Electric Vehicles: కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాల పై సంచలన నిర్ణయం.. సబ్సిడీలో కోత కంపెనీల పాలిట ఊచకోతేనా..?

పెట్రోలు ధరలు రోజు రోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ఈ తరుణంలో ప్రతి ఒక్కరికీ ప్రత్యమ్నాయంగా నిలిచింది ఎలక్ట్రిక్ స్కూటర్లు. ఇవి సామాన్యునికి కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. ఇప్పుడు ఆ ఉపశమనం పై గదిబండ పడేలా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అదే ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని తగ్గించడం. దీని కారణంగా సామాన్యుడి మీద కంటే కూడా అధికంగా భారం కంపెనీల మీద పడుతుంది. అదేలాగో ఇప్పుడు చూడండి.

  • Written By:
  • Publish Date - May 24, 2023 / 06:00 PM IST

సాధారణ మానవుడు ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకొని పెట్రోల్ పై నెలకు వెచ్చించే ఖర్చును ఈఎంఐ రూపంలో చెల్లించుకుంటాడు. ఇలా చేస్తే అతనికి మూడు సంవత్సరాల్లోపు బండి సొంతం అవుతుంది. పైగా ఇంధనానికి వేలకు వేలు ఖర్చు పెట్టే అవసరం లేకుండా తక్కువ కరెంట్ ఛార్జ్ తో తన పనిని సులభతరం చేసుకుంటాడు. అందుకే ప్రతి పది మందిలో నలుగురు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు. పైగా రూ. లక్షలోపూ మంచి మైలేజ్ ఇచ్చే బండ్లు మార్కెట్లో అందుబాటులో ఉండటంతో అటువైపుగా అడుగులు వేస్తున్నారు.

మన దేశంలోని ప్రజలకు ఏదైనా అలవాటు చేయాలంటే కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే అమెరికా లాంటి అధునాతన సాంకేతికత లో నుంచి మనవాళ్లు రాలేదు. వ్యవసాయ సమాజం నుంచి వచ్చారు. ఇలా తమ జీవనాన్ని సాగిస్తున్న క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొత్తగా మార్కెట్ లో వచ్చినప్పుడు వాటిపై కొంతో గొప్పో అవగాహన ఉన్న వాళ్లు త్వరగా వెళ్లి ఆ వాహనాలు కొనుగోలు చేస్తారు. దీనివల్ల ప్రతి ఫలాన్ని ఇంకా త్వరగా పొందుతారు. కానీ చాలా వరకూ ప్రయోగం చేసి కొనేందుకు ముందుకు రారు. అలాంటి వారికి ప్రేరణ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం వన్ కిలో వాట్ బ్యాటరీ పవర్ కి 15వేల రూపాయలు సబ్జిడీని అందించింది.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే సాధారణంగా ఎలాంటి ఎలక్ట్రిక్ వాహనం అయినా మూడు కిలో వాట్ పవర్ తో ప్రారంభం అవుతుంది. దీని ప్రకారం షోరూం ధరల్లో ప్రతి కిలో వాట్ పర్ హవర్ కి 15 వేలు ప్రకారం.. మూడు కిలో వాట్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన బేసిక్ వాహనాన్ని కొనాలంటే దాదాపు 45 వేల వరకూ ప్రభుత్వ సబ్సిడీ లభిస్తుంది. అంటే లక్షల్లో ఉండే వాహనం వేల రూపాయల్లోనే అందుబాటులోకి వస్తుంది. దీంతో సామాన్యుడు కొనేందుకు ముందుకు వస్తాడు. పైగా గతంలో చాల మంది అవగాహనాపరులు కొనుగోలు చేసి నడుపుతూ ఉంటారు కనుక వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని కొనేందుకు సాహసిస్తాడు. పైగా ప్రస్తుతం డిజిటలైజేషన్లో భాగంగా రీవ్యూలు, రేటింగ్ పేరిట యూట్యూబ్ ఛానల్స్ కొన్ని వీడియోలు చేసి బండి ఫీచర్స్, పర్ఫామెన్స్ ను చూపిస్తున్నారు. దీంతో ప్రజలకు ఎలక్ట్రిక్ కాస్త ఆలస్యంగా చేరువైనప్పటికీ కొనుగోలులో ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంది.

ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వంలోని భారీ పరిశ్రమల శాఖ ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని 40శాతం నుంచి 15 శాతంనికి తగ్గిస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. అంటే ఏకంగా 25శాతం సబ్సిడీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది ఈ ఏడాని జూన్ 1 నుంచి అమలు కానున్నట్లు ప్రకటించింది. 15 వేల రూపాలయలు ఇచ్చే చోట కేవలం 10వేలు మాత్రమే ఇచ్చేలా ప్రణాళికలు రచించింది. దీంతో కొనుగోలుదారులకంటే కూడా ఉత్పత్తిదారులపై దీని ప్రభావం తీవ్రంగా పడబోతుంది. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలపై దీనిప్రభావం తీవ్ర స్థాయిలో చూపించే ఆస్కారం ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల కంపెనీ వారు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు.

40శాతం సబ్సిడీ ఇచ్చి, మంచి రివ్యూ, రేటింగ్ ఉండే బ్రాండెడ్ బండ్లను కొనేందుకు అంతంత మాత్రం ఉత్సాహం చూపిస్తున్న వినియోగదారునికి ఈ నిర్ణయం తీవ్ర నిరాశ గురిచేస్తుంది. దీని కారణంగా తాజాగా కొనాలన్న ఆసక్తి చూపిన కస్టమర్లు వెనుదిరిగే అవకాశం ‎ఉంది. కస్టమర్లు వెనకడుగు వేస్తే ఉత్పత్తి చేసిన వాహనాలన్నీ అమ్మకాలు జరగక సదరు కంపెనీలన్నీ కుదేలవ్వాల్సిన పరిస్థితి భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే మొత్తం పరిశ్రమ తిరిగి కోలుకోవడానికి చాలా సంవత్సరాల సమయం పడుతుంది. ఇదిలా ఉంటే దీని ప్రభావం ఎలక్ట్రిక్ వాహనాల మీదే కాకుండా ఆటోమొబైల్స్ పై కూడా చూపించే అవకాశం ఉంటుంది. ఇక ఒకదానికొకటి చైన్ లింక్ లాగా మారి దేశ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర దుష్ప్రభావాన్ని చూపే పరిస్థితి లేకపోలేదు.

అలాగే మరోసారి ఎవరైనా కంపెనీలు పెట్టాలంటే కూడా వణుకు పుట్టేలా చేస్తున్నాయి ఇలాంటి నిర్ణయాలు. ప్రస్తుతం ఉన్న స్టార్టప్స్ కి ఈ నిర్ణయం కొరకని కొయ్యగా మారింది. ఇంకా ఒక్క వాహనం కూడా అమ్మలేదు. వాటి రేటింగ్, రివ్యూలు ప్రజల్లోకి వెళ్లలేదు. ఇలాంటి సమయంలో కేంద్ర సబ్సిడీ పై తీసుకున్న నిర్ణయాన్న ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇకనైనా కేంద్ర పునరాలోచించి సబ్సిడీ కొనసాగిస్తుందా.. లేకపోతే తన పంతాన్ని నిలుపుకోవడం కోసం సబ్సిడీ పై కోత విధిస్తుందా వేచి చూడాలి.

 

T.V.SRIKAR,