America: అమెరికా దివాళా తీయడం ఖాయమా..? అదే జరిగితే మన రూపాయి సంగతేంటి ?

మీరు ఆర్థికంగా స్థితిమంతులే.! డబ్బుకు కొదవలేదు.! కాలు మీద కాలేసుకుని రాయల్‌గా బతుకున్నారు..! అవసరమైతే మీ స్నేహితులు, బంధువులను కూడా ఆర్థికంగా ఆదుకునే స్థాయిలో ఉన్నారు..! అయితే కాలం ఎప్పుడూ ఒకేరకంగా ఉండదుగా..! ఒక్కసారిగా మీ జీవితం తలకిందులయ్యింది..ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి..! అయినా మీరు కుంగిపోలేదు..మీ ఖర్చులు, కమిట్‌మెంట్స్ కోసం అప్పులు చేశారు.. అవి తీర్చుతామన్న ధీమాతో ఉన్నారు..కానీ రోజులు గడిచే కొద్దీ పరిస్థితి దినదినగండంగా మారింది.

  • Written By:
  • Publish Date - May 25, 2023 / 07:15 PM IST

ఒకానొక రోజు వచ్చింది.. కొత్తగా ఒక్కరూపాయి కూడా అప్పు పుట్టని స్థితి. అప్పుడేమంవుతుంది ? ఆర్థికంగా దివాళా తీసిన స్థితిలో మీరు ఏం చేస్తారు..? మీరు తేరుకునే వరకు మీతో పాటు మీ కుటుంబంపైనా ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. మీరు ఒక వ్యక్తి కాబట్టి ఆ సంక్షోభం..మీకో మీ కుటుంబానికో మాత్రమే పరిమితమైంది.. అదే ఒక దేశమైతే.. అప్పు పుట్టకుండా దారులు మూసుకుపోయి.. దివాళా తీసే పరిస్థితి వస్తే.. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా ఇలాంటి దుస్థితినే ఎదుర్కొంటోంది. డెట్ సీలింగ్ క్రైసిస్ నుంచి ఎలా బయటపడాలో అర్థంకాక.. అధ్యక్షుడు జో బైడెన్ తలపట్టుకున్నారు. మరికొన్ని రోజుల్లో ఈసమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టకపోతే.. అమెరికా దివాళా తీయడం ఒక్కటే కాదు.. ఆ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

తరుముకొస్తున్నజూన్ 1 డెడ్‌లైన్
జూన్ 1, 2023 అమెరికా ఆర్థిక వ్యవస్థను షేక్ చేసే రోజుగా చరిత్రలో నిలిచిపోబోతోంది. బైడెన్ ప్రభుత్వానికి అమెరికా కాంగ్రెస్ విధించిన డెట్ సీలింగ్‌కు అదే చివరి రోజు. ఆ లోపు అమెరికా ప్రతినిధుల సభకు..బైడెన్ సర్కార్ మధ్య డీల్ కుదరకపోతే.. అమెరికాతో పాటు ప్రపంచం సంక్షోభంలో పడినట్టే.. దేశం ఏదైనా ప్రభుత్వం సజావుగా నడవాలంటే..భారీ స్థాయిలో డబ్బులు కావాలి.. ప్రజలకు పథకాలు అందాలన్నా..బిల్లులు చెల్లించాలన్నా.. ఉద్యోగుల జీతాల నుంచి.. సైనికుల పెన్షన్ వరకు దేనికైనా నిధులుకావాల్సిందే..పన్నుల రూపంలో వచ్చే ఆదాయం సరిపోకపోతే ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. అమెరికా కూడా అలా ఎప్పటి నుంచో అప్పులు చేస్తూనే ఉంది. కాకపోతే ఒకస్థాయి దాటిన తర్వాత అప్పులు చేయడానికి అమెరికా రాజ్యాంగం ఒప్పుకోదు. అప్పుపైన పరిమితి విధించే అధికారాన్ని కాంగ్రెస్‌కు కట్టబెట్టింది. దాన్నే డెట్ సీలింగ్ అంటారు. అమెరికా దివాళా తీసే పరిస్థితులు గతంలో చాలా సందర్భాల్లో వచ్చినా..ఎప్పటికప్పుడు డెట్ సీలింగ్ పెంచుకోవడమో..ప్రతినిధుల సభ అనుమతితో రద్దు చేయడమో చేసేవారు. కానీ ఈసారి అలా జరగడం లేదు. అమెరికాలో డెట్ సీలింగ్ ఈసారి పొలిటికల్ ఫైట్ గా మారిపోయింది. ప్రతినిధుల సభ రిపబ్లికన్ పార్టీ కంట్రోల్‌లో ఉండటంతో.. బైడెన్ మాట చెల్లుబాటుకావడం లేదు.

రిపబ్లికన్లు ఎందుకు మొండికేస్తున్నారు ?
అమెరికాలో వచ్చే ఏడాదే అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. మరోసారి పోటీకి బైడెన్, ట్రంప్ సై అంటే సై అంటున్నారు. గత ఎన్నికల్లో బైడెన్‌ గెలుపును తన ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడని ట్రంప్..మరోసారి వైట్‌హౌస్‌ రేసులో నిలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇలాంటి సమయంలో బైడన్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు రిపబ్లికన్లకు డెట్ సీలింగ్ ఒక రాజకీయ అస్త్రంగా దొరికింది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం తీసుకునే అప్పు పరిమితి 34.1 ట్రిలియన్ డాలర్లు ఉంది. ఈ పరిమితిని బైడెన్ సర్కార్ ఎప్పుడో దాటేసింది. జూన్ 1 దాటితో ఒక్క డాలర్ కూడా అప్పు చేయడానికి వీలు ఉండదు. అయితే రిపబ్లికన్లు ఒక ప్రతిపాదన తీసుకువచ్చారు. ఇప్పుడున్న పరిమితిని మరో 1.5 ట్రిలియన్ డాలర్లకు పెంచేందుకు అంగీకరించారు. అయితే తాము పెట్టే షరతులకు అంగీకరించాలంటూ కొర్రీలు పెట్టారు. బైడెన్ ప్రభుత్వం తక్షణ బడ్జెట్‌ను నియంత్రించి..ఖర్చులకు కోత విధిస్తేనే తాము డెట్ సీలింగ్‌ పరిధి పెంచుతామని తెగేసి చెప్పారు. అలా చేయడం బైడెన్‌ రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనుండా… పథకాల్లో కోత విధిస్తే మరోసారి ఆయన శ్వేతసౌధం వైపు చూసే అవకాశం ఉండదు. అందుకే బైడన్ సరేమిరా అంటున్నారు. రిపబ్లికన్లు కూడా ఎదురుదాడి మొదలుపెట్టారు. ఒకవేళ అమెరికా దివాళా తీసే పరిస్థితి వస్తే దానికి తాము బాధ్యత వహించబోమని చెబుతున్నారు. దీంతో బైడెన్ పరిస్థితి ముందు నుయ్యి…వెనుక గొయ్యి అన్నట్టు తయారైంది.

America Bankrupt

అమెరికా దివాళా తీస్తే ఏమవుతుంది ?
వ్యక్తులు, సంస్థలు దీవాళా తీస్తేనే ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక ఒక దేశమే దివాళా తీస్తే ఆర్థిక వ్యవస్థ మూలాలు కదిలిపోతాయి. డెట్ సీలింగ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే.. జూన్ 1 తర్వాత ఆమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 1.5 మిలియన్ ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోతాయని మూడీస్ సంస్థ అంచనా వేసింది. మార్కెట్లు కుప్పకూలడం..అమరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లిపోవడం వెంటనే జరిగిపోయాయి. అమెరికా ప్రభుత్వంతో పాటు ప్రజలకు ఆర్థిక కష్టాలతో ఉక్కిరిబిక్కిరిపోతారు. అప్పటికీ పరిస్థితి అదుపు చేయలేకపోతే..ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించి దాదాపు 70 లక్షల మంది అమెరికన్లు నిరుద్యోగులుగా మారి రోడ్డున పడతారు. వడ్డీ రేట్లు విపరీతంగా పెరిగిపోయి జనం రోజు గడవడమే కష్టంగా మారుతుంది. అమెరికా దివాళా తీస్తే నిరుద్యోగ సమస్య పాలకులను వెంటాడుతుంది. నిరుద్యోగ రేటు ప్రస్తుతమున్న 3.4 శాతం నుంచి 8 శాతానికి పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలి, నిరుద్యోగం పెరిగిపోయి.. దాదాపు 10 ట్రిలియన్ డాలర్ల అమెరికన్ ప్రజల సంపద తుడిచిపెట్టుకుపోతుంది.

అమెరికా దెబ్బకు ప్రపంచం కూడా మునుగుతుందా ?
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటైన అమెరికా దివాళా తీస్తే.. ప్రపంచంలో ప్రభావితం కాని దేశం అంటూ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు.. రిజర్వ్ కరెన్సీగా 52 శాతానికి పైగా అమెరికా డాలర్లనే పెట్టుకున్నాయి. డీ డాలరైజేషన్‌ వైపుగా కొన్ని దేశాలు అడుగులు వేసినా.. ఇప్పటికీ మెజార్టీ వాణిజ్యం అమెరికా డాలర్ కేంద్రంగానే జరుగుతుంది. మన దేశం పైనా ఆ ప్రభావం నేరుగా పడుతుంది. డాలర్‌తో రూపాయి మారక విలువ కీలకంగా మారుతుంది. రూపాయి పతనమైతే.. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతర్జాతీయంగా ఎలాంటి వాణిజ్యం చేయాలన్నా భారత్ అమెరికా డాలర్లనే ఉపయోగిస్తుంది. సంక్షోభం కారణంగా అమెరికా డాలర్ ఖరుదుగా మారితే.. భారత్ పై దిగుమతుల ఖర్చు కూడా పెరుగుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ పరిస్థితులు తీవ్రమైన ద్రవ్యోల్బణానికి దారితీస్తాయి. అమెరికా దివాళా తీస్తే ఆ దేశంతో పాటు ప్రపంచంపై ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ముందే ఊహించి చెప్పడం కూడా సాహసమే అవుతుంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పతనం ప్రారంభమైనవెంటనే.. అన్ని దేశాలను ఒక్కొక్కటిగా సమస్యలు చుట్టుముడతాయి.

రన్నింగ్ అవుట్ ఆఫ్ మనీ
నెలాఖరులో పర్సులో డబ్బులు లేకపోతే ఉద్యోగస్తుల నుంచి అందరూ గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అమెరికా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఓవైపు డెడ్‌లైన్ ముంచుకొస్తోంది. మరోవైపు..రాజకీయ కారణాలతో రిపబ్లికన్లు డెట్ సీలింగ్ పై ఎటూ తేల్చడం లేదు. దీంతో గడ్డుకాలాన్ని ఎలా ఎదుర్కోవాలా అన్నది బైడెన్‌కు అంతుపట్టకుండా ఉంది. ఇలాంటి అత్యవసర పరిస్థితి నుంచి అమెరికా ఎలా బయపడుతుంది అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.