Red chillies : కారం ఘాటెక్కుతోంది జాగ్రత్త…! ఎండుమిర్చికి చైనాకు లింకేంటి…?

టమాటా.. పచ్చిమిర్చి.. ఉల్లి... మరి నేనేం తక్కువ అంటోంది ఎండుమిర్చి. కూరల్లో ఎక్కువైతేనే కాదు కొనేటప్పుడు కూడా మంటపుట్టిస్తా అంటోంది.

వంటింట్లో ఎండుమిర్చి ఉందో లేదో ఓసారి చూసుకోండి. ఎందుకంటే రానున్న రోజుల్లో మిర్చి మంట.. పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎండుమిర్చి ఘాటెక్కుతుందని మార్కెట్ వర్గాలు వార్నింగ్ ఇస్తున్నాయి.

టమాటా.. పచ్చిమిర్చి.. ఉల్లి.. మరి నేనేం తక్కువ అంటోంది ఎండుమిర్చి. కూరల్లో ఎక్కువైతేనే కాదు కొనేటప్పుడు కూడా మంటపుట్టిస్తా అంటోంది. ఇంతకీ ఎండుమిర్చి రేట్లెందుకు పెరుగుతున్నాయి..? చైనాకు కారం రేటుకు లింకేంటి..?

ఎందుకు పెరుగుతుంది..?

పండగ సీజన్‌ మొదలుకావడం, దీనికి తోడు వర్షాభావంతో ఎండుమిర్చి రేటుకు రెక్కలొచ్చింది. దేశంలో మిర్చి సాగు విస్తీర్ణం పెరిగిన సమయంలో ధర పెరుగుతోంది. వ్యాపారస్తులు తమ దగ్గరున్న మిర్చి స్టాకును అమ్మకుండా అలాగే స్టోర్ చేసి ఉంచడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. దేశీయంగా డిమాండ్ పెరుగుతుందన్న అంచనాతో పాటు ఈ ఏడాది చైనాకు మిర్చి ఎగుమతులు పెరుగుతాయన్న ఆశతో సరకును స్టాక్ చేస్తున్నారు. గత మార్చిలో మిర్చి ధరలు చుక్కల్లోకి చేరాయి. తర్వాత తగ్గాయి. పండగ సీజన్ కారణంగా రానున్నో రోజుల్లో ధరలు మరింతగా పెరుగుతాయని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఏపీ కోల్డ్‌ స్టోరేజ్‌ల్లో..!

కొంతకాలంగా మిర్చి ధరలు తగ్గాయి. ఎగుమతులు తగ్గడంతో మిర్చి ధర 250 నుంచి 230కి పడిపోయింది. కొత్త పంట వచ్చే జనవరి వరకు రాదు. దీంతో ఈ మధ్య కాలంలో ధరలు పెరుగుతాయన్నది వ్యాపారవర్గాల అంచనా. దేశంలోనే అత్యధికంగా మిర్చిని ఉత్పత్తి చేసే ఆంధ్రప్రదేశ్‌లోని కోల్డ్‌స్టోరేజ్‌లు మిర్చి బ్యాగులతో నిండిపోయాయి. ఏపీలోని కోల్డ్‌స్టోరేజ్‌ల్లో దాదాపు 35లక్షల బ్యాగులు ఉన్నట్లు అంచనా. ఒక్కో బ్యాకు 35కేజీల వరకు ఉంటుంది. అంటే సుమారు 13కోట్ల కేజీల ఎండు మిర్చి ఇక్కడ బ్లాకయిపోయింది. ధరలు పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వాటిని కొనుగోలు చేసిన వ్యాపారులు ఇప్పుడు తక్కువ ధరకు అమ్ముకోవడానికి సిద్ధంగా లేరు.

పండగ సీజన్‌..

సాధారణంగా దసరా సమయంలో ఎండుమిర్చికి డిమాండ్ పెరుగుతుంది. దీంతో ఆ సమయం కోసం వ్యాపారులు ఎదురు చూస్తున్నారు. పైగా దేశంలో ఎక్కువ మొత్తంలో మిర్చిని ఉత్పత్తి చేసే ఏపీలో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ పంట దెబ్బతింటే దాని ప్రభావం ఖచ్చితంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. అలాగే కర్ణాటకలోని బళ్లారి, రాయచూర్‌ ప్రాంతం బైడాగి రకం మిర్చికి కేంద్రాలు. అయితే రిజర్వాయర్లలో నీళ్లు లేకపోవడంతో దాని ప్రభావం పంటపై పడింది. నిజానికి కర్ణాటకలో ఈసారి మిర్చిసాగు 25-30శాతం పెరిగింది. అయితే వర్షాభావ పరిస్థితులతో చాలామంది రైతులు పెసర, కాటన్ వంటి పంటలవైవు మళ్లారు. రానున్న రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు కూడా కరుణించకపోతే మిర్చి మరింత ఘాటెక్కుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో 19.57లక్షల టన్నుల మిర్చిని పండించారు. అంతకుముందు ఏడాది కంటే ఏడుశాతం అధికం. ఈ సంవత్సరంలో కూడా అదే స్థాయి దిగుబడి ఉంటుందన్నది ప్రస్తుత అంచనా. అయితే ఈశాన్య రుతుపవనాలు కూడా నిరాశ పరిస్తే మాత్రం ఉత్పత్తి తగ్గొచ్చు. అక్టోబర్‌ చివరకు దీనిపై పూర్తి క్లారిటీ వస్తుంది. అప్పటివరకు వ్యాపారులు గోడౌన్లలోని మిర్చిని బయటకు తీసే అవకాశాలు కనిపించడం లేదు.

మిర్చికి చైనాతో లింకేంటి..?

ఇక ఎగుమతుల విషయానికొస్తే చైనా నుంచి ఆర్డర్లు పెరగొచ్చని భావిస్తున్నారు. కొంతకాలంగా చైనా కాస్త మన దగ్గర్నుంచి దిగుమతులు తగ్గించినా.. బంగ్లా, థాయ్‌లాండ్, శ్రీలంకలు మాత్రం కొనుగోలు చేస్తున్నాయి. రానున్న రోజుల్లో చైనా కూడా మన మిర్చి కొనుగోలు చేయక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. చైనాలో అక్టోబర్-నవంబర్‌లో పంట రావాల్సి ఉంది. అయితే తుపాను కారణంగా చాలా చోట్ల పంట దెబ్బతింది. అక్కడ పాప్రికా రకం మిర్చి ఎక్కువ. పంట దెబ్బతింటే మన దగ్గర్నుంచి తేజా రకాన్ని డ్రాగన్ దిగుమతి చేసుకుంటుంది. అదే జరిగితే  మిర్చికి ధరకు రెక్కలు వచ్చినట్లే..