Small Savings Schemes: వివిధ చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమలవుతుంది. వచ్చే జూన్ వరకు పెరిగిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి. 70 బేసిస్ పాయింట్లు పెంచడం వల్ల స్మాల్ సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లు 0.1 శాతం నుంచి 0.7 శాతం వరకు పెరగనున్నాయి.
పీపీఎఫ్ ఖాతా, సేవింగ్స్ డిపాజట్ ఖాతా మినహా మిగిలిన చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఈ నిర్ణయం వల్ల సీనియర్ సిటిజన్లకు ఎక్కువగా మేలు జరుగుతుంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన, మంథ్లీ ఇన్ కం సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, కిసాన్ వికాస్ పాత్ర, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్స్ వంటి పథకాలపై పెరిగిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఈ సమయంలో పీపీఎఫ్ ఖాతాలపై మాత్రం 7.1 శాతం వడ్డీ మాత్రమే వర్తిస్తుంది.
కేంద్ర నిర్ణయం వల్ల గతంలో సీనియర్ సిటిజన్లకు 8.0 శాతం వడ్డీ వర్తిస్తుండగా, తాజాగా 8.2 శాతం వడ్డీ వర్తిస్తుంది. కిసాన్ వికాస్ పాత్ర పథకంపై వడ్డీ 7.2 నుంచి 7.5 శాతానికి, సుకన్య సమృద్ధి యోజన పథకంపై వడ్డీ 7.6 శాతం నుంచి 8.0 శాతానికి పెరుగుతుంది. ఇతర సేవింగ్స్ ఖాతాలపై కూడా పెరిగిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి.