PM MODI: చైనా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మరో ఝలక్ ఇవ్వబోతోంది. తక్కువ ధరకే మార్కెట్లను ముంచెత్తుతున్న చైనా వస్తువులపై భారీగా పన్నులు వేయబోతోంది. ముఖ్యంగా దేశీయ స్టీల్ ఇండస్ట్రీకి ఈ నిర్ణయంతో ఊరట దక్కబోతోంది. చైనా వస్తువులు మన మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. నాణ్యత తక్కువగా ఉన్నప్పటికీ ధర తక్కువగా ఉండటంతో ఈ వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఇవి దేశీయ తయారీదారులను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే చైనా వస్తువులను కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకున్న కేంద్రం.. త్వరలో మరిన్ని కఠిన నిర్ణయాలకు రెడీ అవుతోంది.
మన మార్కెట్లపై బతుకుతూ మననే దొంగ దెబ్బ తీస్తున్న చైనా తోక మరింతగా కత్తిరించబోతోంది. ఈ వారంలోనే హైలెవల్ ఇంటర్ మిసిస్టీరియల్ మీటింగ్ జరగబోతోంది. చైనా వస్తువులపై యాంటీ డంపింగ్ డ్యూటీ వేయడంతో పాటు చైనాతో వాణిజ్య లోటుపై ఇందులో చర్చించనున్నారు. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఓ రకంగా విదేశీ ఎగుమతులపై ప్రభుత్వం విధించే రక్షణాత్మక సుంకం అన్నమాట. దేశీయ తయారీదారులను కాపాడటానికి ఇలాంటి పన్నులు వేస్తారు. కేంద్రం త్వరలో విధించబోయే యాంటీ డంపింగ్ డ్యూటీతో దేశీయ స్టీల్ సెక్టార్‌కు మంచి రోజులు రాబోతున్నట్లు చెబుతున్నారు. చైనా స్టీల్ ఉత్పత్తులపై యాంటి డంపింగ్ డ్యూటీ విధించాలని ఇటీవలే ఉక్కుశాఖ కేంద్రాన్ని కోరింది. దేశీయ ఉత్పత్తిని దెబ్బతీసి, తక్కువ స్థాయి ఉత్పత్తికి కారణమవుతున్న చైనా స్టీల్‌పై పన్నులు వేయకపోతే దేశీయ కంపెనీలు నిలదొక్కుకోవడం కష్టం కావడంతో ఈ సూచన చేసింది. తక్కువ ధరకు వస్తున్న చైనా స్టీల్ కారణంగా దేశీయ ఉత్పత్తి సంస్థలు తమ సామర్ధ్యాన్ని తగ్గించేసిన విషయాన్ని గుర్తు చేస్తోంది. అలాగే ట్రేడ్ రెమెడీస్ డైరెక్టర్ జనరల్ కూడా చైనా స్టీల్ వీల్స్‌పై ఉన్న యాంటీ డంపింగ్ డ్యూటీని ఐదేళ్లు పొడిగించాలని కేంద్రాన్ని కోరింది. అలాగే తక్కువ ధరకు విక్రయిస్తున్న చైనా ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్‌పై కూడా యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలని విజ్ఞప్తి చేసింది. సోలార్ ప్యానెళ్లపై ఉపయోగించే అల్యూమినియం ఫ్రేమ్స్‌తో పాటు ఎలక్ట్రోలైటిక్ టిన్ ప్లేట్స్, వినైల్, అనిలైన్, ఐసోబుటిలెన్-ఐసోప్రోపేన్ రబ్బర్.. ఇలా పలు వస్తువులపై యాంటీ డంపింగ్ విచారణ నడుస్తోంది. చైనాతో ఇటీవల మన వాణిజ్య లోటు పెరుగుతోంది.
2022 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు 72.9 బిలియన్ డాలర్లుగా ఉంటే గత ఆర్థిక సంవత్సరంలో అది 77.6 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే 4.7బిలియన్ డాలర్ల మేర వాణిజ్యలోటు పెరిగింది. చైనాకు మన ఎగుమతులు దాదాపు 28శాతం తగ్గాయి. గాల్వాన్ ఘర్షణ తర్వాత చైనా-భారత్ మధ్య దూరం పెరిగింది. సరిహద్దు వివాదం చల్లారడం లేదు. అప్పట్నుంచి చైనాతో వాణిజ్యం తగ్గించుకోవాలని భారత్ ప్రయత్నిస్తోంది. అయితే కొన్ని కీలక ముడిపదార్ధాల కోసం చైనాపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. కానీ మన దగ్గర దొరికే వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకోవడం మాత్రం తగ్గిస్తోంది. అందులో భాగంగానే యాంటీ డంపింగ్ డ్యూటీ విధిస్తోంది.