Jack Ma: పిల్లలకు పాఠాలు చెబుతున్న జాక్‌మా..!

కానీ ఆయనో సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ మెన్... తక్కువ సమయంలో ఓ సామ్రాజ్యాన్నే నెలకొల్పారు. ఎవరూ ఊహించని ఎత్తులు వేయడం ఆయనకు అలవాటు. ఆయన వ్యాపార అనుభవం విద్యార్థులకు ఓ పాఠం.

  • Written By:
  • Updated On - May 2, 2023 / 10:33 PM IST

జాక్‌ మా గుర్తున్నారా….? అలీబాబా గ్రూప్‌ అధినేత… సెకనుకు కోట్లు సంపాదించి బిజీబిజీ లైఫ్ గడిపి ప్రస్తుతం సాదాసీదాగా నివసిస్తున్న ఈ చైనీస్ బిజినెస్‌ టైకూన్, బిలియనీర్ ఇప్పుడు ప్రొఫెసర్ అవతారం ఎత్తారు. ఓ జపాన్ కాలేజీలో విద్యార్థులకు బిజినెస్ పాఠాలు చెప్పబోతున్నారు. చైనాకు తిరిగి వచ్చినా ఆయన మళ్లీ తన వ్యాపార పగ్గాలెందుకు తీసుకోవడం లేదు…?

జాక్‌మా ఇప్పుడు సరికొత్త కెరీన్‌ను ప్రారంభిస్తున్నారు. జపాన్‌లోని టోక్యో యూనివర్శిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేయనున్నారు. అక్కడి విద్యార్థులకు పాఠాలు చెప్పనున్నారు. రీసెర్చ్‌ టాపిక్స్‌పై సలహాలు ముఖ్యంగా స్టార్టప్‌ బిజినెస్‌ పాఠాలు, వ్యవసాయం, ఆహార ధాన్యాల ఉత్పత్తి వంటి అంశాల్లో ఆయన సలహాలు ఇవ్వనున్నారు. వ్యాపారం, నవీన ఆవిష్కరలపై విద్యార్థులను గైడ్ చేయనున్నారు. ఆరునెలల పాటు ఆయన అక్కడ పనిచేస్తారు. ఆ తర్వాత టోక్యో యూనివర్శిటీ దాన్ని వార్షిక ప్రాతిపదికన పునరుద్ధరించొచ్చు.

రోజుకు వేలకోట్లు సంపాదించిన జాక్‌మా ఇప్పుడు ఇలా విజిటింగ్ ప్రొఫెసర్‌గా చేయడం కాస్త విచిత్రమే. ఒకప్పుడు ఖాళీ అన్నది తెలియకుండా గడిపారు. ఆయన టైమ్‌ ప్రతి సెకన్‌ కొన్ని కోట్లతో సమానం. అలీబాబా గ్రూప్‌ను స్థాపించి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆయన చేసిన ఓ చిన్న కామెంట్‌ పెద్ద నష్టమే చేసింది. కలలుగని, కష్టపడి, నిద్రాహారాలు మాని నిర్మించిన వ్యాపార సామ్రాజ్యానికి జాక్‌మాను పరాయివాడిని చేసింది. చైనా నియంత్రణ వ్యవస్థలను ఆయన బహిరంగంగా తప్పుపట్టారు. అదే చైనా పాలకుల ఆగ్రహానికి కారణమైంది. యాంట్‌ గ్రూప్‌ 3వేల700కోట్ల డాలర్ల విలువైన ఐపీఓ రద్దైంది. ఆయన వ్యాపారాలపై దాడులు జరిగాయి. వేల కోట్ల జరిమానా కట్టాల్సి వచ్చింది. దీంతో జాక్‌మా సైలెంటయ్యారు. దేశాన్ని వీడారు. ఆయన అదృష్టం ఏంటంటే ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని అల్లకల్లోలం చేసి చైనా పాలకులు వదిలేశారు. ఏదో ఓ కేసు పెట్టి బొక్కలో తోయకపోవడం నిజంగా ఆయనకు ఓ వరమే.

పాలకుల ఆగ్రహంతో గత కొన్ని నెలలుగా ప్రపంచానికి దూరంగా గడుపుతున్న జాక్‌మా ఇటీవలే మళ్లీ చైనాలో అడుగుపెట్టారు. కమ్యూనిస్టు ప్రభుత్వం ఇటీవల తన దూకుడును తగ్గించింది. జాక్‌మాపై కాస్త కరుణ చూపింది. దీంతో ఆయన స్వదేశానికి వచ్చారు. తన వ్యాపార సామ్రాజ్యంలో మార్పులు చేర్పులు చేశారు. కంపెనీని ఆరు భాగాలుగా విభజించారు. అయితే కంపెనీ రోజువారీ వ్యవహారాల్లో ఆయనకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆయన కేవలం సలహాదారు మాత్రమే. ఈ జనవరిలోనే ఆయన యాంట్‌ గ్రూప్‌పై తన నియంత్రణను వదులుకున్నారు. తన వాటాను కూడా తగ్గించుకున్నారు. ఇవన్నీ చేసిన తర్వాతే చైనా ప్రభుత్వం ఆయన దేశంలోకి రావడానికి ఒప్పుకుంది. మళ్లీ దానికి తాము వ్యాపారస్తులపై కఠినంగా ఉండబోమంటూ కలరింగ్ ఇచ్చింది. ఒక్క మాట అన్నందుకు జాక్‌మా వ్యాపారం ఆయనది కాకుండా పోయింది.

చైనాలో అడుగుపెట్టినప్పటికీ ప్రభుత్వం తనను వదలదని జాక్‌మాకు బాగా తెలుసు. ప్రతిక్షణం తనపై నిఘా ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినా నిలదొక్కుకునే పరిస్థితులు లేవు. అడుగడుగునా ఆటంకాలు తప్పవు. అందుకే తన దగ్గర వేల కోట్లు ఉన్నా బిజినెస్‌ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు. ఖాళీ సమయం ఎక్కువగా ఉండటంతో ఆయన తనకు ఇష్టమైన టీచింగ్ ప్రొఫెషన్‌పై దృష్టిపెట్టారు. జాక్‌మా పరిస్థితి ఇప్పుడు తల్లకిందులై ఉండొచ్చు కానీ ఆయనో సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ మెన్… తక్కువ సమయంలో ఓ సామ్రాజ్యాన్నే నెలకొల్పారు. ఎవరూ ఊహించని ఎత్తులు వేయడం ఆయనకు అలవాటు. ఆయన వ్యాపార అనుభవం విద్యార్థులకు ఓ పాఠం. ఇప్పుడు ప్రొఫెసర్‌గా తనలా సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌మెన్‌ను ఆయన తయారు చేయాలని మనమూ కోరుకుందాం…!