Chicken Price: టమాట ధరలు మంటలు రేపుతున్న వేళ.. కాస్తలో కాస్త రిలీఫ్ అయ్యే న్యూస్ ఇది. తెలుగు రాష్ట్రాల్లో టమాట మంటలకు ముందే కోడి కొండెక్కి కూర్చున్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఆ కోడి కాస్త కరుణించింది. చికెన్ ధరలు దిగివస్తున్నాయి. ఓ దశలో రూ.400 మార్క్‌కు దగ్గరగా కనిపించిన చికెన్ ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి.
టెంపరేచర్ తగ్గడం, వర్షాకాలం ప్రారంభం కావడంతో పెరిగిన చికెన్ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. డిమాండ్ కూడా ఒక్కసారిగా పడిపోవడంతో గత ఐదు రోజుల్లో చికెన్ ధర 15 శాతం వరకు పడిపోయింది. ఈ ఏడాది మేలో చికెన్ ధరలు ఆల్ టైమ్ హై మార్క్‌కి చేరుకున్నాయ్. కిలో ధర రూ.350కి పైగా పలికింది. దాదాపు రెండు నెలల పాటు ధరలు అలానే కొనసాగాయి. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా అధికంగా కోళ్ల మరణాలు సరఫరాపై ప్రభావం చూపాయి. ఇది ధరల పెరుగుదలకు దారితీసింది. జూన్ మూడో వారం నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో కోళ్ల ఉత్పత్తి పెరిగింది. దీంతో మార్కెట్‌లో కోళ్ల లభ్యత పెరిగి క్రమంగా ధరలు తగ్గుతున్నాయి.
ప్రస్తుతం చికెన్ ధర రూ.220 రూపాయల నుంచి రూ.250 వరకు పలుకుతోంది. ఇది ఇంకా తగ్గే అవకాశం ఉంది. నెలాఖరు నాటికి కిలో చికెన్ ధర రూ.190 రూపాయలకు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెప్తున్నారు. సాధారణంగా వర్షాకాలంలో కోళ్ల ఉత్పత్తి పెరుగుతుందని, దీనిద్వారా చికెన్ ధరలు మరింత తగ్గుతాయని పౌల్ట్రీ వ్యాపారులు చెప్తున్నారు. ఏమైనా టమాటా కన్నీళ్లు తెప్పిస్తుంటే కోడి కాస్త ఊరట కలిగిస్తోంది.