు అప్పగిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే అన్నా చెళ్లెళ్ల సవాల్‌గా ఏపీ రాజకీయాలు మారతాయనే ప్రచారం జరుగుతోంది. జగన్ వ్యాఖ్యలను గమనిస్తే షర్మిల కాంగ్రెస్‌లో చేరడం, ఏపీ బాధ్యతలు తీసుకోవడం ఆయనకు అస్సలు ఇష్టం లేనట్టుగా అర్ధం అవుతోంది. జగన్ జైల్లో ఉన్నప్పుడు 2014కి ముందు వైసీపీ బాధ్యతలను నెత్తికెత్తుకున్న షర్మిల, విజయమ్మ.. జనంలో తిరుగుతూ టీడీపీని ఓడించాలని ప్రచారం చేశారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చి, జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. తన కష్టం గుర్తించి అన్న ఏదో ఒక కీలక పదవి ఇస్తారనుకుంది షర్మిల. అది జరగకపోవడంతో.. మెల్లిగా ఏపీ నుంచి తెలంగాణకు షిప్ట్ అయ్యారు. తెలంగాణ తన పోరుగడ్డ అని చెప్పిన షర్మిల వైఎస్సార్టీపీ పేరుతో మూడేళ్ల క్రితం పార్టీ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి సిద్ధపడ్డారు. అప్పుడు కూడా షర్మిల గురించి, ఆమె పార్టీ గురించి జగన్ ఒక్క మాట మాట్లాడలేదు.

షర్మిలకు పీసీసీ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్‌తో పాటు కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతారని తెలుస్తోంది. షర్మిల కూడా వైఎస్సార్ సెంటిమెంట్‌తోనే ఏపీ ఎన్నికల్లోకి దిగుతుండటం జగన్‌ను కలవరపెడుతోంది. వైఎస్ అభిమానాలతో పాటు.. క్రిస్టియన్ ఓటు బ్యాంకుపైనా షర్మిల ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఇన్నాళ్ళు షర్మిల తెలంగాణలో ఒంటరి పోరు చేసినా.. ధర్నాలు, ఆందోళనల్లో పాల్గొని అరెస్ట్ అయినా ఎప్పుడూ జగన్ స్పందించలేదు. కేసీఆర్‌తో ఫ్రెండ్‌షిప్ ఉండటంవల్లేనేమో.. చెల్లెలు గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కానీ.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఖరారు కావడంతోనే జగన్ రియాక్ట్ అయ్యారు. కుటుంబం మధ్య చిచ్చు పెడతారు అంటున్న సమయంలో జగన్‌లో భావోద్వేగం కనిపించింది. కాంగ్రెస్‌లో జాయిన్ అవ్వడానికంటే ఒక్క రోజు ముందు ఆయన స్పందించడంపై వైసీపీలో చర్చ నడుస్తోంది. మొత్తానికి ఏపీ రాజకీయాలు అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆసక్తికరంగా మారతున్నాయి.