Bank Holidays: బ్యాంకులకు సెలవులుంటే ఎందరికో ఇబ్బంది. అనేక ఆర్థిక లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యవహారాలు అన్నీ బ్యాంకులతోనే ముడిపడి ఉంటాయి. అందుకే బ్యాంకులు ఏ రోజుల్లో పని చేస్తాయి.. ఏ రోజు సెలవు.. అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక.. వచ్చే అక్టోబర్‌కు సంబంధించి బ్యాంకు సెలవు రోజుల జాబితా విడుదలైంది. వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు సెలవులు ఉన్నప్పటికీ.. మొత్తంగా సెప్టెంబర్‌లో 16 రోజులు సెలవులు వచ్చాయి. ఇక అక్టోబర్‌లో కూడా 16 రోజులపాటు సెలవులు ఉండే అవకాశం ఉంది.
ముఖ్యంగా నెల చివర్లో ఎక్కువ రోజులు సెలవులున్నాయి. అయితే, ఈ హాలీడేస్ లిస్టులో శని, ఆదివారాలు కూడా ఉన్నాయి. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగానే బ్యాంకులకు సెలవులు ఉంటాయనే సంగతి తెలిసిందే. బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీస్, ఏటీఎం సేవలు పనిచేస్తాయనే సంగతి తెలిసిందే. కాబట్టి, ఇలాంటి సేవల కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని సేవల కోసం మాత్రం బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. అందుకే, బ్యాంకు సెలవుల గురించి ముందుగానే సమాచారం తెలుసుకొని పని దినాల్లో వెళితే ఇబ్బందులు ఉండవు.
ఆర్బీఐ రిలీజ్ చేసిన బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ఇదే
అక్టోబర్ 1 ఆదివారమైతే.. అక్టోబర్ 2, సోమవారం గాంధీ జయంతి సందర్భంగా సెలవు. అక్టోబర్ 14 రెండో శనివారం, 15 ఆదివారం సెలవులు. అక్టోబర్ 18, బుధవారం కాతి బిహు (అసోంలో మాత్రమే) సెలవు. అక్టోబర్ 19, గురువారం సంవత్సరి పండుగ (గుజరాత్‌లో మాత్రమే) సెలవు. అక్టోబర్ 21, శనివారం, దుర్గా పూజ, అక్టోబర్ 22, ఆదివారం, అక్టోబర్ 23, సోమవారం మహా నవమి, అక్టోబర్ 24, మంగళవారం విజయ దశమి, అక్టోబర్ 25 బుధవారం, దుర్గా పూజ (దసై), అక్టోబర్ 26, గురువారం, యాక్సెషన్ డే (జమ్ము కాశ్మీర్‌లో మాత్రమే సెలవు), అక్టోబర్ 27 శుక్రవారం, దసై, దుర్గా పూజ, అక్టోబర్ 28, నాలుగో శనివారం, లక్ష్మీ పూజ, అక్టోబర్ 29, ఆదివారం, అక్టోబర్ 31, మంగళవారం, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సెలవు.