సాధారణంగా మనం ఉపయోగించే ఎలాంటి స్క్రీన్ టైప్ వస్తువుల్లో అయినా ఓపెన్ సెల్ అనే చిన్న స్పేర్ ఉంటుంది. ఇది లేకుంటే ఆ ఎలక్ట్రానిక్ డివైజ్ కూడా పనిచేయదు. డిస్ ప్లే ఆధారిత వస్తువుల్లో ఓపెన్ సెల్ పాత్ర కీలకం. ఒక టీవీ ని తయారు చేయాలంటే ఈ ఓపెన్ సెల్ ను 60 శాతం పైగా ఉపయోగించాల్సి ఉంటుంది. అలాంటి ఓపెన్ సెల్ ధరలను అమాంతం 15 శాతం పెరిగినట్లు స్మార్ట్ టీవీలను ఉత్పత్తి చేసే కంపెనీలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన కొందరు అధికారులు కొన్ని ఆసక్తికరమైన అంశాలను వెలువరించారు. 2022 సంవత్సరంలో ఓపెన్ సెల్స్ ధరలు తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. అందుకే అప్పట్లో టీవీలు, మొబైల్స్, ల్యాప్ టాప్స్ ప్రస్తుత ధరకంటే కూడా తక్కువకు లభించేవి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్యలో వీటి ధరలు 15 నుంచి 17 శాతం వరకూ పెరిగినట్లు తెలిపారు. మనం మామూలుగా ఉపయోగించే 32 అంగుళాల స్మార్ట్ టీవీలో ఉపయోగించే ఒక్కో ఓపెన్ సెల్ ప్యానెల్ కు దాదాపు 27 డాలర్ల వరకూ ఖర్చు అవుతుండట. వీటిని చైనాకు చెందిన ప్రధానమైన నాలుగు, ఐదు కంపెనీలు మాత్రమే తయారు చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఐదు కంపెనీల మీదే ఆధారపడి వస్తువులను తయారు చేయాల్సి ఉంటుంది.
దీని ప్రభావం భారత్ పై కూడా పడనుంది. ఇప్పటి సమాజంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, టీవీ ని నిత్యవసర వస్తువులాగా ఉపయోగిస్తున్నారు. మన దేశంలో ఉత్పత్తి లేకపోవడం ఒక ఎత్తైతే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులకు ప్రత్యేకంగా పన్నులు విధించడం మరో ఎత్తు. దీంతో ఇక్కడ టీవీలు తయారు చేసే కంపెనీలు తక్కువ ధరకు ఉత్పత్తి చేద్దాం అంటే కూడా ప్రధాన ముడిసరుకు చైనా నుంచి దిగుమతి చేసుకోవల్సిన పరిస్థితి. వీటిని దిగుమతి చేసుకునేటప్పుడు ఎక్సైజ్ డ్యూటీ కట్టి తీసుకోవాలి. వాటి మీద వేసిన పన్నుతో పాటూ ట్రాన్స్ పోర్ట్ ఛార్జ్ లను కలుపుకుంటే మన దేశంలో తయారు చేసే టీవీ, లాప్ టాప్, మొబైల్ ధరలు కూడా ఆకాశానికి నిచ్చన వేయడం ఖాయం.
ఇప్పటి వరకూ మన ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రానిక్ వస్తువుల ధర 25 నుంచి 30 శాతం పెరిగినట్లు పారిశ్రామిక నిపుణులు చెబుతున్నారు. ఇక పెరిగిన ధరలకు వస్తువు కొరత ధర పై మరింత ప్రభావం చూపుతోంది. రానున్న రోజుల్లో ఇప్పుడు ఉన్న మార్కెట్ ధరలకు మరో 10 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ ఓపెన్ సెల్ ధరలను పెంచడంతో వీటి ప్రభావం మన దేశం మీద ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా పడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికిప్పుడు అయితే అంతగా ప్రభావం చూపక పోవచ్చు. దీనికి కారణం వీటిని అమ్మే వారు పాత స్టాక్ ను గోడౌన్ లలో అందుబాటులో ఉంచుకొని ఉంటారు. కనుక వాటి ఎంఆర్పీ ధరలకే అమ్మాల్సి ఉంటుంది. వాటికంటే ఎక్కువకు విక్రయించాల్సి వస్తే అది చట్టబద్దంగా తప్పు అవుతుంది కనుక పాత ధరలకే వినియోగదారుడు కొనుగోలు చేయవచ్చు. జూలై తరువాత నుంచి ఈ పెరిగిన ధరలు మనకు అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పారిశ్రామిక, ఆర్థిక విశ్లేషకుల అంచనా.
T.V.SRIKAR