YS JAGAN: వైనాట్ 175 పేరుతో, రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ వైఖరి మారిందా..? సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుపై పునరాలోచనలో పడ్డారా..? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది తాజా పరిణామాలు చూస్తుంటే. మరో మూడు నెలల్లో జరగబోయే ఎన్నికల కోసం వైసీపీ అధినేత జగన్.. ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల్ని జగన్ మారుస్తున్నారు. ఈసారి టిక్కెట్లు ఇచ్చేది లేదని చెబుతున్నారు.
CONG FUNDS: కాంగ్రెస్ ఖజానా ఖాళీ…కాంగ్రెస్ దగ్గర డబ్బుల్లేవా ? క్రౌడ్ ఫండింగ్ తో నిధుల వేట
ఇప్పటికే 11 నియోజకవర్గాలకు ఇంచార్జిలను మార్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో వేరే వారికి బాధ్యతలు అప్పగించారు. ఇంకొందరు ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా ఇదే విషయం వ్యక్తిగతంగా చెప్పారు. కానీ, ఈ ప్రయత్నాలు బెడిసికొడుతున్నట్లు కనిపిస్తోంది. టిక్కెట్ దక్కదని తెలిసిన చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు వైసీపీపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. జగన్‌కు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మరికొందరు వేరే పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ, జనసేనతో సంప్రదింపులు జరుపుతున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వంటి నేతలు నేరుగా జగన్‌ను విమర్శిస్తున్నారు. వీటన్నింటినీ వైసీపీ అధిష్టానం గమనిస్తోంది. ఈ వ్యతిరేకత పార్టీకి మంచిది కాదని నమ్ముతోంది. ఇదే సమయంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారం జగన్‌ను మరింత కలవరపెడుతోంది. ఏపీ కాంగ్రెస్‌లోకి షర్మిల ఎంట్రీ ఇస్తే.. అద్భుతాలేం జరగకపోవచ్చు. కానీ, దీనివల్ల ఎక్కువగా నష్టపోయేది వైసీపీ మాత్రమే. ఎందుకంటే గతంలో కాంగ్రెస్‌లో ఉన్న నేతలంతా చేరింది వైసీపీలోనే.
ఇప్పుడు సిట్టింగ్‌లను మార్చే సాకుతో వాళ్లందరినీ తొలగిస్తే.. ఆ నేతలంతా వెళ్లి షర్మిల ఆధ్వర్యంలో నడిచే కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. జగన్ కాదంటే నేతలంతా షర్మిలతో నడిచే అవకాశం ఉంది. అటు షర్మిల రూపంలో పొంచి ఉన్న ప్రమాదం.. పార్టీలో కనిపిస్తున్న అసంతృప్తి, తిరుగుబాట్ల వల్ల వైసీపీకి మరింత నష్టం కలిగే అవకాశం ఉందని జగన్ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్‌లను మార్చే విషయంలో జగన్ పునరాలోచనలో పడ్డారు. నిజానికి డిసెంబర్ 31లోపు 50 మంది ఇంచార్జుల మార్పుతో రెండో జాబితా వస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు ఆ జాబితా విడుదల కాలేదు సరి కదా.. మెల్లగా పాత అభ్యర్థులకే టిక్కెట్లు ఖరారు చేస్తున్నట్లుగా సమాచారం ఇస్తున్నారు. దీంతో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తోంది.