UPI-ATM: ఏటీఎంలో డబ్బు డ్రా చేయాలంటే డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు ఉండాలి. ఎస్బీఐ వంటి బ్యాంకులు యోనో యాప్స్ ద్వారా ఏటీఎం నుంచి మనీ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. అయితే, ఇకపై ఏ కార్డు, స్పెషల్ యాప్స్ లేకుండానే ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవచ్చు. యూపీఐ ద్వారానే డబ్బు డ్రా చేసుకోవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ వాడి, మెషీన్‌పై కనిపించే క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి, డబ్బులు ఎంటర్ చేసి, మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపైనే ఇది పని చేస్తుంది. హిటాచి పేమెంట్స్ సర్వీసెస్ సంస్థ ఈ తరహా సేవలను త్వరలోనే అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం ముంబైలో ప్రయోగాత్మకంగా ఈ సేవల్ని ఆరంభించింది. త్వరలోనే దేశవ్యాప్తంగా 3,000 ఏటీఎంలలో యూపీఐ ద్వారా డబ్బు డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు కంపెనీ తెలిపింది.
యూపీఐ ఏటీఎం సేవల ద్వారా కార్డ్‌లెస్ సేవలు అందుతాయి. అలాగే కార్డుల్ని స్కాన్ చేసి, ఫ్రాడ్ చేసేందుకు అవకాశం ఉండదు. ఏటీఎంలలో కొందరు మోసగాళ్లు.. డెబిట్ కార్డు స్కాంలకు పాల్పడుతున్నారు. ఏటీఎంలలో కొన్ని పరికరాలు అమర్చి, కార్డుల్ని స్కాన్ చేసి, పిన్ తెలుసుకుని, ఆ తర్వాత మోసానికి పాల్పడుతున్నారు. యూపీఐ పేమెంట్స్ ద్వారా ఇలాంటివాటికి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. వినియోగదారులు ఒకేసారి ఒక్కటికంటే ఎక్కువ అకౌంట్ల నుంచి డబ్బు డ్రా చేసుకోవచ్చు. దీని ద్వారా బ్యాంకింగ్ సేవలు సులభతరం అవుతాయి. ప్రస్తుతం దేశంలో డిజిటల్ లావాదేవీల విషయంలో యూపీఐనే ముందుంది. యూపీఐ సేవలు మరింతగా విస్తరిస్తున్నాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌లో 50 శాతానికిపైగా యూపీఐదే వాటా.
యూపీఐ అకౌంట్స్ వాడేవాళ్లు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో యూపీఐ ఆధారిత ఏటీఎం సేవలకు ఆదరణ పెరుగుతుంది. బ్యాంకింగ్ రంగంలో ఇదే మైలురాయిగా నిలుస్తుందని హిటాచీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశవ్యాప్తంగా హిటాచీ సంస్థకు 65,500కుపైగా ఏటీఎంలు ఉన్నాయి. ఇందులో 27,500 వరకు క్యాష్ రీసైక్లింగ్ మెషీన్లు కాగా, 9,500 వైట్ లేబుల్ ఏటీఎంలున్నాయి. 3 మిలియన్లకుపైగా మర్చంట్ టచ్ పాయింట్స్ ఉన్నాయి. దీని ద్వారా ప్రతిరోజు 7 మిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి.