అమెరికా ఫెడ్ నిర్ణయాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తాయన్నది అందరికీ తెలిసిందే. అక్కడ జలుబు చేస్తే ఇక్కడ ముక్కు కారుతుంది. అక్కడ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడంతో మన దగ్గర కూడా వడ్డీరేట్లు పెరిగాయి. ద్రవ్యోల్బణ కట్టడి చర్యల్లో భాగంగా ఫెడ్ రిజర్వ్ మరోసారి వడ్డీరేట్లు 25బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీరేట్లు 5నుంచి 5.25శాతానికి చేరాయి. వడ్డీరేట్లు 16 ఏళ్ల గరిష్టస్థాయికి చేరుకున్నాయి. గత 14 నెలల్లో ఫెడ్ వడ్డీరేట్లు పదిసార్లు పెంచింది. అయితే రేట్ల పెంపు ఇది చివరిది కావొచ్చని సంకేతాలు ఇచ్చింది ఫెడ్. ద్రవ్యోల్బణాన్ని 2శాతానికి తీసుకొచ్చేందుకు ఫెడ్ వడ్డీరేట్లనే మార్గంగా ఎంచుకుంది. దాని చర్యలు కొంతమేర ఫలించాయి. అయితే రేట్ల పెంపు కారణంగా కీలక వ్యాపారాలపై పడుతున్న ప్రభావాన్ని కూడా ఫెడ్ పరిశీలించింది. ఇక్కడితో బ్రేక్ వేయకపోతే మొదటికే వస్తుందన్న ఆలోచనలో ఫెడ్ ఉంది.
జూన్‌లో జరిగే సమీక్షలో రేట్ల పెంపు ఉండకపోవచ్చని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలు ఇచ్చారు. 2006లో వడ్డీరేట్ల సైకిల్‌కు బ్రేక్ వేసే సమయంలో వాడిన పదజాలాన్నే పావెల్ వాడారు. దీంతో అప్పటిలాగానే వడ్డీ సైకిల్ ముగిసినట్లేనని అమెరికా వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఈ ఏడాదిలోనే వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చని జరుగుతున్న ప్రచారంపైనా పావెల్ స్పందించారు. ఇప్పట్లో అది జరగకపోవచ్చన్నారు. అంటే రేట్లు పెరగవు.. ఇప్పట్లో తగ్గవు.
ఫెడ్ వడ్డీరేట్ల మార్గాన్నే మర ఆర్‌బీఐ కూడా అనుసరిస్తూ వస్తోంది. కరోనా సమయంలో భారీగా గృహరుణ రేట్లు తగ్గడంతో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా సొంతగూడు ఏర్పరుచుకునేందుకు ప్రయత్నించారు. భారీగా గృహరుణాలు పెరిగాయి. అయితే గత ఏడాది కాలంగా భారీగా వడ్డీరేట్లు పెంచుతూ వచ్చారు. దీంతో ఒక్క6-7శాతం మధ్య ఉన్న గృహరుణ వడ్డీరేట్లు ఇప్పుడు దాదాపు 10శాతానికి చేరాయి. కనీసం నాలుగైదు వేల రూపాయల మేర వడ్డీభారం పెరిగింది. ఇలాగే పెంచుకుంటూ పోతే రియాల్టీ రంగంపైనే కాకుండా ఆర్థిక వ్యవస్థపైనా ఒత్తిడి పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమైంది.
దీంతో ఆర్‌బీఐ కూడా దూకుడు తగ్గించింది. ఇప్పుడు ఫెడ్ కూడా వడ్డీరేట్ల పెంపునకు బ్రేక్ వేయడంతో మన రిజర్వ్ బ్యాంక్ కూడా అదే మార్గాన్ని అనుసరించే అవకాశం ఉంది. అంటే ఇకపై దాదాపు వడ్డీరేట్ల పెంపు ఉండకపోవచ్చు. ద్రవ్యోల్బణం అనుకున్నట్లుగా తగ్గితే వడ్డీరేట్లను తగ్గించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అయితే ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంటే మాత్రం మరోసారి వడ్డీరేట్లు పెంచే అవకాశాలు లేకపోలేదు. ఆర్‌బీఐ వచ్చే సమీక్ష తర్వాత మన దగ్గర వడ్డీరేట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పెంపు జోలికి వెళ్లదా లేక మరోసారి వడ్డీరేట్లు పెంచి వడ్డీ సైకిల్‌కు బ్రేక్ వేస్తుందా అన్నది చూడాల్సి ఉంది.