Rs 2000 Notes: రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. చాలా మంది తమ దగ్గరున్న నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. అర్జెంటుగా నోట్లు మార్చుకోకపోతే ఇబ్బందుల్లో పడతామేమో అని కంగారు పడుతున్నారు. నిజానికి అంత కంగారు అవసరం లేదంటున్నారు ఆర్థిక నిపుణులు. 2016లోలాగా నగదుకు కొరత లేదని, ఈ నోట్లు మార్చుకునేందుకు చాలా గడువుందని, అందువల్ల వీలునుబట్టి నెమ్మదిగా నోట్లు మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ అంశంలో కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోకుంటే మాత్రం చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అందుకే కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
♦ నోట్లు మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువుంది. కాబట్టి ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు. అనవసరంగా బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడి ఆపసోపాలు పడక్కర్లేదు.
♦ 2016లో నోట్ల రద్దు తర్వాత రూ.500, రూ.1000 నోట్లు రద్దయ్యాయి. దీంతో వాటిని బ్యాంకుల్లో మాత్రమే మార్చుకోవాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు రూ.2 వేల నోట్లు చెల్లుబాటు అవుతాయి. వాటిని ఇతర ఏ అవసరాల కోసమైనా వినియోగించుకోవచ్చు.
♦ ప్రస్తుతం మార్కెట్లో చెలామణిలో ఉన్న కరెన్సీలో రూ.2 వేల నోట్ల వాటా 10.8 శాతమే.
♦ నోట్లు మార్చుకోవాలి అంటే ఒకేసారి పది నోట్లను.. అంటే రూ.20 వేలను మాత్రమే మార్చుకోవచ్చు. అలా ఎన్నిసార్లైనా క్యూలో నిలబడి ప్రతిసారీ రూ.20 వేల వరకు మార్చుకోవచ్చు. బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసుకునేందుకు మాత్రం పరిమితి లేదు. బ్యాంకు ఖాతా లేని వాళ్లు నోట్లను మార్చుకోవడమే మంచిది. బ్యాంకులో నగదు లభ్యత, రద్దీ వంటి అంశాల ఆధారంగా బ్యాంకులు సేవలు అందిస్తాయి.
♦ ఎన్ని నోట్లనైనా డిపాజిట్ చేయొచ్చు. కానీ, రూ.2.5 లక్షల కంటే ఎక్కవ నగదు ఉంటే వాటికి తగిన పత్రాలు చూపించాల్సి ఉంటుంది. ఈ సమాచారం ఐటీ (ఆదాయపు పన్ను) శాఖకు వెళ్తుంది.
♦ మీ దగ్గరున్న సొమ్ము బ్లాక్ మనీ కాకుంటే కంగారు పడక్కర్లేదు. ఎక్కువ మనీ డిపాజిట్ చేస్తే ఐటీ శాఖకు సమాధానం చెప్పాల్సి రావొచ్చు. అవసరమైన పత్రాలు చూపించాలి. పరిమితి దాటితే పన్ను చెల్లించాల్సి రావొచ్చు.
♦ నోట్ల మార్పిడి, డిపాజిట్లు వంటి లావాదేవీలు చేసే వాళ్లు స్టేట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ (ఎస్ఎఫ్‌టీ రూల్స్) తెలుసుకోవాలి. ఈ రూల్స్ ప్రకారం.. ఖాతాలకు సంబంధించి పరిమితికి మించి లావాదేవీలు జరిగితే ఆ వివరాల్ని బ్యాంకులు ఐటీ శాఖకు తెలియజేస్తాయి. ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో చెక్కులు, డ్రాఫ్టులు, పే ఆర్డర్ల విలువ రూ.10 లక్షలు దాటినా, సేవింగ్స్ అకౌంట్లో రూ.10 లక్షలకు మించి డిపాజిట్లు ఉన్నా ఆ వివరాలు ఐటీకి చేరుతాయి. రూ.20 లక్షలకు మించి డ్రా చేసినా, డిపాజిట్ చేసినా ఆధార్ సమర్పించాలి. కరెంట్ ఖాతా అయితే ఈ పరిమితి రూ.50 లక్షల వరకు ఉంటుంది.
♦ వ్యాపారులకు కూడా నిబంధనలున్నాయి. నగల వ్యాపారులు లేదా బిల్డర్లు ఒక రోజులో గరిష్టంగా రూ.2 లక్షలు మాత్రమే నగదు రూపంలో స్వీకరించాలి. అది ఒకే లావాదేవి అయినా.. ఒకటి కంటే ఎక్కువ లావాదేవిలు అయినా రెండు లక్షల రూపాయలకు మించి నగదు తీసుకోకూడదు. అలాగే పెద్ద బిల్లులను రూ.2 లక్షల కింద విడగొట్టి కూడా తీసుకోకూడదు.
♦ నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ చేసే వాళ్లు పాన్, ఆధార్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రూ.50 వేలకు మించిన లావాదేవీలకు పాన్ జత చేయాలనే నిబంధనే దీనికీ వర్తిస్తుంది. అయితే, డిపాజిట్ లేదా మార్పిడి చేసుకునే వాళ్లు తమ వెంట కేవైసీ పత్రాలు తీసుకెళ్తే మంచిది.