America importing Russia Oil : అమ్మ నా అంబానీ..! రష్యా- అమెరికా మధ్యలో రిలయెన్స్..!!

  • Written By:
  • Updated On - February 10, 2023 / 06:05 PM IST

వ్యాపారం ఎలా చేయాలంటే అంబానీలనో, అదానీలనో చూసి నేర్చుకోవాలి. ఇసుక నుంచి కూడా నూనె తీసి ఎడారిలోనే అమ్మేయగలరు… అవకాశాలు రావు వాటిని మనం సృష్టించుకోవాలి అన్న వ్యాాపార సూత్రాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నరనరానా జీర్ణించుకున్నారు. తాజాగా యుక్రెయిన్-రష్యా యుద్ధాన్ని తమ ఆదాయ వనరుగా మార్చుకున్నారు ముకేశ్ అంబానీ. నిజానికి ఆ యుద్దానికి, రిలయన్స్ కు అసలు సంబంధం లేదు. కానీ అసలేం జరిగిందో తెలిస్తే అమ్మ అంబానీ అనుకోకుండా ఉండలేరు.

 

యుక్రెయిన్ పై రష్యా దండయాత్రకు దిగడంతో ప్రపంచదేశాలు పుతిన్ ను ఒంటరి చేయాలని భావించాయి. రష్యా ప్రధాన ఆదాయవనరు ముడిచమురు, గ్యాస్. వాటి కొనుగోలుపై నియంత్రణ కూడా విధించాయి. కానీ మనం మాత్రం రష్యా నుంచి స్వేచ్ఛగా ముడిచమురును కొనుగోలు చేస్తున్నాం. దీనికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. జనవరిలో ఎప్పుడూ లేనంతగా మనం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేశాం. సంప్రదాయ ముడిచమురు సరఫరా దేశాలను వెనక్కు నెట్టి రష్యా మనకు ప్రధాన సరఫరాదారుగా మారిపోయింది. బయట మార్కెట్ కంటే ఒక్కో బ్యారెల్ 30డాలర్ల కంటే తక్కువ ధరకే భారత్ కొనుగోలు చేస్తోంది. అయితే మన ప్రయోజనాల కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంలో ఎలాంటి సమస్యాలేదు. రష్యా నుంచి మనకు రోజుకు దాదాపు 13లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి అవుతోంది. మరి ఈ చమురంతా ఇక్కడే వినియోగిస్తున్నారా అంటే కచ్చితంగా కాదు.

 

మనం దిగుమతి చేసుకుంటున్న ముడిచమురులో కొంత భాగం రష్యా పేరెత్తితేనే మండిపడే అమెరికాకే వెళుతుంది. అంటే ఏదైతే జరగకూడదని అమెరికా పట్టుబట్టిందో అదే దాని కళ్లెదురుగానే జరుగుతోంది. అదే అంబానీ మాయాజాలమంటే…!

 

అమెరికా భారత్ నుంచి భారీగా వర్జిన్ ఆయిల్ గ్యాస్ ను దిగుమతి చేసుకుంటోంది. దాన్ని రిఫైన్ చేస్తే డీజిల్, గ్యాసోలిన్ వస్తాయి. రష్యాపై ఆంక్షల తర్వాత అమెరికా రిఫైనరీలు భారీగా ఈ వర్జిన్ గ్యాస్ ఆయిల్ ను రిలయన్స్ ఎనర్జీ, నయారా ఎనర్జీల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం భారత్ గతనెలలో న్యూయార్క్ కు రోజుకు 89వేల బ్యారెళ్ల గ్యాసోలైన్, డీజిల్ ను సరఫరా చేసింది. గత నాలుగేళ్లలో ఇదే అధికం… మరి ఈ స్థాయిలో ఆ సంస్థలు అమెరికన్ రిఫైనరీలకు ఎలా ముడిచమురును సరఫరా చేస్తున్నాయన్నది ఆసక్తిని రేపేదే.

 

రష్యా నుంచి రిలయన్స్ వంటి సంస్థలు కూడా ముడిచమురును కొంటున్నాయి. అందుకు సౌదీ రియాద్ లలో చెల్లింపులు చేస్తున్నాయి. ఆ ముడిచమురునే అమెరికన్ రిఫైనరీలకు సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. రష్యా నుంచి ఎవరూ ముడిచమురు కొనకూడదన్నది అమెరికా హెచ్చరిక. కానీ అదే అమెరికన్ రిఫైనరీలకు అదే రష్యా ఆయిల్ వయా భారత్ మీదుగా చేరుతోంది. ఇందుకు గాను ఆయా సంస్థలకు భారీగానే లాభాలు ముడుతున్నట్లు భావిస్తున్నారు. రష్యా నుంచి ముడిచమురు తీసుకురావడం కొంత రిఫైన్ చేసి దాన్ని అమెరికా రిఫైనరీలకు పంపేయడం ఓ లాభసాటి వ్యాపారంగా మారింది. ఇక్కడ ఇంకో అనుమానం కూడా ఉంది. రష్యా నుంచి వస్తున్న ముడిచమురు సముద్రంలోనే ఓ ఓడ నుంచి మరో ఓడలోకి మారి అమెరికా రూట్ పడుతుందా అన్న అనుమానాలు కూడా ఆ మధ్య వ్యక్తమయ్యాయి.

 

రష్యా, అమెరికాల మధ్య ఉన్న వైరం సంగతి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని దశాబ్దాల పాటు ప్రచ్చన్నయుద్ధం సాగింది. యూఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం తర్వాత అమెరికా పెదన్నగా మారింది. అయితే రష్యా బలం తగ్గిందేమో కానీ బలహీనం కాలేదు. ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధంతో రష్యాను ఒంటరి చేయాలని అమెరికా భావించింది. రష్యా ముడిచమురును ఎవరూ కొనుగోలు చేయకుండా చూస్తే పుతిన్ కాళ్ల బేరానికి వస్తారన్నది అమెరికా అంచనా. అయితే ఆ ఆంక్షలను భారత్ బేఖాతరు చేసింది. మా ప్రయోజనాలే ముఖ్యమని తేల్చేసింది. ఇది నచ్చకపోయినా అమెరికా సహా మిగిలిన దేశాలు ఏమీ చేయలేని పరిస్థితి. దీన్నే అంబానీ తనకు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. రష్యా ఆయిల్ ఏకంగా అమెరికాకు చేరుతోంది. ఒక్క రిలయన్స్ సంస్థే కాదు చాలా భారతీయ ఆయిల్ కంపెనీలు ఇలాగే రష్యా నుంచి క్రూడ్ కొంటున్నాయి. అవికూడా ఇలాగే బ్యాక్ డోర్ బిజినెస్ చేస్తున్నాయా అన్న అనుమానాలు లేకపోలేదు. తన ఆయిల్ అమెరికాకు చేరుతోందన్న విషయం రష్యాకు కూడా తెలిసే ఉండొచ్చు. కానీ దానికి కావాల్సింది బిజినెస్. అది ఎలా జరిగిందన్నది ఇప్పుడు పట్టించుకోవాల్సిన పనిలేదన్నది రష్యా ఆలోచనగా కనిపిస్తోంది.

 

ఈ వ్యవహారం అమెరికాకు తెలుసన్న అనుమానాలూ ఉన్నాయి. చీమ చిటుక్కుమంటే పసిగట్టే అగ్రరాజ్యాలకు ఈ విషయం తెలియదనుకుుంటే అది పొరపాటే,. అన్నీ తెలిసినా ప్రస్తుతానికి ఎవరూ కూడా భారతీయ కంపెనీల యూటర్న్ బిజినెస్ ను ప్రశ్నించడం లేదు. అయితే ఆయా దేశాలు ఎప్పుడో షడన్ గా మనదేశంపై ఆంక్షల కత్తి విదిలిస్తే ఏం జరుగుతుందన్నది పెద్ద ప్రశ్న… మరి ఆ అపాయం తలెత్తితే బయటపడటానికి అంబానీ ఏదో ఓ ఉపాయాన్ని సిద్ధం చేసుకోకుండా ఉంటాడంటారా…?

(KK)