Rs 2000 notes: రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ నిర్ణయంతో ఆ నోట్లను దాచుకున్న వారిలో కంగారు మొదలైంది. కొంతమంది దగ్గరున్నది వైట్ మనీ. కాబట్టి వాళ్లకు ఎలాంటి సమస్యా లేదు. కానీ, కొందరు దాచుకున్నది బ్లాక్ మనీ. ఇలాంటి వాళ్లు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. తమ దగ్గర దాచుకున్న రూ.2 వేల నోట్లను ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. ఇలాంటి వాళ్లు ఎక్కువగా ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. భారీ సంఖ్యలో నోట్లను తీసుకెళ్లి బంగారం కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ విషయంలో ఐటీ శాఖ, కేంద్రం కొన్ని నిబంధనలు రూపొందించింది. ముఖ్యంగా బంగారం కొనుగోళ్ల విషయంలో ఈ నిబంధనలు పాటించాల్సిందే.
రెండు లక్షల వరకే పరిమితి
నగదు డబ్బుతో బంగారం కొనాలంటే కొన్ని పరిమితులు ఉన్నాయి. గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాత్రమే నగదుతో చెల్లింపులు చేయొచ్చు. రూ.2 లక్షల వరకు క్యాష్ ఇచ్చి బంగారం కొనొచ్చు. దీంతో చాలా మంది తమ దగ్గరున్న రెండు వేల రూపాయల నోట్లను చెల్లించి, రెండు లక్షల వరకు విలువైన బంగారం కొంటున్నారు. అంతకంటే ఎక్కువ మొత్తంలో నోట్లను చెల్లించాలంటే పాన్, ఆధార్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది. 2002లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పీఎంఎల్ఏ (అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం) తీసుకొచ్చింది. దీని ప్రకారం ఒక పరిమితికి మించి నగదుతో బంగారం, ఆభరణాలు వంటివి కొనుగోలు చేయకూడదు. 2020లో కేంద్రం దీనిపై నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీని ప్రకారం.. ఎక్కువ మొత్తంలో నగదుతో బంగారం కొనాలంటే కచ్చితంగా షాపు యజమానులకు పాన్, ఆధార్ వంటి కేవైసీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
అలాగే ఐటీకి సంబంధించి.. సెక్షన్ 269ఎస్‌టీ ప్రకారం.. ఒక వ్యక్తి ఒక రోజులో రూ.2 లక్షలకంటే ఎక్కువ మొత్తం నగదుతో లావాదేవీలు జరపకూడదు. దీని ప్రకారం రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు చెల్లించి ఆభరణాలు కొనుగోలు చేయకూడదు. అలా చేస్తే ఆ నగదు తీసుకుని వ్యాపారం నిర్వహించిన వాళ్లు అంతే మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఐటీకి చెందిన సెక్షన్ 114బీ నిబంధన ప్రకారం రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు చెల్లించాల్సి వస్తే పాన్, ఆధార్ తీసుకోవాలి. అలాకాకుండా డబ్బు తీసుకుంటే అంతే మొత్తాన్ని ఆ వ్యాపారే చెల్లించాలి. అందువల్ల రెండు వేల రూపాయల నోట్లు ఎన్ని ఉన్నప్పటికీ రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం నగదుతో బంగారం కొనడానికి వీల్లేదు. అలా కొంటే ఐటీకి చిక్కినట్లే.