De-Dollarisation: డాలర్‌కు ఎదురుదెబ్బ.. డీ డాలరైజేషన్ దిశగా ఆఫ్రికా సహా ప్రపంచ దేశాలు..!

ప్రపంచ కరెన్సీలో 75 ఏళ్లుగా డాలర్‌దే ఆధిపత్యం. మన రూపాయిని కూడా డాలర్ విలువతోనే లెక్కిస్తారు. వర్తక, వాణిజ్యాల కోసం అనేక దేశాలు డాలర్‌నే రిజర్వ్ కరెన్సీగా వాడుతాయి. అంటే డాలర్లలోనే ఇచ్చి, పుచ్చుకోవడం చేస్తాయి. అమెరికన్ డాలర్ ఏ దేశంలోనైనా చెల్లుబాటు అవుతుంది. అంతవిలువున్న డాలర్ వినియోగంపై ఆఫ్రికా దేశాలు ఆంక్షలు విధించబోతున్నాయి.

  • Written By:
  • Publish Date - June 19, 2023 / 11:58 AM IST

De-Dollarisation: ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు జరిగేది అమెరికన్ డాలర్‌తోనే. వివిధ దేశాల కరెన్సీని కూడా డాలర్‌తోనే లెక్కిస్తారు. అంతగా ప్రపంచాన్ని శాసించిన డాలర్ ఇప్పుడు తన ఉనికి కోల్పోతుంది. ప్రపంచ కరెన్సీలో డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా వివిధ దేశాలు ముందుకొస్తున్నాయి. ఆఫ్రికా దేశాలు డీ డాలరైజేషన్ దిశగా సాగుతున్నాయి.
ప్రపంచ కరెన్సీలో 75 ఏళ్లుగా డాలర్‌దే ఆధిపత్యం. మన రూపాయిని కూడా డాలర్ విలువతోనే లెక్కిస్తారు. వర్తక, వాణిజ్యాల కోసం అనేక దేశాలు డాలర్‌నే రిజర్వ్ కరెన్సీగా వాడుతాయి. అంటే డాలర్లలోనే ఇచ్చి, పుచ్చుకోవడం చేస్తాయి. అమెరికన్ డాలర్ ఏ దేశంలోనైనా చెల్లుబాటు అవుతుంది. అంతవిలువున్న డాలర్ వినియోగంపై ఆఫ్రికా దేశాలు ఆంక్షలు విధించబోతున్నాయి. ఇకపై డాలర్ బదులుగా ఆఫ్రికన్ కరెన్సీ లేదా పాన్-ఆఫ్రికా పేమెంట్ సిస్టమ్ అమలుచేసే దిశగా నిర్ణయం తీసుకోబోతున్నాయి. దీనికోసం కెన్యా అధ్యక్షుడు విలియమ్ రూటో ఆఫ్రికా దేశాలకు పిలుపునిచ్చారు. గత ఏడాదే దీనికి సంబంధించి ఒక విధానాన్ని ఆఫ్రికా దేశాలు ప్రకటించాయి. ఇకపై ఈ పద్ధతిని అమలు చేయబోతున్నాయి.
కారణమేంటి..?
ప్రపంచ ఆర్థిక లావాదేవీల్లో డాలర్ గుత్తాధిపత్యం చెలాయించింది. అయితే, డాలర్ విలువ వల్ల అనేక దేశాల ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కుంటోంది. ఇటీవల రష్యా-యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా-యూరోపియన్ యూనియన్ (ఈయూ) విధించిన ఆర్థిక ఆంక్షలు కూడా డాలర్‌కు వ్యతిరేకంగా వివిధ దేశాలు ఒక్కటవుతున్నాయి. ఆఫ్రికా దేశాలు మాత్రమే కాదు.. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా డాలర్ బదులుగా తమ దేశ కరెన్సీతోనే వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది బ్రెజిల్ అధినేత చైనాలో పర్యటించినప్పుడు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం.. ఆయా దేశాల కరెన్సీతోనే ఎందుకు చేయకూడదు అని ఆయన ప్రశ్నించారు. గతంలో చైనా-బ్రెజిల్ మధ్య కూడా డాలర్ల ద్వారానే చెల్లింపులు జరిగేవి. ఇప్పుడు స్థానిక కరెన్సీతోనే చెల్లింపులు జరపాలనే నిర్ణయానికొచ్చాయి రెండు దేశాలు. అర్జెంటినా, దక్షిణ అమెరికా కూడా ఈ దిశగా చైనాతో చర్చలు జరుపుతున్నాయి.
భారత వాణిజ్యం రూపాయిల్లోనే 
డాలర్‌కు వ్యతిరేకంగా ఇండియా కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. అనేక దేశాలతో డాలర్ బదులుగా రూపాయలతోనే వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. 18 దేశాలకు రూపాయిల్లోనే చెల్లింపులు జరుపుతున్నట్లు రాజ్యసభలో ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. ఇతర దేశాలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు చెప్పింది. బోత్స్వానా, మయన్మార్, ఇజ్రాయెల్, ఫిజి, మలేసియా, సింగపూర్, రష్యా వంటి దేశాలతో రూపాయల్లోనే వ్యాపారం నిర్వహిస్తోంది. ఆయా దేశాల కరెన్సీని మనం స్వీకరిస్తూ.. మన కరెన్సీని వాళ్లకు చెల్లిస్తున్నాం. ఇండియాలో డీ డాలరైజేషన్ ఇప్పటిది కాదని నిపుణులు అంటున్నారు. అప్పట్లో రష్యా ఆధ్వర్యంలో సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు రష్యా కరెన్సీ అయిన రూబీల్లోనే వ్యాపారం చేసేవాళ్లమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇండియా-రష్యా మధ్య రూపాయి-రూబీల్లోనే బిజినెస్ జరిగింది. గత నెలలో ఈ విధానాన్ని తిరిగి నిలిపివేశారు. బిలియన్ల కొద్దీ భారత రూపాయలు రష్యాలో నిల్వ ఉండటం వల్ల ప్రస్తుతానికి ఈ విధానాన్ని ఆపేసినట్లు రష్యా ప్రకటించింది.
ఇంకా డాలర్ ఆధిపత్యమే
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత నుంచి ప్రపంచవ్యాప్తంగా డాలర్ వాడటం మొదలైంది. ఇప్పటికీ ఈ విషయంలో డాలర్‌దే ఆధిపత్యం. గతంలో రిజర్వ్ కరెన్సీగా బంగారాన్ని వాడేవాళ్లు. ఇప్పుడు డాలర్‌ను వినియోగిస్తున్నారు. వివిధ దేశాలు బంగారం కొనుగోలుకు డాలర్‌నే వాడుతున్నాయి. వివిధ దేశాల కరెన్సీ విలువను కూడా డాలర్ ఆధారంగానే లెక్కిస్తున్నారు. ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (ఐఎంఎఫ్) అంచనా ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 58.36 శాతం రిజర్వ్ కరెన్సీగా డాలర్‌ను, 20.47 శాతం యూరోలను వాడుతున్నారు. డాలర్ బదులు ఇతర కరెన్సీ వాడితే వ్యాపార, వాణిజ్య మరింత సులువవుతుందని అనేక దేశాలు భావిస్తున్నాయి. దీనివల్ల ఖర్చు కూడా తగ్గుతుంది. అంతర్జాతీయ మారకంగా వినియోగిస్తున్న డాలర్‌ను నిలిపివేస్తే అది చైనాకు లబ్ధి కలిగిస్తుందన్నది కొందరి వాదన. చైనా కరెన్సీ అయిన యువాన్ బలపడుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు.
డీ డాలరైజేషన్ అంటే..
అనేక దేశాల మధ్య డాలర్‌తోనే వ్యాపారం జరుగుతోంది. దీని బదులు ఆయా దేశాలకు చెందిన కరెన్సీని వాడటమే డీ డాలరైజేషన్. అంటే దేశాల మధ్య వాణిజ్యంలో డాలర్ పాత్ర ఉండదు. డాలర్ విలువతో సంబంధం లేకుండా స్థానిక కరెన్సీ ఆధారంగానే చెల్లింపులు జరపవచ్చు. సాధారణంగా ఒక దేశం చెల్లించిన డబ్బును మరో దేశం డాలర్లలోకి మారుస్తుంది. ఈ డాలర్లను మళ్లీ తమ దేశ కరెన్సీలోకి మార్చుకోవాలి. కరెన్సీ మార్పిడి కోసమే కొంత డబ్బు చెల్లించాలి. డీ డాలరైజేషన్ అమలైతే ఈ ఖర్చు తగ్గుతుంది. డాలర్ల మారకం ఏ స్థాయికి చేరిందంటే.. అమెరికాలో ఉన్న మొత్తం డాలర్లకంటే.. ఇతర దేశాల్లో ఉన్న డాలర్లే అధికం. 2017నాటి ఒక అధ్యయనం ప్రకారం.. అమెరికా బయటే 60 శాతం కరెన్సీ చెలామణిలో ఉంది. 100 డాలర్ల నోట్లలో 75 శాతం విదేశాల్లోనే ఉన్నాయి.
చైనా-అమెరికా ఆధిపత్య పోరు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అమెరికా, చైనా శాసిస్తున్నాయి. అయితే, రెండింటిలో ప్రస్తుతం అమెరికాదే ఆధిపత్యం. ఈ స్థానాన్ని ఆక్రమించాలని చైనా భావిస్తోంది. అమెరికా డాలర్లను యువాన్లతో రీప్లేస్ చేయాలని చైనా అనుకుంటోంది. దీంతో రెండు దేశాల మధ్య కరెన్సీ/ట్రేడ్ వార్ జరుగుతోంది. ప్రపంచంలో అమెరికా అగ్ర దేశంగా కొనసాగడానికి ఆ దేశానికి ఉన్న సైనిక సామర్ధ్యంతోపాటు, ఆర్థికపరమైన అంశాలే కారణమని చైనా అంచనావేసింది. ముఖ్యంగా అంతర్జాతీయంగా డాలర్ల చెలామణి ద్వారా అమెరికా భారీగా లబ్ధిపొందుతోందని చైనా భావిస్తోంది. డాలర్‌ను డామినేట్ చేసి, యువాన్‌ను రిజర్వ్ కరెన్సీగా వాడేలా చేయాలని చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ దిశగా ఇప్పటికే కొంత విజయవంతమైంది. చైనా-రష్యా మధ్య యువాన్లలోనే వాణిజ్యం జరుగుతోంది. భారతీయ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ కూడా గతంలో రష్యాకు యువాన్లలోనే చెల్లింపులు చేసింది. మెల్లిగా దీన్ని విస్తరించాలని చైనా అనుకుంటోంది. కానీ, దీనికి బ్రిక్స్ దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) అంగీకరించాలి. దీనిలో భాగంగా వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్‌లకు బదులుగా కొత్త బ్యాంకింగ్ సిస్టమ్ కోసం కూడా చైనా ప్రయత్నిస్తోంది. అయితే, డాలర్ల విషయంలో అమెరికా పూర్తి పారదర్శకంగా ఉంటుంది. అంటే నోట్ల ముద్రణ విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తుంది. కానీ, చైనా అంత పారదర్శకంగా ఉండే అవకాశమే లేదు. ఆ దేశం ఎత్తుగడల గురించి తెలిసిందే. అందువల్ల చైనా కరెన్సీని అనేక దేశాలు రిజర్వ్ కరెన్సీగా అంగీకరించే అవకాశం లేదు. అందులో ఇండియా ఒకటి.
గ్లోబల్ కరెన్సీతోనే సాధ్యం
డాలర్ లేదా యువాన్‌కు చెక్ పెట్టాలంటే ఒక కామన్ కరెన్సీ తీసుకురావాలని బ్రిక్స్ దేశాలు గతంలో ప్రతిపాదించాయి. తమ దేశాల మధ్య ఒక షేర్‌డ్ కరెన్సీ రూపొందించాలని భావిస్తున్నాయి. బ్రిక్ పేరుతో ఒక గ్లోబల్ కరెన్సీ కోసం ప్రయత్నిస్తున్నాయి. డాలర్‌కు ధీటుగా బ్రిక్స్ కరెన్సీ ఉంటే బాగుంటుందని కొందరు ఆర్థికవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే, దీన్ని అంతర్జాతీయంగా కూడా అంగీకరించాలి. అప్పుడే డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుంది.