Gold Price Rising: బంగారం ధరల్లో కొత్త చరిత్ర.. రూ.61,000 దాటిన బంగారం.. మరింత పెరిగే ఛాన్స్

బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. చరిత్రలో మొదటిసారి పది గ్రాముల బంగారం ధర రూ.61,000 దాటింది. వెండి కిలో ధర రూ.80,700కు చేరుకుంది. ఈ ధరలు సామాన్యుడికి, మార్కెట్‌కు షాకిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - April 6, 2023 / 02:28 PM IST

Gold Price Rising: బంగారం ధరల్లో బుధవారం సరికొత్త రికార్డు నమోదైంది. తొలిసారి పది గ్రాముల బంగారం ధర రూ.61,000 దాటింది. కిలో వెండి ధర రూ.80,700కు చేరుకుంది. చరిత్రలో ఇవే అత్యధిక ధరలు. అయితే, ఈ ధరలు సామాన్యుడికి, మార్కెట్‌కు షాకిస్తున్నాయి. హైదరాబాద్‌తోపాటు, ఢిల్లీ, ముంబైసహా అన్ని ప్రధాన నగరాల్లోనూ అత్యధిక ధరలే అమలవుతున్నాయి. బంగారం ధర ఒక్క రోజులోనే రూ.1,030, వెండి కిలో ధర రూ.2,900 పెరిగింది.

అంచనాలకు అందని పెరుగుదల
బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందని స్థాయిలో రోజురోజుకూ దూసుకుపోతున్నాయి. గత జనవరి నుంచి దాదాపు ఏడు శాతంపైగా బంగారం ధరలు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దూసుకెళ్తుంటే ఫ్యూచర్స్ మార్కెట్‌లో కూడా పసిడి ధర పైకి ఎగబాకుతోంది. బుధవారం మల్టీ కమోడిటీస్ ఎక్స్‌చేంజ్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.61,120కి చేరింది. అంతకుముందు రోజుతో పోలిస్తే ఇది రూ.166 ఎక్కువ. అయినప్పటికీ బంగారానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అనేక అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని నిపుణుల అంచనా. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 2000 డాలర్లను దాటింది.


పెరుగుదలకు కారణాలు
అమెరికాలో నిరుద్యోగ రేటు తగ్గకపోవడం, ఫెడరల్ బ్యాంక్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు, ద్రవ్యోల్బణం, అమెరికాలో బ్యాంకుల దివాళా, అక్కడి ఆర్థిక వ్యవస్థ మందగమనం, బంగారం దిగుమతులు వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. నిజానికి ఇటీవల క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల అమెరికా డాలర్ విలువ పెరిగింది. దీంతో బంగారం ధరలు కొంత తగ్గాయి. అయితే, ఆ వెంటనే అనేక ఆర్థిక ఒడిదుడుకుల నేపథ్యంలో మళ్లీ బంగారం ధరలు పైపైకి పెరుగుతున్నాయి. పెరుగుతున్న బంగారం ధరలు పెట్టుబడిదారులకు లాభాల్ని పంచుతున్నా.. సామాన్యులకు మాత్రం అందనంత స్థాయిలో ఉంటున్నాయి.

70 వేలకు పెరిగే ఛాన్స్
మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం బంగారం ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.70,000కు పెరుగుతుందని ఒక అంచనా. ఈ ఏడాది చివరి నాటికి ఈ స్థాయిని అందుకోవచ్చని ఆశిస్తున్నారు. అందువల్ల మార్కెట్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో ఐదు నుంచి పది శాతం బంగారంపై వెచ్చించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడులకు గురవుతున్నాయి. అందువల్ల చాలా మంది బంగారంపై పెట్టుబడికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాదంతా బంగారం, వెండి ధరలు పెరిగే ఛాన్స్ ఉందని విశ్లేషకుల అభిప్రాయం.