YSRCP Rebel MLAs: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎందుకు అనర్హత వేటు వేయరాదో తెలపాలంటూ నలుగురు ఎమ్మెల్యేలతోపాటు, ఒక ఎమ్మెల్సీకి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్ని సవాలు చేస్తూ.. వైసీపీ తిరుగుబాటు నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తమకు సమాధానం ఇచ్చేందుకు గడువు ఇవ్వాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.
TTD: మహిళల కోసం టీటీడీ మంగళసూత్రాలు.. ధర ఎంతంటే..
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వీరి తరఫున లాయర్లు తమ వాదన వినిపించారు. తమ అనర్హత విచారణ నోటీసులు రద్దు చేయాలని హై కోర్టును కోరారు. తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా రాజ్యసభ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని హడావిడిగా నోటీసులు ఇచ్చారని, ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాబట్టి అనర్హత ఫిర్యాదులపై స్పందించేందుకు, సమాధానం ఇచ్చేందుకు మరింత గడువు ఇచ్చేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై ఇరు వర్గాలు వాదనలు విన్న హైకోర్టు ఇవాళ తీర్పు ఇస్తామని మొదట చెప్పింది. కానీ, చివరికి తీర్పు రిజర్వు చేసింది. మంగళవారం ఈ పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
మరోవైపు తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు. తాము ఇది వరకే లేఖలో రాసినట్లుగా సమాధానం ఇచ్చేందుకు 4 వారాల సమయం అడిగినట్లు ఎమ్మెల్యేలు మీడియాకు తెలిపారు. సీఎం జగన్ ఒత్తిడి మేరకే స్పీకర్ పని చేస్తున్నారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. మంగళవారం వెలువడే తీర్పును అనుసరించి ఈ ఎమ్మెల్యేల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.