Jio Network: ప్రభుత్వానికి.. ప్రభుత్వ ఉద్యోగులకు అనుసంధానమైనది.. జియో టెలికాం సంస్థ..

ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది గుజరాత్​ సర్కార్​. ఇకపై కేవలం జియో నెట్​వర్క్​ను మాత్రమే వినియోగించాలని సూచించింది. ప్రస్తుతం ఉద్యోగులు వాడుతున్న వొడాఫోన్​-ఐడియా సర్వీసులను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఆ నంబర్లను రిలయన్స్ జియోకు మారుస్తున్నట్లు తెలిపింది. కేవలం రూ.37.50కే పోస్ట్​పెయిడ్​ సేవలను.. ఉద్యోగులకు అందించనున్నట్లు జియో ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - May 9, 2023 / 01:01 PM IST

జియో ఈ పేరు గత దశాబ్ధకాలంగా సంచలనంగా మారిపోయింది. ఈ సంస్థకు ప్రధాని మోదీ అండ ఉన్నట్లు కొందరు రాజకీయనాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ముందు తక్కువ ధరకే సేవలను అందించే ఆలోచనతో తొలి అడుగు వేసి ఆ తరువాత తన విస్తృతిని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది అంబానీ సంస్థ. ఫోన్ అంటేనే స్వేచ్ఛ. ఇందులో అపరిమితంగా ఏమైనా మాట్లాడుకోవచ్చు. అలాంటిది ఈ జియోకి ఇలాంటి అధికారాన్ని కట్టబెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం. ఉద్యోగులకు తక్కువ ధరకు సేవలు అందిస్తున్నామన్న ముసుగులో వ్యాపారం చేయడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నట్లు స్పష్టం అవుతోంది.

గత కొంత కాలంగా గుజరాత్​ ప్రభుత్వ ఉద్యోగులు వొడాఫోన్​-ఐడియా పోస్ట్​పెయిడ్​ సర్వీసులను వాడుతున్నారు. ఇకపై ఉద్యోగులెవ్వరూ వొడాఫోన్​-ఐడియా సర్వీసులను వాడొద్దని  గుజరాత్​ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. కేవలం నెలకు రూ.37.50కే పోస్ట్​పెయిడ్ సేవలను జియో అందిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఏ మొబైల్​ ఆపరేటర్​కైనా, ల్యాండ్​లైన్​కైనా కాల్​ చేయవచ్చని వివరించింది. దాంతో పాటు నెలకు 3వేల ఉచిత SMSలను వాడుకోవచ్చని పేర్కొంది. ఈ SMS​ల పరిధి దాటితే.. ఒక్కో మెసేజ్​కు జియో 50పైసలను ఛార్జ్​ చేస్తుందని తెలిపింది. అదే విధంగా అంతర్జాతీయ SMSలకు రూ.1.25లను ఛార్జ్​ చేస్తుందని తెలిపింది.

ప్రభుత్వం, రిలయన్స్​ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. జియో సేవలతో ఉద్యోగులకు నెలకు 30 జీబీ డేటా, 4జీ సర్వీసులతో లభిస్తుంది. వాటి పరిధి ముగిసినట్లయితే మరో 25 రూపాయలతో రీఛార్జ్​ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మరో 60 జీబీ డేటా అదనంగా లభిస్తుంది. ఒకవేళ అన్​లిమి​టెడ్​ డేటా కావాలనుకుంటే.. 125 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా 5జీ సేవలను కూడా 4జీ సేవల ధరలకే జియో అందిస్తోంది.

ఈ నిర్ణయం వెనకాల ప్రైవేట్ కంపెనీలకు అధికమొత్తంలో లాభాలను కట్టబెట్టడమే ప్రభుత్వ ధ్యేయం అని కొందరు వాపోతున్నారు. అంతగా ప్రభుత్వ ఉద్యోగులకు మంచి చేయాలన్న సత్ సంకల్పమే అయితే జియో కాంపెటీషన్ కు కుదేలవుతున్న వోడా ఫోన్, ఐడియా, ఎయిర్ టెల్ వంటి టెలికాం సంస్థలకు మద్దతు ఇవ్వచ్చుకదా.. దీనివల్ల మోనోపోలీ నుంచి కూడా వినియోగదారుడు బయటపడే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో టెలికాం సేవలను వినియోగించేందుకు ఇబ్బంది కలుగకుండా సామాన్యుడు తనకు ఇష్టంవచ్చిన కంపెనీ సేవలను ఉపయోగించుకునే వెలుసుబాటు ఉంటుంది. అలా కాకుండా వ్యాపారంలో క్రింద పడిపోయిన సంస్థలను పక్కనపెట్టి మరీ జియో నెట్వర్క్ కు మార్చడాన్ని పూర్తి స్థాయి తమ మద్దతుదారులకు ప్రోత్సహించేలా చూడాల్సి వస్తుంది. ప్రభుత్వాలు ఉద్యోగులతో పని చేయించుకోవాలే తప్ప ఇలా వారి టెలికాం సేవల విషయంలో జోక్యం చేసుకోవడం హేయమైన చర్యగా చెప్పాలి. ఇది ఈ ఒక్క రాష్ట్రంతో ఆగుతుందా.. లేక కాషాయ జండా ఎగిరే ప్రతి రాష్ట్రంలో జియో జండాను ఎగురవేసే అవకాశం కల్పిస్తుందా అని వేచి చూడాలి.

 

T.V.SRIKAR