Gold Price: బంగారం ధరలు పైపైకే..!

బంగారం ఇప్పుడు హాహాకారాలు పెట్టిస్తుంది. అమ్మబోతే అడవి..కొనబోతే కొరివి అన్న చందంగా తయారైంది. ప్రస్తుతం మార్కెట్లో 24క్యారెట్ ధర రూ. 60వేలకుపైమాటే. ఇక 22 క్యారెట్ల బంగారం విషయానికొస్తే రూ.55వేలకు పైనే ఉంది. దీంతో కొనాలనుకునేవారికి తీవ్ర నిరాశ ఎదురైందని చెప్పాలి. ఎందుకు ఇంతగా పెరుగుతుంది. కేవలం 10రోజుల్లో 5వేల రూపాయల గరిష్టానికి ఎగబాకింది. ఇది ఇలాగే ఉంటుందా. మరింత పెరుగుతుందా. అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Updated On - March 21, 2023 / 03:47 PM IST

ప్రస్తుతం బంగారం పెరగడానికి కారణం అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం ఒక కారణమైతే.. అంతర్జాతీయంగా లోహాలకు డిమాండ్ పెరగడం మరో కారణం. బ్యాంకింగ్ వ్యవస్థ కూలిపోతూ ఉండడంతో నగదును బంగారుగా మార్చుకునేందుకు ఉత్సాహం చూపించారు విదేశీయులు. దీంతో ఒక్కరోజులో 70 డాలర్లకు పైగా పసిడి ధర పెరిగి ఔన్స్ ధర 1993 డాలర్లకు చేరుకుంది. అంటే మన భారత్ కరెన్సీతో లెక్కగడితే లక్షా 50వేలు అవుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థల పతనం డాలర్ పై పడి దీని విలువ తగ్గిపోయింది. ఇక అక్కడి పెట్టుబడిదారులు వేరే గద్యంతరం లేక స్థిరమైన భద్రంగా ఉండే దానిపై పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపించారు. వీటిలో బంగారంకు మించిన భద్రత ఎక్కడా లభించని కారణంగా డిజిటల్ గోల్డ్ పై పెట్టుబడిపెట్టారు. ఇక చెప్పేదేముంది డిమాండు సూత్రం పనిచేసింది. దీని ఎఫెక్ట్ భారత్ పై పడింది.

ఇదిలా ఉంటే మరో వారం రోజుల్లో పసిడి ధరలు దాని మెరుపుల కంటే ఎక్కువగా ధర పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. యూరప్, అమెరికా బ్యాంకింగ్ సంక్షోభంతో పరిస్థితి ఇప్పట్లో సర్దుమణిగేలా కనిపించడం లేదు. పైగా అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ తన రిజర్వ్ వడ్డీ రేట్లను మరో 0.25 శాతం పెంచవచ్చని తెలుస్తుంది. ఇది ఇలాగే పెరిగితే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర (31 గ్రాములు) 2000 నుంచి 2030 డాలర్ల మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా కనుక జరిగితే మరో రెండు నుంచి ఐదు వేల మధ్య బంగారం ధర పెరిగి 65 వేల రూపాయలకు చేరుకుంటుందని అంచనా.

గడిచిన 5 దశాబ్దాలుగా పెరిగిన పసిడి పరుగుల ధరను చూద్దాం.

Gold Prices List

పైన చెప్పిన ధరల సూచికల ప్రకారం గతంలో దశాబ్దాలకు ఒక్కసారి మారుతూ వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈరోజు ఉన్న బంగారం ధర రేపు ఉండట్లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ 2023 ఫిబ్రవరి, మార్చి నెలలే అని చెప్పాలి. గత ఏడాదికి ఇప్పటికి పోలిక చూస్తే ఏకంగా పదివేలకు పైగా పెరిగింది.

Gold Price

ఇక ఇలాంటి పరిస్థితులు తలెత్తడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో కొన్నింటిని పరిశీలిద్దాం.

  • బ్యాంకుల వడ్డీ రేట్ల పెరుగుదల

బ్యాంకులు రుణాలు ఇచినట్లే ఇచ్చి అమాంతం రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. కరోనా కాలాన్ని దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా తీసుకోవాలి. లోన్లపై ముందుగా వడ్డీలు నిదానంగా చెల్లించవచ్చు అని చెప్పిన ప్రభుత్వాలు వాటిని అమలు చేయడంలో విఫలం అయ్యాయి. దీంతో బ్యాంకుల చేతికి కొరడా ఇచ్చినట్లయ్యింది. ఖాతాదారులపై తమ జులుం జులిపించారు. గృహ, వాహన రుణాలు తీసుకున్న వారు అధిక వడ్డీ కట్టలేక, కట్టుకున్న ఇంట్లో ఉండలేక పోయారు. అదే సమయంలో నిత్యవసర ధరలు తీవ్రంగా పెరుగుతూ వచ్చాయి. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. దీంతో డాలర్ల విలువ పైకి క్రిందికి పెరుగుతూ తగ్గుతూ వచ్చింది. డాలర్ విలువ ఎప్పుడైతే పడిపోతుందో బంగారం విలువ అమాంతం పెరిగిపోతుంది.

  • అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థల పతనం

గతంలో ఒకసారి 2008 లో అగ్రరాజ్యమైన అమెరికాలో బ్యాకింగ్ వ్యవస్థ కుప్పకూలింది. అప్పుడు కూడా అమెరికా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవల్సి వచ్చింది. ప్రస్తుతం వచ్చేటప్పడికి మూడురోజుల వ్యవధిలో దిగ్గజ బ్యాంకులుగా పేరొందిన స్టార్టప్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంకు మూతపడ్డాయి. దీంతో ఇన్సురెన్స్ కంపెనీలపై అక్కడి డిపాజిటర్ల ప్రభావం తీవ్రస్థాయిలో పడింది. అలాగే యూరప్ లోని ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకుగా పేరొందిన క్రెడిట్ స్విస్ బ్యాంకు దగ్గర సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, సరైన ఆడిట్ విధానాన్ని అనుసరించకపోవడం, ఇందులోని డిపాజిటర్లందరూ అక్రమార్కులే కావడంతో దివాలా తీసింది. వీటి ప్రభావం ప్రపంచ దేశాలపై ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా అయినా పడతాయి. అందుకే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి.

  • పెట్టుబడి దారులు జర జాగ్రత్త

ఒకప్పుడు చెప్పినంత సులభంకాదు బంగారం కొనడం అమ్మడం. ఇది ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో పసిడి వ్యాపారం చేసే వారికి కూడా పాలుపోవడంలేదు. ఇందులో పెట్టుబడిపెట్టి కోటీశ్వరులు అయిన వారూ ఉన్నారు. బికారులైన వారూ ఉన్నారు. అంతగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే డిజిటల్, బాండ్, ఈటీఎ‌ఫ్ వంటి మార్గాలను ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే భౌతికంగా కొంటే వాటిపై తరుగు తదితర ఛార్జీలు విధిస్తారు. కొనేముందు కొంత.. కొన్నది అమ్మేటప్పుడు కొంత నష‌్టపోవల్సి ఉంటుంది. అదే ఆర్బీఐ సావరిన్ బాండ్ల రూపంలో పెట్టుబడి పెడితే మనకు అవసరమైనప్పుడు లోన్స్ మంజూరు చేస్తారు. తిరిగి నెలవారీ కంతులు కట్టుకొని చెల్లింపు చేయడం వల్ల మన బంగారానికి విలువ ఉంటుంది. ఈటీఎఫ్ అంటే కూడా అంతే షేర్ మార్కెట్ లాగా పెట్టుబడులు పెట్టి సర్టిఫికేట్ రూపంలో భద్రత పొందడం. ఇలాంటివి చేస్తే కాస్త ఉపయోగకరంగా ఉంటుంది.

  • అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం

బంగారం ధరను అంతర్జాతీయ మార్కెట్ మాత్రమే నిర్ణయింస్తుంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో 31.1 గ్రాముల బంగారం విలువ దాదాపు 2000 నుంచి 2030 వద్ద దోబూచులాడుతుంది. ఇలాగే కొనసాగితే మరింత కొరకని కొయ్యగా మారే అవకాశం ఉంది. తిరిగి పూర్వ వైభవానికి రావాలంటే ఇంధన ముడిచమురు ధరలను నియంత్రించి..బ్యాంకుల విధిస్తున్న విపరీత వడ్డీ రేట్లకు అడ్డుకట్ట వేస్తే పసిడిపై పెట్టుబడిపెట్టే వారు రియల్ ఎస్టేట్, భవన నిర్మాణాల వైపుకు మళ్లుతారు. దీంతో బంగారం పై పెట్టుబడి పెట్టే వారి శాతం పడిపోయి డిమాండ్ తగ్గుతుంది. అప్పుడు బంగారం తిరిగి స్థిరంగా కొనసాగే అవకాశం ఉంటుంది.

ప్రపంచదేశాల ప్రభావం పసిడిపై పడటం పెళ్లి చేయాలనుకునేవారికి తీవ్ర సమస్యగా మారే అవకాశం ఉంటుంది. దీంతో ఆడపిల్ల ఇంట పెళ్లి భాజా మోగే పరిస్థితి ఉంటుందా లేదా చూడాలి. ప్రస్తుతం ఏప్రిల్ నెలలో అయితే పెద్దగా ముహూర్తాలు లేవు కాబట్టి పరవాలేదు. మళ్ళీ పెళ్లిళ్ల సీజన్ నాటికి కొంత తగ్గితే మధుపరులకు, స్వర్ణాభరణాల కొనుగోలు దారులకు కాస్త ఊరట లభిస్తుందని చెప్పాలి.

 

T.V.SRIKAR