హిండెన్‌బర్గ్ మరో నివేదిక బయటపెట్టనుంది. దీంతో ఈసారి మూడింది ఎవరికి అనే డిస్కషన్ నడుస్తోంది. అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతోందని.. అకౌంటింగ్ ఫ్రాడ్, మనీ లాండరింగ్, కృత్రిమంగా షేర్ల ధరలు పెంచడం చేసిందంటూ రెండేళ్లపాటు అధ్యయనం చేసి జనవరిలో హిండెన్‌బర్గ్ ఓ రిపోర్టు రిలీజ్ చేసింది. అది ప్రపంచాన్ని కుదిపేసింది. మన దగ్గర అయితే చిన్నపాటి కలకలం రేపింది. రాజకీయంగానూ మంటలు క్రియేట్ చేసింది.
ఆ రిపోర్ట్ ప్రభావంతో అప్పటివరకూ ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న అదానీ.. ఢమాల్‌న పడిపోయారు. ఓ దశలో 29వ స్థానానికి చేరుకున్నారు. ఇప్పుడు తిరిగి 24వ స్థానంలో నిలిచారు. కొద్దిరోజుల వ్యవధిలోనే 120 బిలియన్ డాలర్ల అదానీ సంపద ఆవిరైపోయింది. సెప్టెంబర్ 2022లో 150 బిలియన్ డాలర్లున్న అదానీ సంపద 53 బిలియన్ డాలర్లకు చేరింది. అలాంటి హిండెన్‌బర్గ్ సంస్థ మరో బాంబు పేల్చేందుకు సిద్ధమైంది. త్వరలో మరో పెద్ద సంస్థను లక్ష్యంగా చేసుకుని నివేదిక విడుదల చేస్తున్నట్టు హిండెన్‌బర్గ్ సంస్థ ట్వీట్ చేసింది. ఇది ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇది ఏ కంపెనీ అనేది వెల్లడించకపోవడంతో అందరిలో ఆందోళన పెరుగుతోంది. యూఎస్‌లోని బ్యాంకుకు సంబంధించినదా లేదా మరో ఇండియన్ కంపెనీనా అనేది ఆసక్తి ఎక్కువైంది.