తెలంగాణలో YSRTP కథ ముగిసింది. ఆ పార్టీని అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆమె కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఏపీ కాదు అండమాన్ బాధ్యతలు ఇచ్చిన స్వీకరిస్తా అంటున్నారు షర్మిల.
తెలంగాణలో YSRTP ని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల ఇవాళ ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు షర్మిల. తమ పార్టీని విలీనం చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ లో చేరినట్టు చెప్పారు. తాను వైఎస్సార్ అడుగు జాడల్లోనే నడుస్తున్నానని షర్మిల అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్నది మానాన్న కల అని చెప్పారు. దేశంలోనే అతి పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అన్నారు షర్మిల. మణిపూర్ లో చర్చిల విధ్వంసం తనను కలిచివేసిందని చెప్పారు. కేంద్రంలో సెక్యులర్ పార్టీ లేనందుకే మణిపూర్ లో దాడులు జరిగాయన్నారు వైఎస్ షర్మిల. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ పై నమ్మకాన్ని నాతో పాటు ప్రజలందరిలో పెంచిందన్నారు షర్మిల. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పారు.