Cyber Crime: ఫోన్ పే, గూగుల్ పే టార్గెట్‌గా కొత్త మోసం

మీరు ఫోన్‌పే, గూగుల్‌పే వాడుతున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే.. ఇది చదివి అలర్ట్ అవ్వండి. లేకపోతే మీ ఖాతాలో సొమ్ము గోవిందా..గోవిందా..!

  • Written By:
  • Publish Date - March 20, 2023 / 01:15 PM IST

గూగుల్‌పే, ఫోన్‌పేలతో ఇటీవల సైబర్ మోసగాళ్లు కొత్తరకం మోసానికి తెరతీశారు. నిజానికి ఇది కొత్త మోసమేమీ కాదు.. పాతదే.. అయితే దాన్ని కాస్త మార్చి కస్టమర్ల ఖాతాలను దోచేస్తున్నారు. సాధారణంగా మాల్‌వేర్ వాడి మోసాలు చేస్తారు. లేదా కస్టమర్ల పిన్, ఓటీపీలు కొట్టేసి ఖాతాలు గుల్ల చేస్తారు. కానీ ఈసారి ఆ రెండింటినీ మిక్స్ చేస్తున్నారు కేటుగాళ్లు.

ఈ స్కామ్ చాలా వెరైటీగా ఉంటుంది. ముందుగా మీ ఖాతాలోకి ఫోన్ పే లేదా గూగుల్‌పే ద్వారా 50 లేదా 100 రూపాయలు వస్తాయి. అది పంపిందెవరో మీకు తెలియదు.. ఎవరా అని మీరు బుర్ర బద్దలు కొట్టుకునేలోగానే ఓ అపరిచిత నెంబర్ నుంచి మీకు ఫోన్ వస్తుంది. పొరపాటున వేరే వారికి పంపబోయి కాస్త అటూ ఇటుగా ఉన్న మీ నెంబర్‌కి నగదు పంపామని చెబుతారు. అత్యవసరమని వెంటనే దాన్ని వెనక్కు పంపాలని అభ్యర్థిస్తారు. వేరేవాళ్ల సొమ్ము మనకెందుకులే అని మనం అనుకుంటాం. వెంటనే వాళ్లు చెప్పిన నెంబర్‌కి నగదు వెనక్కి పంపేస్తాం. కానీ ఆ మంచితనమే మన కొంప ముంచేస్తుంది. ఒక్కసారి మళ్లీ మనం డబ్బు రిటర్న్ చేశామా పోయేది ఆ 50రూపాయలో లేక వందో కాదు. మీ ఖాతాలో ఉన్న నగదు మొత్తం క్షణాల్లో మాయమవుతుంది.

ఎప్పుడైతే మనం నగదు వెనక్కు పంపుతామో వెంటనే మన బ్యాంక్ అకౌంట్ మాల్‌వేర్ బారిన పడుతుంది. అకౌంట్ హ్యాక్ అయిపోతుంది. నగదు వెనక్కు పంపగానే వెంటనే స్కామ్‌స్టర్స్‌కు మన సమాచారమంతా చేరిపోతుంది. బ్యాంకు వివరాలు, పాన్, ఆధార్ వంటి కేవైసీ డాక్యుమెంట్లు వారు సంపాదించేస్తారు. బ్యాంకు అకౌంట్లను హ్యాక్ చేయడానికి ఈ డాక్యుమెంట్లు చాలు. ఇది కేవలం ఫిషింగ్ అయితే యాంటి మాల్‌వేర్ సాఫ్ట్‌వేర్లు అడ్డుకునేవి. కానీ మానవమేథ కూడా చేరి ఉండటంతో అవి దీన్ని ఆపలేవు.

ముంబైలో గత 16రోజుల్లో ఇలాగే కోటి రూపాయలు కొట్టేశారు. కొన్ని వందలమంది కష్టార్జితాన్ని దోచుకున్నారు. మంచితనానికి పోయినోళ్లని ముంచేశారు. కాస్త అటూ ఇటుగా ఉన్న ఇలాంటి స్కామ్ మరొకటి కూడా ఇటీవల బయటపడింది. ఎవరో వంద రూపాయలో. రెండు వందలో పెట్టి మీ ఫోన్ నెంబర్‌ను రీఛార్జ్ చేస్తారు. పొరపాటున చేశామని వెంటనే ఆ డబ్బును తమ నెంబర్‌కు పంపమని కోరతారు. మనం వెంటనే అలా చేశామా అయిపోయినట్లే.

మరి మనం ఏం చేయాలి..?

ఎవరైనా పొరపాటున మీ అకౌంట్‌లోకి నగదు పంపాం తిరిగి పంపమంటే వెంటనే వారిని మీకు సమీపంలోని పోలీస్ స్టేషన్ దగ్గరకు రమ్మని అడగండి. పోలీసుల ఎదురుగానే ఆ నగదును తిరిగి చెల్లిస్తామని చెప్పండి. కేటుగాళ్లు అయితే సైలంట్ అయిపోతారు. మేము వేరే రాష్ట్రం వాళ్లమనో మరోటో చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ వారి మాటలు నమ్మకండి. మరీ ఒత్తిడి చేస్తే ఆ నెంబర్‌ను బ్లాక్ చేసి లైట్ తీసుకోండి. వేరే వేరే నెంబర్ నుంచి ఫోన్లు చేస్తారు. అలా ఒకటి, రెండుకంటే ఎక్కువ నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయంటే కచ్చితంగా వాళ్లు మోసగాళ్లే. వారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పండి చాలు. ఒకవేళ ఆ వ్యక్తి నిజమే చెబుతున్నాడని మీకు అనిపించినా పొరపాటున కూడా మెత్తబడకండి. అంతగా కావాలంటే ఆ వ్యక్తి అకౌంట్ నెంబర్ అడిగి తీసుకుని కాస్త కష్టమైనా సరే బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ చేయండి. ఆన్‌లైన్‌లో మాత్రం క్యాష్ ట్రాన్స్‌ఫర్ చేయకండి. ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యం వద్దు.. పొరపాట్లు చేసి మీ కష్టార్జితాన్ని వేరే వాళ్లకు దోచిపెట్టొద్దు.