Dum Biryani: దమ్ బిర్యానీ లాగించేస్తున్న హైదరాబాదీలు.. ఆన్‌లైన్ ఆర్డర్లలో అదరగొట్టిన బిర్యానీ

ఆన్‌లైన్ ఆర్డర్లలో బిర్యానీనే ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారని ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తెలిపింది. గత జనవరి 23 నుంచి జూన్ 15 వరకు.. ఐదు నెలల కాలంలో హైదరాబాద్‌లో స్విగ్గీలో 72 లక్షల బిర్యానీలు ఆర్డర్ చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

  • Written By:
  • Publish Date - July 1, 2023 / 10:11 AM IST

Dum Biryani: హైదరాబాద్‌లో బిర్యానీకి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. లోకల్ పీపులైనా.. బయటి నుంచి వచ్చిన వాళ్లైనా హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేయకుండా ఉండలేరు. దేశంలోని ఫేమస్ వంటకాల్లోనే హైదరాబాదీ బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంది. హైదరాబాదీలు బిర్యానీని అత్యంత ఇష్టంగా తింటున్నారట. ఆన్‌లైన్ ఆర్డర్లలో బిర్యానీనే ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారని ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తెలిపింది.

గత జనవరి 23 నుంచి జూన్ 15 వరకు.. ఐదు నెలల కాలంలో హైదరాబాద్‌లో స్విగ్గీలో 72 లక్షల బిర్యానీలు ఆర్డర్ చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా స్విగ్గీలో ఆర్డర్ అవుతున్న ప్రతి ఐదు వంటకాల్లో ఒకటి హైదరాబాద్ బిర్యానీయే అని స్విగ్గీ తెలిపింది. బిర్యానీ డే సందర్భంగా స్విగ్గీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఐదు నెలల కాలంలో హైదరాబాద్ నగరంలో బిర్యానీ ఆర్డర్లు 8.39 శాతం పెరిగాయి. ఏడాది కాలంలో 150 లక్షలకుపైగా బిర్యానీలు ఆర్డర్ చేశారు. అందులో ఐదు నెలల్లోనే 72 లక్షల బిర్యానీ ఆర్డర్లు ఉండటం విశేషం. వీటిలో దమ్ బిర్యానీ వాటానే అధికం. తొమ్మిది లక్షలకుపైగా ఆర్డర్లు దమ్ బిర్యానీలే ఉండటం విశేషం. వీటితోపాటు బిర్యానీ రైస్ 7.9 లక్షల ఆర్డర్లు, సింగిల్ బిర్యానీ 5.2 లక్షల ఆర్డర్లు వచ్చాయి. దీని ప్రకారం హైదరాబాదీలు అత్యధికంగా బిర్యానీ.. అందులోనూ దమ్ బిర్యానీని ఇష్టపడుతున్నారు.

నగరంలో మొత్తం 15,000కుపైగా రెస్టారెంట్లు బిర్యానీని అందిస్తున్నాయి. ఎక్కువ రెస్టారెంట్లు కూకట్‌పల్లి, మాదాపూర్, దిల్‌షుక్‌నగర్, కొత్తపేట, అమీర్ పేట్, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా కూకట్‌పల్లి ప్రాంతంలో ఆన్‌లైన్‌లో బిర్యానీ ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. ఆ తర్వాత మాదాపూర్, కొండాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. రెస్టారెంట్స్ మెనూలో ఎన్నో వంటకాలు ఉన్నప్పటికీ హైదరాబాదీలు మాత్రం బిర్యానీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో బిర్యానీ అమ్మకాల్లో హైదరాబాద్ దూసుకెళ్తోంది. చాలా మంది చెప్పే మాట.. బిర్యానీ అంటే.. ఎమోషన్ అని.