Miyazaki Mango: మామిడి పండ్లు కిలో ధర సాధారణంగా రూ.100 లోపే ఉంటుంది. అరుదైన రకాలు కూడా వందల్లోనే ఉండొచ్చు. కొన్ని వేలల్లో ధర పలకొచ్చు. కానీ, మియాజాకీ అనే రకం మామిడి పండ్లు కిలో ధర రూ.2.70 లక్షల వరకు ఉంటోంది. ఇంత ధర ఎందుకంటే ఇవి చాలా అరుదైనవి. జపాన్‌లో మాత్రమే చాలా తక్కువగా పండుతాయి. అలాంటి అరుదైన మియాజాకీ పండ్లను ఇప్పుడు ఇండియాలో.. అదీ ఏపీలో పండిస్తున్నాడో రైతు. ఇతరులకు భిన్నంగా ఆలోచించి, మంచి లాభాలు అర్జిస్తున్నాడు.
ఏపీలోని కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామానికి చెందిన రైతు ఓదూరు నాగేశ్వర రావు. ఆయన అందరిలా కాకుండా వినూత్నంగా వ్యవసాయం చేయాలనుకున్నాడు. తనకున్న నాలుగు ఎకరాల్లో సాధారణ రకాలు కాకుండా.. అరుదైన ఎన్నో రకాల మామిడి చెట్లను పెంచాడు. వీటిలో అరుదైన మియాజాకీ మామిడి, నూర్జహాన్ మామిడి వంటి రకాలున్నాయి. అలాగే ఇక్కడి మామిడి కాయలు విభిన్నమైన రంగుల్లో, ఆకారాల్లో కనిపిస్తాయి. కొన్ని మామిడి పండ్లు యాపిల్స్‌లాగా, అరటి పండ్లలాగా కూడా ఉంటాయి. అరుదైనవి కావడంతో వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
మియాజాకీ.. కేజీ రూ.2.70 లక్షలు
జపాన్‌లో మాత్రమే పండే అరుదైన రకం మియాజాకీ. ప్రపంచంలోనే అతి ఖరీదైన మామిడి పండ్లలో ఇదీ ఒకటి. దీన్ని ఎగ్స్ ఆఫ్ సన్ అని కూడా పిలుస్తారు. జపాన్‌లోని మియాజాకీ అనే ప్రాంతంలో మాత్రమే పండుతాయి. కాబట్టి, వీటికి ఈ పేరొచ్చింది. ఇవి మన దేశంలో పండటం చాలా అరుదు. అలాంటిది నాగేశ్వర రావు తన తోటలో వీటిని పండిస్తున్నాడు. నాలుగైదేళ్లక్రితం ఈ మొక్కల్ని తెచ్చి పెంచాడు. 20 మొక్కలు నాటితే, గత ఏడాది వాటిలో ఒక్క మొక్కకు ఒకే కాయ కాసింది. అయితే, ఈ ఏడాది ఏకంగా 15 మామిడి కాయలు కాసాయి. ఈ మామిడి పండ్లు ఒక్కోటి 380-450 గ్రాముల వరకు బరువు కలిగి ఉన్నాయి. మొత్తం మామిడి కాయలు కలిసి సుమారు 6 కిలోల బరువున్నాయి. ఇక మియాజాకీ మామిడి ఒక్కో కేజీ ధర అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.2.70 లక్షల వరకు ఉంటుంది. ఇప్పుడు కాసిన మామిడి కాయలన్నింటి ధర సుమారు రూ.15 లక్షల వరకు ఉంటుందని రైతు చెప్పాడు. సగటున ఒక్కో కాయ రూ.లక్ష వరకు ఉంటుంది. ఇవి మంచి వాసనతో ఉంటాయి. పండు లోపల బంగారు రంగులో మెరిసిపోతుంటాయి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లను క్యాన్సర్‌కు మందుగా, కొవ్వు తగ్గించే ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. అందువల్లే మియాజాకీ మామిడి పండ్లకు అంత విలువ ఉంటుంది. కాగా, ఈ పండ్లు ఇండియాలో పెరగడం చాలా అరుదని, అలాంటిది నాగేశ్వర రావు తోటలో ఒకేసారి 15 కాయలు కాయడం గొప్ప విశేషమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇతర రైతులతో కూడా ఈ పండ్ల మొక్కలు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
నూర్జహాన్ రకం
నాగేశ్వర రావు తోటలో అరుదైన నూర్జహాన్ రకం మామిడి పండ్లు కూడా పండుతున్నాయి. ఈ మామిడి కాయ ఒక్కోటి సుమారు ఐదు కేజీల వరకు బరువు పెరుగుతుంది. ప్రస్తుతం ఒక చెట్టుకు రెండు కాయలు మాత్రమే కాసాయి. ఒక్కో కాయ ఖరీదు రూ.వెయ్యికి పైగానే ఉంటుంది. వీటి పొడవు సుమారు ఒక అడుగు ఉంటుంది. ప్రపంచంలోని పెద్ద మామిడికాయల్లో ఇదీ ఒకటి. దీన్ని అఫ్గానిస్తాన్ నూర్జహాన్ రకం మామిడి లేదా సుమో మామిడి అని కూడా ఉంటారు.