Gautam Adani: టాప్-20లోకి అదానీ.. నాలుగు నెలల తర్వాత మళ్లీ పెరిగిన అదానీ సంపద

హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడ్డ తర్వాత క్రమంగా కరిగిపోయిన అదానీ సంపద ఈ మధ్య కాలంలో నెమ్మదిగా పుంజుకుంటూ వస్తోంది. చివరకు ఆయన టాప్-20లోకి దూసుకొచ్చారు. ఇప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో 18వ స్థానంలో నిలిచారు.

  • Written By:
  • Publish Date - May 25, 2023 / 03:23 PM IST

Gautam Adani: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్-20లోకి దూసుకొచ్చారు. జనవరి 24 తర్వాత వరుసగా తగ్గుతూ వచ్చిన ఆయన సంపద ఇటీవలి కాలంలో మళ్లీ పెరిగింది. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడ్డ తర్వాత క్రమంగా కరిగిపోయిన అదానీ సంపద ఈ మధ్య కాలంలో నెమ్మదిగా పుంజుకుంటూ వస్తోంది. అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ గతంలో ప్రపంచంలోనే మూడో ధనవంతుడిగా నిలిచిన సంగతి తెలిసిందే. జనవరి 24 వరకు ఆయన మూడో స్థానంలో ఉన్నారు. అదే రోజు హిండెన్ బర్గ్ నివేదిక వెలువడింది. అదానీ సంస్థలపై ఆ నివేదికలో అనేక ఆరోపణలు వచ్చాయి. డొల్ల కంపెనీలతో పెట్టుబడులు, కృత్రిమ షేర్ల విలువ పెంపు, అధిక అప్పులు, అక్రమాలు, అవకతవకలు అంటూ అదానీ సంపదపై ఆరోపణలు చేసింది ఈ నివేదిక. దీనిని సంస్థ ఖండించింది. అయినప్పటికీ కంపెనీ షేర్ల విలువలు పతనమవుతూ వచ్చాయి. దీంతో అదానీ సంపద క్రమంగా తగ్గుతూ పోయింది.

ఒకప్పుడు ప్రపంచ ధనవంతుల్లో టాప్-3లో ఉన్న గౌతమ్ అదానీ ఆ తర్వాత టాప్-10లోంచి, కొంతకాలానికి టాప్-20లోంచి కూడా స్థానం కోల్పోయాడు. చివరకు 26వ స్థానానికి పడిపోయాడు. అదానీ కంపెనీలపై రాజకీయ పార్టీలు కూడా అనేక ఆరోపణలు చేశాయి. చివరకు ఈ ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక అదానీ కంపెనీకి అనుకూలంగా వచ్చింది. అదానీ సంస్థలు అక్రమాలకు పాల్పడ్డట్లు సరైన ఆధారాలు లేవని సుప్రీం కోర్టు కమిటీ తెలిపింది. దీంతో నెమ్మదిగా అదానీ గ్రూప్ షేర్లు బలపడుతూ వచ్చాయి. స్టాక్ మార్కెట్లో అదానీ నికర సంపద 4.38 బిలియన్ డాలర్లు పెరిగింది. అలాగే అదానీకి చెందిన సంస్థల్లో వాటాను 10 శాతానికి పెంచుకుంటున్నట్లు ఆ కంపెనీలో భాగస్వామ్యం ఉన్న అమెరికా కంపెనీ జీక్యూ తెలిపింది. అలాగే అదానీ భాగస్వామ్యం ఉన్న ఎల్ఐసీ షేర్లు కూడా భారీగా లాభపడ్డాయి. దీంతో అదానీ సంపద పెరిగింది. చివరకు ఆయన టాప్-20లోకి దూసుకొచ్చారు. ఇప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో 18వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన నికర ఆస్తుల విలువ 64.2 బిలియన్ డాలర్లుగా ఉంది.
అంబానీ తర్వాతి స్థానంలో
అదానీ టాప్-20లోకి దూసుకొచ్చినప్పటికీ ఆయన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ తర్వాతి స్థానంలోనే ఉన్నారు. ప్రస్తుతం అదానీ కంటే అంబానీ సంపద ఎక్కువగా ఉంది. ముకేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా మొదటి స్థానంలో ఉంటే, అదానీ రెండో స్థానంలో ఉన్నారు. ప్రపంచ కుబేరులకు సంబంధించి టాప్-10లో తొమ్మిది మంది అమెరికన్లే కావడం విశేషం. మరోవైపు మొన్నటివరకు హిండెన్ బర్గ్ నివేదిక వల్ల దెబ్బతిన్న అదానీ షేర్లు ప్రభావం ఇప్పుడు తొలగిపోయింది. క్రమంగా అదానీ షేర్లు పుంజుకుంటున్నాయి.