Twitter: ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పాడు సీఈవో ఎలన్ మస్క్. ఇకపై యూజర్లు పోస్టింగుల ద్వారా డబ్బులు కూడా సంపాదించుకోవచ్చట. ట్విట్టర్ ప్లాట్‌ఫాంపై మానిటైజేషన్ ద్వారా యూజర్లు డబ్బులు సంపాదించుకోవచ్చని మస్క్ వెల్లడించాడు. ఇప్పటికే యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫాంలపై డబ్బు సంపాదించుకునే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ట్విట్టర్ కూడా ఇదే బాటలో పయనించబోతుంది. క్రియేటర్లు, ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నవారికి ఇదో మంచి అవకాశమే అని చెప్పాలి. ప్రస్తుతానికి ఇది అమెరికాలోనే అందుబాటులో ఉన్నప్పటికీ, త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుందని మస్క్ తెలిపాడు. భారీ టెక్స్ట్ కంటెంట్, ఎక్కువ నిడివి ఉన్న వీడియోలతోపాటు తాము క్రియేట్ చేసే కంటెంట్‌పై యూజర్లు సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్ ద్వారా వచ్చే డబ్బుల్ని యూజర్లు సంపాదించుకోవచ్చు. ఈ ఫీచర్ కావాలంటే యూజర్లు సెట్టింగ్స్‌లోకి వెళ్లి, మానిటైజేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఈ సబ్‌స్క్రిప్షన్ ద్వారా వచ్చే డబ్బుల్ని ఏడాదిపాటు ట్విట్టర్ తీసుకోదని మస్క్ చెప్పారు. 70 శాతం వినియోగదారులకే చెందుతుంది. అయితే, మిగిలిన 30 శాతం ఐఓఎస్ లేదా ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంలపై యాప్ స్టోర్ ఫీజు కింద వసూలు చేస్తుంది. అదే వెబ్ ద్వారా వచ్చే ఆదాయమైతే 92 శాతం యూజర్లకే చెందుతుంది. యూజర్లు క్రియేట్ చేసిన కంటెంట్‌ను ట్విట్టర్ ప్రమోట్ చేస్తుంది కూడా. అలాగే యూజర్లు తాము కోరుకున్నప్పుడు కంటెంట్ డిలీట్ చేయొచ్చని, అవసరమైతే ట్విట్టర్ నుంచి కూడా బయటకు వెళ్లొచ్చని మస్క్ పేర్కొన్నాడు.
గత ఏడాది ట్విట్టర్‌ను మస్క్ సొంతం చేసుకున్నప్పటి నుంచి అనేక మార్పులు చేస్తున్నాడు. దీనిలో భాగంగా తాజాగా మానిటైజేషన్ ఆప్షన్ తీసుకొచ్చాడు. దీని వెనుక కూడా అనేక వ్యూహాలు ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. మొదటి ఏడాది యూజర్లకు సంబంధించి ఎలాంటి డబ్బు తీసుకోకపోయినప్పటికీ, ఆ తర్వాత నుంచి కంపెనీ వాటాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది కంపెనీకి మంచి ఆదాయ వనరుగా మారుతుంది. మరోవైపు ఇప్పటికే ఇదే పద్ధతిని అనుసరిస్తున్న సబ్‌స్టాక్ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు కూడా ఈ వ్యూహం ఉపయోగపడుతుందని మస్క్ భావిస్తున్నాడని విశ్లేషకుల అంచనా.