Gold Prices: బంగారం అంటే ఇష్టం లేనిదెవరికి చెప్పండి..! బంగారం అనేది ఆభరణమే కాదు.. ఓ సెంటిమెంట్ కూడా మన తెలుగువాళ్లకు. అలాంటి బంగారం కాస్తా అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది ఈ మధ్య. దీంతో ధరలు చూసి.. దిగిరా బంగారం అని ఆశగా ఎదురుచూసిన పరిస్థితి మధ్యతరగతి జనాలది. భారీ ధరల కారణంగా ఈ ఏడాది బంగారానికి డిమాండ్ తగ్గిపోయింది. రేట్లు పడిపోయినప్పుడు కొనుక్కోవచ్చులే అని అంతా ఎదురుచూశారు.
అలాంటి వారికి గుడ్ న్యూస్. ఇటీవల బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1960 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు స్పాట్ సిల్వర్ రేటు 24.65 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. ఇది కొద్దిరోజుల కిందటితో పోలిస్తే తగ్గింది. అంతర్జాతీయంగా రేట్లు తగ్గడంతో.. ఆ ప్రభావం దేశీయంగానూ కనిపించింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.55 వేల మార్కుకు చేరింది. 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ.60 వేల మార్కు దగ్గర ట్రేడవుతోంది. వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. బంగారం, వెండి ధరలు ఆల్ టైం హై నుంచి భారీగా పడిపోయాయి. బంగారం ధర మే 5న 22 క్యారెట్లు 10 గ్రాములపై రూ.57,200 దగ్గర జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఇప్పుడు రూ.55 వేలకు దిగొచ్చింది. అంటే 2 నెలల వ్యవధిలో ఆల్ టైం హై నుంచి 2,200 రూపాయల మేర పడిపోయింది.
ఇక అటు వెండి జీవనకాల గరిష్టం నుంచి రూ.3,700 మేర పతనమైంది. సాధారణంగా బంగారం ధర యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను బట్టి ప్రభావితం అవుతుంటుంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచినప్పుడు డాలర్ విలువ పెరిగి బంగారం ధర పతనం అవుతుంటుంది. ఇక ఫెడ్ ఈసారి మళ్లీ వడ్డీ రేట్లను పెంచనుందన్న సంకేతాల నడుమ బంగారం రేటు పడిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పనిచేస్తాయి. ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర ప్రభావం అనేక రంగాలపై పడింది. దీంతో ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి.