Hindenburg: మరో బాంబ్ పేల్చబోతున్న హిండెన్‌బర్గ్‌..!

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఓ ఫైనాన్షియల్ టాస్క్‌ఫోర్స్‌.. ప్రముఖ కంపెనీల ఆర్థిక వ్యవహారాలపై కన్నేసి ఉంచుతుంది. మిస్‌మేనేజ్‌మెంట్‌, ఆర్థిక అవకతవకలు, రహస్య లావాదేవీలను పరిశోధించి బయటపెడుతుంది. షార్ట్‌సెల్లింగ్‌కు దిగి ఆ తర్వాత రహస్యాలను బహిర్గతం చేస్తుంది. దీంతో షేరు విలువ పడిపోగానే దాన్ని సొమ్ము చేసుకుంటుంది.

  • Written By:
  • Updated On - March 23, 2023 / 04:08 PM IST

ఒక్క నివేదికతో గౌతమ్‌ అదానీని (Gautam Adani) ప్రపంచ బిలియనీర్ల జాబితా నుంచి కిందకు తోసేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ (Hindenburg Research) మరో బాంబ్‌ పేల్చబోతోందా…? ఈసారి ఆ మిస్సైల్‌ ఎవరిని తాకనుంది…? భారత సంస్థలపైనా లేక అమెరికన్ కంపెనీలపైనా…?

షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ మరో ట్వీట్‌ చేసింది. అందులో రెండే రెండు ముక్కలున్నాయి. న్యూ రిపోర్ట్‌ సూన్… ఎనదర్‌ బిగ్‌ వన్ (New Report Soon.. Another Big One) అని మాత్రమే ఉంది. దాన్ని బ్టటి త్వరలో మరో నివేదికను బహిర్గతం చేయబోతున్నట్లు అర్ధమవుతుంది. అది కూడా చాలా పెద్దదని తెలుస్తోంది. బిజినెస్ ప్రపంచంలో ఇప్పుడిది పెను సంచలనంగా మారింది. నిజానికి అందులో ఎవరి పేర్లూ లేవు… కానీ బిజినెస్‌ సర్కిల్స్‌లో మాత్రం రకరకాల పేర్లు, రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో (America) బ్యాంకింగ్ సంక్షోభం నడుస్తోంది. మూడు ప్రధాన బ్యాంకులు మూతబడ్డాయి. మరికొన్ని ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుని ఉన్నాయి. దీంతో దానికి సంబంధించిన రహస్య డాక్యుమెంట్లను ఈ సంస్థ బయటపెట్టే అవకాశం ఉందన్న అనుమానాలున్నాయి. బ్యాంకుల పతనానికి కారణమైన అంశాలను లేటెస్ట్‌ నివేదిక బయటపెట్టొచ్చంటున్నారు. ఓ చైనా (China) కంపెనీని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందని మరికొందరు చెబుతున్నారు. హిండెన్‌బర్గ్ నివేదిక బయటకు వస్తే మరోసారి ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మార్కెట్లను బట్టి మన మార్కెట్లు కదులుతుంటాయి కాబట్టి ఆ ప్రభావం మనపైనా గట్టిగా ఉండే అవకాశాలు లేకపోలేదు.

రెండు నెలల క్రితం వరకు హిండెన్‌బర్గ్‌ గురించి మనకు అంత పరిచయం లేదు.. కానీ ఒక్క నివేదికతో మన మార్కెట్లను ముంచేసింది ఈ సంస్థ. ప్రపంచ నెంబర్‌-2గా ఉన్న అదానీని ఆ జాబితా నుంచి కిందకు పడిపోయేలా చేసింది ఒక్క నివేదిక. గరిష్ఠాల నుంచి చూసుకుంటే గౌతమ్ అదానీ సంపద దాదాపు 60శాతం పడిపోయింది. జనవరి 24న అదానీ గ్రూప్‌ ఆర్థిక అవకతవకలకు పాల్పడిందంటూ హిండెన్‌బర్గ్‌ 106పేజీల నివేదికను బయటపెట్టింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (Adani Enterprises) ఐపీఓకు (IPO) వస్తున్న సమయంలో వచ్చిన ఈ నివేదిక బాంబులా పేలింది. ఆ సంస్థ ఐపీఓ నుంచి వెనక్కు తగ్గింది. తామేం తప్పు చేయలేదని వివరణ ఇచ్చుకున్నా లాభం లేకపోయింది. ఐదు వారాల పాటు అదానీ సంస్థల పతనం కొనసాగింది. ఒక్క అదానీ సంపదే 2లక్షల 30వేల కోట్లకు పైగా అదానీ సంపద ఆవిరైపోయింది. ఇక అదానీ గ్రూపు సంస్థలు, మదుపరుల సంపద విలువ మొత్తంగా 12లక్షల 34వేల కోట్లకు పైగా పడిపోయిందంటే ఆ నివేదిక ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించిందో అర్ధం చేసుకోవచ్చు..

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఓ ఫైనాన్షియల్ టాస్క్‌ఫోర్స్‌.. ప్రముఖ కంపెనీల ఆర్థిక వ్యవహారాలపై కన్నేసి ఉంచుతుంది. మిస్‌మేనేజ్‌మెంట్‌, ఆర్థిక అవకతవకలు, రహస్య లావాదేవీలను పరిశోధించి బయటపెడుతుంది. షార్ట్‌సెల్లింగ్‌కు దిగి ఆ తర్వాత రహస్యాలను బహిర్గతం చేస్తుంది. దీంతో షేరు విలువ పడిపోగానే దాన్ని సొమ్ము చేసుకుంటుంది. గతంలో ఇలాగే చేసింది. మరి ఈసారి నివేదిక ఎప్పుడు వస్తుందో, ఎలా పేలుతుందో, ఎవరిని ముంచేస్తుందో చూడాలి మరి.

(KK)